Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రాబందు’వులొస్తున్నారు జాగర్త…! కానీ ఇప్పుడలాంటి సీన్లు లేవు…!!

December 28, 2025 by M S R

.

Subramanyam Dogiparthi …… ఎప్పుడు సంపద కలిగిన అప్పుడె బంధువులు వత్తురది ఎట్లన్నన్, దెప్పలుగ జెరువు నిండిన గప్పలు పది వేలు చేరు గదరా సుమతీ . మనలో చాలామందికి తెలిసిన పద్యం ఇది . ఈ పద్యం ఎప్పుడూ నిజమే . ఇప్పటితో సహా .

అయితే అప్పట్లోలాగా బంధువులు రోజులకురోజులు తిష్ట వేసే కాలం ఇప్పుడు లేదు . మనం రమ్మన్నా వచ్చే వాళ్ళే లేరు . ఎవరి పనులు వారివి . వచ్చిన దగ్గర నుంచి పోతాం పోతాం అనే వాళ్ళే . ఒక వేళ ఉండాల్సి వచ్చినా ఊళ్ళో ఏదో హోటల్లో రూంలు బుక్ చేయాల్సిందే .

Ads

ఇంక ఈ సినిమాకొస్తే…. కధేంటంటే ఒంటరి వాడు రాజేంద్రప్రసాద్ . నా అనే వాళ్ళు ఎవరూ ఉండరు . మద్రాసులో ఓ బాంకులో ఉద్యోగి . తన చుట్టూ ఎప్పుడూ మిత్రులు ఉండాలని కోరుకుంటూ ఉంటాడు . అలాంటి మిత్రుల్లో ఒకడయిన శుభలేఖ సుధాకర్ వాళ్ళ ఊరు వెళ్ళి వాళ్ళ బలగానికి ఫిదా అవుతాడు .

సత్యనారాయణ , అన్నపూర్ణ కుమార్తె రజనిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు . మద్రాసులో హాయిహాయిగా కాపురం సాగుతూ ఉంటుంది . బెల్లం చుట్టూ ఈగల్లాగా బాదరాయణ బంధువులు కట్ట కట్టుకుని దిగిపోతారు .

సూర్యకాంతం , కొడుకు సుత్తి వేలు , అతని భార్య శ్రీలక్ష్మి ఒక ముఠా . కోట శ్రీనివాసరావు , అతని కూతురు వయ్యారాల వై విజయ ఒక ముఠా . రావి కొండలరావు , ఆయన భార్య రాధాకుమారి ఒక ముఠా . బ్రహ్మానందం ఒక్కడే ఒక ముఠా . అత్తమామలు సత్యనారాయణ , వాళ్ళ కొడుకు కూడా దిగిపోతారు .

అందరూ కలిసి విడిదిలో దిగిన మగ పెళ్ళి వారిలా గొంతెమ్మ కోరికలతో రాజేంద్రప్రసాద్ నార తీస్తుంటారు . ఇంక వాళ్ళని వదిలించుకోవాల్సిన టైం వచ్చేస్తుంది . భార్యభర్తలు , శుభలేఖ సుధాకర్ , బ్రహ్మానందం ఓ ప్లాన్ , మారువేషాలు వేసి మొత్తానికి వాళ్ళని వదిలించుకుంటారు .

మారు వేషంలో సోది చెప్పే స్త్రీగా శుభలేఖ సుధాకర్ భలే బ్యూటీగా ఉంటాడు . వాళ్ళందరినీ బస్సు ఎక్కించగానే గొల్లపూడి భార్యాసమేతుడై బంధుత్వాన్ని కలుపుకుంటూ దిగిపోవటంతో సరదాగా సినిమా ముగుస్తుంది .

తనను మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం సామెత మనందరికీ తెలిసిందే . తెలిసినా కొంత మంది మంచివారు బంధువుల కోసం , స్నేహితుల కోసం , అడిగిన/అడగని ప్రతి వారి కోసం ఎగేసుకుని సాయం చేస్తూ ఉంటారు .

సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో రాజేంద్రప్రసాద్ డైలాగ్ ఒకటి ఉంటుంది . వీడికి మంచి వాడిని అని అనిపించుకోవాలనే జబ్బు ఉంది అని అల్లు అర్జున్ని అంటాడు . అది నిజమే కొందరి విషయంలో . ఇస్తుంటే వస్తుంటారు . కాకికి కూడా చెయ్యి విదిలించని వారి దగ్గరికి ఎవడూ పోడు . ఇలాంటి సత్యాలన్నీ చెపుతుంది ఈ సినిమా . హాస్యంగా అనిపించినా మంచి సందేశం ఉన్న సినిమా .

చక్రవర్తి సంగీత దర్శకత్వంలో పాటలు శ్రావ్యంగా ఉంటాయి . టైటిల్ సాంగ్ జాగర్త జాగర్త బంధువులొస్తున్నారు జాగర్త పాట చాలా బాగుంటుంది . టైటిలుతో పాటు సినిమా మధ్యలో కూడా అక్కడక్కడ వస్తుంది . రాజేంద్రప్రసాద్ , రజని డ్యూయెట్ మధుర మదన తాపం శ్రావ్యంగా ఉంటుంది . చిత్రీకరణ కూడా బాగుంటుంది .

చెలగాటం చేతికి ముద్దు , అందాలత్తకి మందారప్పొడి అనే డ్యూయెట్లు కూడా బాగుంటాయి . మా సిరికి మీ హరికి పెళ్లి పండగ అనే గ్రూప్ సాంగ్ చిత్రీకరణ బాగుంటుంది . శ్రావ్యంగా ఉంటుంది . పాటలన్నీ వేటూరి వారే వ్రాయగా బాలసుబ్రమణ్యం , సుశీలమ్మ వాటిని పాడారు .

రాజేంద్రప్రసాద్ , శుభలేఖ సుధాకర్ , రజని చాలా హుషారుగా నటించారు . అలాగే సత్యనారాయణ , అన్నపూర్ణలు అన్నీ దిగమింగుకుని ఇబ్బందులు పడటానికే పుట్టాం అన్నట్లు జంటగా ఒద్దికగా నటించారు . రాజేంద్రప్రసాదుని పీక్కుతినే పాత్రల్లో సూర్యకాంతం , కోట , రావి కొండలరావు బ్రహ్మాండంగా నటించారు . శ్రీలక్ష్మి , వై విజయ అదరగొట్టేస్తారు .

చక్కటి కుటుంబ హాస్య రస సందేశాత్మక సినిమా . పోలవరపు శరత్ డైరెక్టర్ . గిరిజా భగవాన్ కధను నేసాడు . ఇంతకుముందు చూసినా టైం ఉన్నప్పుడు సరదాగా ఈ సినిమాను చూసేయవచ్చు . యూట్యూబులో ఉంది .

నేను పరిచయం చేస్తున్న 1206 వ సినిమా …. #తెలుగు_సినిమాల_సింహావలోకనం #తెలుగుసినిమాలు #సినిమా_స్కూల్ #సినిమా_కబుర్లు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రాబందు’వులొస్తున్నారు జాగర్త…! కానీ ఇప్పుడలాంటి సీన్లు లేవు…!!
  • ఎవరు తప్పుదోవ పట్టించారో గానీ… రేవంత్ రెడ్డి దిద్దుకోవాల్సిన పాలసీ…
  • పాత కేసుల్ని కెలుకుతున్న బండి సంజయ్…! కేటీఆర్‌పై డ్రగ్స్ దాడి..!!
  • జలద్రోహి ఎవరు..?! కవిత చెప్పిన చేదు నిజాల్ని అసెంబ్లీలో వినిపిస్తే సరి..!!
  • సమస్య బట్టలు కాదు… అది మూక ఉన్మాదం… మగాళ్లనూ వదలరు…
  • మేల్ శ్రీముఖి..! ఆ హాలీవుడ్ చెత్తతో మన పురాణాలకూ పోలికేమిటి.,.!!
  • దాదాపు ఏడాదిపాటు ప్రతిరోజూ వీఐపీ లాంజులో ఫ్రీ మందు, ఫ్రీ విందు…!!
  • తేడా వస్తే… ఆదుకునేవాడు ఉండడు … ఆడుకునేవాళ్లు తప్ప…
  • రాముడి అయోధ్యలో ఓ కొరియన్ రాణి విగ్రహావిష్కరణ..! ఏమిటీ ఆమె కథ..!!
  • మేడారంపైనా బీఆర్ఎస్ క్యాంప్ ‘చేతబడి’..!! రాజకీయ క్షుద్ర విద్య…!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions