.
ఇటీవల సుప్రీంకోర్టు ఒక అత్యాచారం కేసు విచారణలో అరుదైన తీర్పునిచ్చింది… పరస్పర అపార్థాల వల్ల విడిపోయి, కేసుల వరకు వెళ్లిన ఒక జంటను తిరిగి కలిపేలా తన అసాధారణ అధికారాలను ఉపయోగించింది… బాధితురాలు, నిందితుడు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండటంతో వారిపై ఉన్న కేసును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది…
ఏమిటీ కేసు?
Ads
-
మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాకు చెందిన ఒక యువతీ యువకుడు 2015లో సోషల్ మీడియాలో పరిచయమై రిలేషన్ షిప్‌లోకి వెళ్లారు…
-
2021లో పెళ్లి విషయంలో మనస్పర్థలు రావడంతో, యువతి సదరు యువకుడిపై అత్యాచారం కేసు పెట్టింది…
-
దీంతో ట్రయల్ కోర్టు అతనికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించడమే కాకుండా, అతను చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగం నుంచి సస్పెండ్ అయ్యేలా చేసింది…
-
అయితే, సుప్రీంకోర్టు విచారణలో ఉన్నప్పుడు వారు పెళ్లి చేసుకునేందుకు అంగీకరించారు… జూలై 2024లో వారు వివాహం చేసుకున్నారు…
న్యాయస్థానం ఏమందంటే?
ఈ కేసును విచారించిన జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మల ధర్మాసనం… వీరిద్దరూ మున్ముందు కలిసి ఉంటారని తమ ‘సిక్స్త్ సెన్స్’ ముందే చెప్పిందని వ్యాఖ్యానించారు… ఆర్టికల్ 142 ప్రకారం తమకున్న విశేషాధికారాలను ఉపయోగించి నిందితుడిపై ఉన్న శిక్షను రద్దు చేస్తూ, అతని ఉద్యోగాన్ని, పెండింగ్ జీతభత్యాలను పునరుద్ధరించాలని ఆదేశించింది…

సో, ఇక్కడి వరకూ బాగుంది… కానీ ప్రశ్నార్థకాలు ఇంకొన్ని మిగిలే ఉన్నాయి… ఇది నాణేనికి ఉన్న రెండో వైపు!
ఈ తీర్పు ఒక జంటను కలిపినందుకు ఆహ్వానించదగ్గదే అయినా, దీని వెనుక కొన్ని గంభీరమైన ప్రశ్నలు ఉదయిస్తున్నాయి…
1. పరస్పర అపార్థాలు వచ్చినప్పుడు నేరుగా ‘అత్యాచారం’ కేసు పెట్టడం అనేది చట్టాన్ని ఒక ఆయుధంగా వాడుకోవడం కాదా? ఒకవేళ సదరు వ్యక్తి పెళ్లికి ఒప్పుకోకపోయి ఉంటే, కేవలం అపార్థం కారణంగా ఒక నిరపరాధి ఏళ్లపాటు జైల్లో గడపాల్సి వచ్చేది కదా…? (కింది కోర్టు తనకే పదేళ్ల జైలుశిక్ష వేసింది… హైకోర్టు కూడా సేమ్…)
2. ఏళ్ల తరబడీ రిలేషన్ షిప్‌లో ఉండి, ఆ తర్వాత అది బెడిసికొట్టగానే తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు పెట్టడం వల్ల కోర్టుల సమయం వృథా అవుతోంది… తప్పుడు కేసు పెట్టిన వారిపై ఎలాంటి చర్యలు లేకపోవడం వల్ల ఇలాంటి ఫిర్యాదులు పెరిగే అవకాశం ఉందనే ఆందోళన మాటేమిటి..?
3. ఈ కేసులో నిందితుడు తన గౌరవాన్ని కోల్పోయాడు, ఉద్యోగం నుండి సస్పెండ్ అయ్యాడు, ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది… చివరకు తీర్పు అనుకూలంగా వచ్చినా, అతను అనుభవించిన మానసిక వేదనకు, పోగొట్టుకున్న సమయానికి పరిహారం..? (అన్నింటికీ మించి ఎవరైతే తమ ప్రేమబంధాన్ని విచ్ఛిన్నం చేసి, ఏకంగా అత్యాచారాల కేసులు పెట్టి, జైలు శిక్ష కూడా వేయించిందో ఆ మహిళనే మనస్సు చంపుకుని, పెళ్లి చేసుకుని, ఇక లైఫ్ లాంగ్ తనతో గడపాలి..)
4. ఆర్టికల్ 142 అనేది అత్యంత క్లిష్టమైన, రాజ్యాంగపరమైన సమస్యల్లో వాడాల్సిన అధికారమని న్యాయ నిపుణులు అంటుంటారు… ఇలాంటి వ్యక్తిగత కేసుల్లో దీన్ని వాడటం సరైనదేనా అనే ప్రశ్న కూడా ఉంది…
ముగింపు…: న్యాయం అంటే కేవలం శిక్షించడం మాత్రమే కాదు, విడిపోయిన వారిని కలపడం కూడా అని సుప్రీంకోర్టు చాలా పాజిటివ్ కోణంలో భావించి ఉండవచ్చు… కానీ, అదే సమయంలో చట్టం వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి వేదిక కాకూడదని, తప్పుడు కేసులు పెట్టేవారిని అడ్డుకునేలా వ్యవస్థ ఉండాలనే కోరిక కూడా సమంజసమే కదా..!!
Share this Article