.
Yaseen Shaikh …… అండగా_ హైదరాబాదుండగా_ లెక్కలు_ రావన్న_ బెంగెందుకూ_ దండగ!
నేనో సదువురాని మొద్దును.
నేనే ఇంతంటే నా కొడుకు నాకంటే పెద్ద మొద్దు. తిండి విషయంలో కూడా మాకు మాంచి సామ్యం ఉంది. ఇద్దరమూ ఇష్టంగా తింటాం. ఎద్దు కడుపున మొద్దే పుడుతుందనడానికి మావాడు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్.
మా ఇద్దరికీ సదువు రాలే. మామూలు సదువే రాలేదంటే ఇంకా మ్యాథ్స్ అంటే మాకెంత గొట్టో అర్థం చేసుకోవచ్చు.
కానీ మేముండేదెక్కడ! ద గ్రేట్ హైదరాబాద్‌లో!! ఎలాంటి ఊరు బాబూ మన హైదరాబాదు!!!
Ads
మా బుజ్జిగాడికి జామెట్రీలో ‘కా’ అంటే ‘కీ’ తెలియదు. అలాంటివాడిని తీసుకెళ్లి ఓ ఇరానీ హోటల్‌లో కూర్చోబెట్టా. ఆర్డరిచ్చిన తినుబండారాలు రాగానే మాథ్స్ చెప్పడం మొదలుపెట్టా.
‘‘అరేయ్ బుజ్జిగా… ఇది ఉస్మానియా బిస్కెట్. వృత్తం అనగానే దీన్ని గుర్తుకు తెచ్చుకో. తెచ్చుకున్నావా… ఇప్పుడిది తినేయ్.
ఇది ఛోటా సమోసా. త్రిభుజమనగానే నీకిదే స్ఫురించాలి.
ఇగ చతురస్రమంటే… మనం ఇష్టంగా తినే ‘లుఖ్మీ’, అలాగే పాయాలోకి తినే ‘షిర్‌మాల్ రోటీ’ల్లాంటి షేపే దీనికి కూడా.
ఇగ దీన్ని చూడు… దీన్ని ‘దిల్‌పసంద్’ అంటారు కదా. మన పిజ్జా ఉంది చూశావా? దీన్నీ అలాగే మామూలుగా ఆరు భాగాలుగా కోసి తింటారుగా… ఆ ఒక్కో భాగం ఒక్కో ‘సెక్టర్’ అన్నమాట.
అలాగే ఓసారి మన చార్మినార్‌ను గుర్తుకు తెచ్చుకో. ఫ్రంట్ ఎలివేషన్‌లో చార్మినార్ ‘పై’నున్న రెండు కొమ్ములను తీసేస్తే కనిపించేదే ‘పై’. మనం 24/7 తిండి తింటుంనే ఉంటాంగా… పైనున్న దాంట్లోంచి రెండు తీసేయ్. అప్పుడు వచ్చే 22/7 యే దీని విలువ.
ఇప్పుడు ఆల్జిబ్రా గుండె ఘాబరాకు వద్దాం!
ఇందులో ‘ఎక్సూ’, వై… ఇలాంటి ఇంగ్లిషు పదాలు ఎక్కడబడితే అక్కడ వస్తుంటాయి. గోల్కొండ ‘ఎక్స్’ రోడ్డూ, ఆర్టీసీ ‘ఎక్స్’ రోడ్డు దగ్గర రోడ్లు అడ్డంగా చీల్చుకున్నట్టు కనిపించేదే ఎక్సు. అలాగే బాలానగర్ ‘వై’ జంక్షన్లోలా ఉండే రోడ్డే ‘వై’.
ఇగ మన మలక్‌పేట దగ్గర్నుంచి సంతోష్‌నగర్ వైపు పోయే ఫ్లైఓవర్ గుర్తుకు తెచ్చుకో. అది అచ్చం ‘అల్ఫా’ అక్షరంలా మెలిదిరిగి ఉంటుందని గుర్తుంచుకో.
మాథ్స్ పరీక్షలో ఎలాగోలా గుర్తుంచుకొని ఇవి రాయి… చాలు.
అని ఉపదేశించా.
ఇలా హైదరాబాద్ అండ చూసుకుని, అలా తిండి పట్ల మా ఇష్టాల్ని ఆసరాగా తీసుకుని… నాకూ లెక్కలు రాకున్నా… ఎలాగోలా నా కొడుకును వెంట్రుకవాసిలో మాథ్స్‌లో పాసయ్యేలా చేశా.
థ్యాంక్యూ హైదరాబాద్!
తిండి పట్ల మా అభిరుచులకూ ఓ పెద్ద థ్యాంక్యూ!! – యాసీన్
Share this Article