.
ప్రతి దానికీ మనువాద కుట్ర అనే రాజకీయ విమర్శలు చూస్తుంటాం కదా… ఈ విమర్శకుల్లో మెజారిటీ జనానికి అసలు మనువాదం అంటే ఏమిటో తెలియదు… సేమ్, రేవంత్ రెడ్డి మీద అసహనంతో ఊగిపోతున్న బీఆర్ఎస్ క్యాంపు ఏదో గాలి పోగేసి, గాయగత్తర లేపి, అశాంతిని వ్యాప్తి చేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది…
బీఆర్ఎస్ క్యాంపు చేసే విమర్శలన్నీ దాదాపు అలాంటివే… తాజా ఉదాహరణ చూద్దాం ఓసారి… మేడారంలో 250 కోట్ల ఖర్చుతో అభివృద్ది పనులు చేస్తోంది ప్రభుత్వం… అది పదేళ్ల కేసీయార్ పాలనకు చేతకాలేదు… ఈ గిరిజన కుంభమేళా రూపురేఖల్ని మార్చేస్తోంది…
Ads
ఐతే విగ్రహాలు రుద్దుతున్నారు, కాకతీయ తోరణం పోలిన స్థంభాలు పెడుతున్నారు… ఇది ఆదివాసీ సంస్కృతికి విరుద్ధం, ఏ కాకతీయ రాజరికంపై పోరాడి దేవతలయ్యారో, వాళ్లనూ కించపరిచే నిర్మాణాలు అని ఆమధ్య వార్తలు రాశారు నమస్తే తెలంగాణలో…
సింపుల్… గాయిగత్తర రేపడమే ఆ పొలిటికల్ ఎజెండా… ఈ ప్రచారాలకు ఆదిలోనే ఫుల్ స్టాప్ పెట్టాలని సాక్షాత్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే వెళ్లాడు… గిరిజన పూజారులతో మాట్లాడాడు, డౌట్లు తీర్చాడు, వెంట అదే ఆదివాసీలకు చెందిన మంత్రి సీతక్క కూడా ఉంది…
ఆదివాసీ మనోభావాలకు వీసమెత్తు నష్టం లేకుండా చూస్తానని హామీ ఇచ్చాడు… అన్నట్టుగానే సమ్మక్కకు చెందిన పాత తరాల గొట్టుగోత్రాలు కూడా గుర్తుండేలా… వందలేళ్ల తాళపత్రగ్రంథాల్లో ఉన్న ముద్రల్ని స్థంభాలపై చెక్కిస్తున్నారు… అది చరిత్రను శిలాక్షరం చేయడం… బీఆర్ఎస్ క్యాంపు సహించలేకపోతోంది… తాజా ఓ కథనం వదిలారు…

అదేమంటే..? స్థంభాలపై తిరునామాలు, ఇతరత్రా హిందూ ఆగమ శాస్త్ర గుర్తులు పెడుతున్నారు… పక్కా ఆదివాసీ వ్యతిరేకం… ఒత్తిడి వల్ల గిరిజన పూజారులు కూడా మాట్లాడలేకపోతున్నారు అంటూ… మేడారంపై బ్రాహ్మణీయాన్ని రుద్దుతున్నారు అని ఒకటే అక్షర శోష… ఘోష…

సేమ్, ప్రతి దానికీ మనువాదం ముద్ర వేసినట్టే… ఇక్కడ రెచ్చగొట్టడానికి, గోకడానికి బ్రాహ్మణీయ ముద్ర… నిజానికి సాధారణంగా “బ్రాహ్మణీయం” లేదా వైదిక సంప్రదాయం అంటే అక్కడ కొన్ని నిర్దిష్టమైన లక్షణాలు ఉండాలి…
-
విగ్రహారాధన…: శాస్త్రోక్తంగా ప్రాణప్రతిష్ఠ చేసిన విగ్రహం ఉండాలి…
-
ఆగమ శాస్త్రం…: పూజలు, ఉత్సవాలు ఆగమ నియమాల ప్రకారం జరగాలి….
-
అభిషేకాలు & మంత్రాలు…: సంస్కృత మంత్రోచ్ఛారణలు, నిత్యం జరిగే షోడశోపచార పూజలు ఉండాలి….
-
పూజారుల వ్యవస్థ…: వంశపారంపర్యంగా వచ్చే బ్రాహ్మణ పూజారులు ఆచారాలను నిర్వహించాలి…
కానీ ఇవేవీ మేడారంలో ఉండవు, ఆదివాసీలు రానివ్వరు… గతంలో కొన్ని ప్రయత్నాలు జరిగినా వ్యతిరేకించారు.., వాళ్ల కల్చర్‌ను వాళ్లు రక్షించుకుంటున్నారు… పైగా మంత్రి సీతక్క స్వయంగా ఆదివాసీ… ఎవరో ఎందుకు..? ఎవరో ఏదో రుద్దాలని చూస్తే ముందుగా వ్యతిరేకించేది ఆమే…
ఆ వనాన్ని కాంక్రీట్ వనం చేస్తున్నారని మరో ఆరోపణ… నిజానికి ఏం జరుగుతోంది..?

తల్లి గద్దెల చుట్టూ అరుదైన చెట్లను పెడుతున్నారు… గోత్రపూజల చెట్లు… మేడారం ఉన్నదే వనంలో… ఐనా గద్దెల చుట్టూ ఆదివాసీలు పూజించే, గౌరవించే రకాల చెట్లను నాటనున్నారు… 140 రకాల ఆయుర్వేద చెట్లను కూడా ఆ పరిసరాల్లో పెంచబోతున్నారు… మూలికావైద్యం ఆదివాసీ జీవనవిధానంలో ఓ భాగం… దాన్ని గౌరవించడాన్ని నిజానికి మెచ్చుకోవాలి…

పనులు వేగంగా సాగుతున్నాయి… ఆల్రెడీ గోవిందరాజు, పగిడిద్ద రాజు గద్దెలు అనుకున్నట్టే పూర్తి చేశారు… త్వరలోనే సమ్మక్క, సారలమ్మ గద్దెలు, స్థంభాలు, ప్రహరీలు కొత్త రూపు సంతరించుకోబోతున్నాయి… ఇవి భక్తుల రద్దీ నిర్వహణకూ ఉపయోగపడేలా ప్లాన్ చేశారు… అదీ బాగా మసులుతున్నట్టుంది బీఆర్ఎస్ క్యాంపులో…
అందుకే మళ్లీ కొత్త కథల వ్యాప్తి… ఆదివాసీలు కాకతీయుల కాలంలో శైవాన్ని, వైష్ణవాన్ని కూడా ఆదరించలేదా..? తిరునామాలు, శివలింగం, స్వస్తిక్ ఉంటే తప్పేమిటి..? వాళ్ల తాళపత్ర గ్రంథాల చరిత్రను బట్టే కదా స్థంభాలపై ముద్రలు… మరి బ్రాహ్మణీయం ఏముంది..?

ఇక్కడేమీ విగ్రహాలు పెట్టడం లేదు… అవే గద్దెలు, అవే పూజలు… ఓపెన్ టెంపుల్… టెంపుల్ అని కూడా కాదు, ఆరాధన స్థలాలు… అంతే… గుళ్లు, మండపాలు, ఆగమ శాస్త్ర అర్చనలు గట్రా ఏమీ లేవు… ఉండవు… కొబ్బరికాయ, బెల్లం, బలి… పూజలన్నీ ఆదివాసీ కోయ పూజారులే (సిద్ధబోయిన, చందా వంశస్థులు) నిర్వహిస్తారు…. అక్కడ ఏ బ్రాహ్మణ పూజారి లేదా వైదిక మంత్రాలు ఉండవు…
నిజమైన “బ్రాహ్మణీకరణ” లేదా “వైదీకరణ” అంటే పూజా పద్ధతులు మారాలి కదా.., పూజారులు మారాలి కదా… సో, ఈ కథనాల వ్యాప్తి కేవలం పొలిటికల్ ఎజెండా… భావోద్వేగాలకు రెచ్చగొట్టే ఓ రకం క్షుద్ర విద్య… చివరకు తమ ఎజెండాను దేవుళ్లను, దేవతలను కూడా వదలని ‘చేతబడి’…!!
అన్నట్టు, ఈ బ్రాహ్మణీయ కథనం సంచలనం సృష్టించిందట... నమస్తే తెలంగాణ జబ్బలు చరుచుకుంది ఈరోజు..!! తిరునామాల ముద్ర ఆదివాసీ ఆచారాలపై సాంస్కృతిక ఆధిపత్యం అట... జస్ట్, ఆ ఒకటీరెండు ముద్రలతో ఇక మేడారం బ్రాహ్మణీయ వశమైపోయిందట..!! అవునూ... ఆదివాసీ మేడారం పూజారులు ఆమోదించాకే కదా ఈ పునర్నిర్మాణాలు... అంటే ఈ గాయిగత్తర ప్రచారాలతో వాళ్లను కించపరుస్తున్నారా..?

Share this Article