చైనా అంటేనే అంత..! అబ్బే, జీవాయుధాలుగా వైరసులను ప్రపంచం మీదకు వదలడం గురించి కాదు… ఏ విషయంలోనైనా అంతే… ప్రతి పాలసీలోనూ బోలెడంత కాంట్రడిక్షన్, కంట్రాస్టు ఎట్సెట్రా… ఉదాహరణకు… పర్లేదు, ఇకపై ప్రతి జంట ముగ్గురు పిల్లల్ని కన్నా సరే అని సంతాన ఆంక్షల్ని సడలించింది కదా… కానీ ఒక్క జింజియాంగ్ ప్రావిన్సులో మాత్రం పూర్తి విరుద్ధంగా వెళ్తుంది… ఎక్కువ పిల్లలుంటే జరిమానాలు, నిర్బంధ అబార్షన్లు వగైరా ప్రయోగిస్తూ ఉంటుంది… ఎందుకంటే అక్కడ ముస్లింల జనాభా పెరగకూడదని..! తమ దేశంలోకి ఇస్లామిక్ ఉగ్రవాదం వ్యాప్తి చెందకుండా చైనా ప్రభుత్వం జింజియాంగ్ ప్రావిన్సులో ప్రయోగించే దమనకాండ ఓ పెద్ద అధ్యాయం… అమానవీయం… అదే చైనా ఇప్పుడు ‘‘ఇందుమూలముగా అందరూ మూడేసి మంది పిల్లల్ని కనండహో’’ అని మిగతా ప్రాంతాల్లో పిలుపునిచ్చింది… అంతా ప్రభుత్వ ఇష్టం, ఒకరిని మాత్రమే కనాలి అంటే, ఒకరే…
పోనీ, ఎక్కువ సంతానంతో జనాభా ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయి, దేశవనరులు సరిపోక అవస్థలు పడతాం కాబట్టి, ఒక్కరితో ఆపేద్దాం అని 1979లోనే నిర్ణయించుకున్నారు, నిర్బంధంగా అమలు చేశారు, మంచి పని చేశారు అనుకుందాం… కానీ కాలం ఒక్క తీరుగా ఉండదు కదా… ఈ పాలసీ కాస్తా మొదటికే మోసం తెచ్చేట్టు మారింది… వెంటనే నినాదం మార్చేసి 2000లో… ‘ఇద్దరేసి కనండి, పర్లేదు’ అన్నారు… కాకపోతే చిన్న షరతు… భార్యాభర్తలు తమ తల్లిదండ్రులకు గనుక ఒక్కరే సంతానం అయిన పక్షంలో… మీరు రెండో బిడ్డను కనొచ్చు అని సడలింపు… అర్థం కాలేదా..? సపోజ్, ఏ, బీ ఒక జంట… సీ, డీ మరో జంట… ఏబీలకు ఈ అనే బిడ్డ, సీడీలకు ఎఫ్ అనే కొడుకు… ఈ, ఎఫ్ పెళ్లి చేసుకున్నారు… ఇలాంటి వాళ్లు ఇద్దరేసి పిల్లల్ని కనొచ్చు అనేది రూల్… అంటే ఒక తరంలోని నలుగురు, మరో తరంలోకి ఇద్దరు, ఆ తరువాత తరంలోకి ఒక్కరు… జాగ్రత్తగా అర్థం చేసుకుంటే దీని సామాజిక, జాతి నష్టం ఏమిటో తెలుస్తుంది… సరే, మొత్తానికి చైనాకు అర్థమైంది ఓ సడలింపు ఇచ్చింది…
Ads
అప్పటిదాకా ఒ:కరికి మించి పిల్లల్ని కంటే జరిమానాలు, కొలువుల కోతలు, అబార్షన్లు, కడుపుకోతలు… అంత కఠినంగా వ్యవహరించేది… క్రమేపీ ఏం జరిగింది..? సగటు ఆయుప్రమాణం పెరిగింది… వృద్ధులు పెరిగారు… కొత్త తరం పెరగడం లేదు… ఇప్పుడు ప్రపంచమంతా మానవవనరులను నిజమైన వనరులుగా పరిగణిస్తోంది… ఈ స్థితిలో పనిచేసే జనం తగ్గిపోయి, కొత్తగా పుట్టుకొచ్చే అవకాశాలు తగ్గిపోయి, పనిచేయలేని కేటగిరీ పెరిగిపోయి, ప్రభుత్వానికి భారంగా మారిపోయి… చైనా వేసుకున్న ఎకనామిక్స్ లెక్కలు బోల్తాకొట్టడం స్టార్టయింది… అందుకని రెండో సంతానం వోకే అన్నారు… అదీ ఫలించలేదు… దాంతో 2013లో ఇంకాస్త సడలింపులు ఇచ్చారు… నువ్వు చెప్పగానే రెండో పిల్లాడిని కనేయాలా..? ఎవరు పెంచాలి..? ఈ జీవనవ్యయానికి ఒక్కరు చాలు అని చైనా జనం ఫిక్సయిపోయారు… ప్రభుత్వాలు చెప్పగానే పిల్లల్ని కనాలి, వద్దనగానే మానేయాలా..? ఇదీ ప్రశ్న… ఇక లాభం లేదని 2015 నుంచి ఆ నిబంధన ఎత్తిపారేసి, ఏ జంటయినా రెండో పిల్లాడిని కనొచ్చు, ఏ షరతులూ లేవని ప్రకటించేసింది… ప్చ్, ఐనా లాభం లేదు…
ఇదీ ఫలించలేదు… ఇప్పటికే 19 శాతం మంది అరవయ్యేళ్లు పైబడినవాళ్లే… పైన గ్రాఫ్ చూడండి, ఏటేటా చైనా జనాభా వృద్ధి రేటు ఎలా పడిపోయిందో… ఇదిలాగే కొనసాగితే ఏం జరుగుతుంది..? మూడో వంతు జనాభా ముసలోళ్లే అవుతారు… సోషల్ సెక్యూరిటీ, పెన్షన్లు, హెల్త్ కేర్ వంటి భారాలు ప్రభుత్వంపై పెరుగుతాయి… మరోవైపు అసలు పిల్లల్ని కనే యువజనం సంఖ్య తగ్గిపోతోంది… అంటే రాబోయే తరాల మాటేమిటి..? సో, ఇప్పుడు ముగ్గురు పిల్లల్ని కనండోయ్ అంటోంది… అసలు ఇద్దరు పిల్లల్ని కనడమే చైనా యువతకు ఇష్టం లేదు… అలా ట్యూనయ్యారు, పైగా ఇద్దరేసి, ముగ్గురేసి పిల్లల్ని పెంచి, ప్రయోజకుల్ని చేయడం కష్టంగా మారింది… ఇక ముగ్గురి జోలికి వెళ్తారా..? ఇదీ అసలు ప్రశ్న..!!
Share this Article