.
తనకు మాలిన ధర్మం… అనాలోచిత రాజకీయ నిర్ణయం… ఏమిటీ అంటారా..? సంక్రాంతి సమయంలో హైదరాబాద్ – విజయవాడ రూటులో టోల్ ఫ్రీ జర్నీకి నిర్ణయించడం… ఆ టోల్ డబ్బులు మేమే కడతామని రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి కోమటిరెడ్డి చెప్పడం…
హైదరాబాదు నుంచి పండక్కి ఆంధ్రాకు వెళ్లే వాహనాలకు జనవరి 9 నుంచి 14 వరకు… అలాగే జనవరి 16 నుంచి 18 వరకు తిరుగు ప్రయాణంలో విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే వాహనాలకు టోల్ ఫీజు మినహాయించాలని కోరుతూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఆయన లేఖ రాశాడు…
Ads
మరి హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, కర్నూలు, జహీరాబాద్ రూట్లలో వెళ్లే ప్రయాణికులు ఏపాపం చేశారు మంత్రి మహోదయా అనే విమర్శ వెంటనే కోమటిరెడ్డి మీద పడింది… నువ్వు తెలంగాణ మంత్రివి, నీకు తెలంగాణ వాహనాల టోల్ గుర్తుకు రాలేదా అనే ప్రశ్నకు సహజంగానే కోమటిరెడ్డి దగ్గర నో ఆన్సర్…
సినిమాల ప్రిరిలీజు ఈవెంట్లు, టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలకు సంబంధించే బదనాం అయిన కోమటిరెడ్డి చివరకు అనాలోచితంగా చేసే ఇలాంటి ప్రకటనలతో మరింత బదనాం కావడం మినహా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నయాపైసా ప్రయోజనం లేదు, పైగా నవ్వులపాలు…
ఎందుకు రాజకీయంగా రాంగ్ డెసిషన్..?
నవ్వులపాలు అనడానికి కారణం చెప్పుకుందాం… ఎలాగూ గడ్కరీ అంగీకరించడు… ఒక్కసారి ఈ ప్రతిపాదనకు అంగీకరిస్తే ఇక దేశవ్యాప్తంగా పలు సందర్భాలకు ఇలాంటి కోరికలు, డిమాండ్లే వస్తాయి… దీంతో ప్రభుత్వమే టోల్ ఓనర్లకు ఉల్టా టోల్ పే చేయాల్సి ఉంటుంది… అసలే ఈ టోల్ అనేది పెద్ద దందాగా మారిందనే విమర్శల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అంగీకరించదు…
- నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) నిబంధనల ప్రకారం, టోల్ మినహాయింపు అనేది చాలా అరుదుగా (యుద్ధం లేదా ప్రకృతి వైపరీత్యాల సమయంలో) జరుగుతుంది…
ఇక రాష్ట్ర ప్రభుత్వమే కట్టాలనే నిర్ణయం ఆచరణలో కష్టం… పైగా ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వమే తెలంగాణలో నడుస్తుందంటూ బీఆర్ఎస్ రోజూ ఎత్తిపొడుస్తోంది… రకరకాల సందర్భాల్లో చంద్రబాబు, రేవంత్ రెడ్డి గురుశిష్య సంబంధం, చంద్రబాబు చెప్పినట్టు ఈ ప్రభుత్వం ఆడుతోందని ఆరోపిస్తోంది…
ఈ కోమటిరెడ్డి ప్రతిపాదనతో ఏమవుతుంది..? ఆంధ్రాకు వెళ్లే వాహనదారులకు హేపీ… కానీ తెలంగాణ ప్రజల్లో ఓ భావన మరింత బలపడుతుంది… ఆంధ్రా వాళ్లకు ఉపయోగపడే నిర్ణయాలు తప్ప రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరేమీ ఆలోచించదా అనే భావనను ప్రభుత్వమే చేజేతులా పెంచినట్టవుతుంది… అందుకని పొలిటికల్ కోణంలో కోమటిరెడ్డి ప్రకటన, గడ్కరీకి లేఖ ఓ అబ్సర్డ్…

తెలంగాణ పండుగల సోయి ఏమైంది..?
సంక్రాంతి గురించి ఆలోచించావు సరే, మరి తెలంగాణలో దసరా, బతుకమ్మలు పెద్ద పండుగలు కదా… హైదరాబాద్ నుంచి తెలంగాణలోని తమ స్వగ్రామాలకు వెళ్తుంటారు కదా… మరి మొన్నటి దసరాకు ఈ ఆలోచన ఎందుకు రాలేదు మంత్రికి..? ఎంతసేపూ ఆంధ్రా ధ్యాసేనా..? తెలంగాణ అక్కర్లేదా..? ఇదుగో ఇలాంటి విమర్శలకు కోమటిరెడ్డి మాటలు, చేష్టలు ఊతమిస్తాయి…
- అంతేకాదు, తెలంగాణ ప్రజల సొమ్మును ఆంధ్రావాళ్ల వాహనాల టోల్ కోసం తెలంగాణ ప్రభుత్వం కట్టడం ఏమిటనే అదనపు విమర్శకూ తావిచ్చినట్టవుతుంది… పర్ సపోజ్,, పొరపాటున చంద్రబాబు గనుక ‘నేను రేవంత్ రెడ్డికి చెప్పి సంక్రాంతి వాహనాల టోల్ భరించేలా చేశాను’ అని మాటతూలితే… ఇక రేవంత్ రెడ్డికి జరిగే రాజకీయ నష్టం అంతా ఇంతా కాదు…
ఇదండీ కోమటిరెడ్డి ఆలోచన విధానం… తద్వారా రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి జరిగే నష్టం… ఏం మంత్రులను పెట్టుకున్నావయ్యా రేవంత్ రెడ్డీ..!! అందుకే కోమటిరెడ్డి లేఖ, వ్యాఖ్యల మీద తెలంగాణ నెటిజనం నుంచి విముఖతే తప్ప కాసింత సానుకూలత కూడా కనిపించడం లేదు... నిజంగానే కనిపించాల్సిన అవసరం కూడా లేదు..!!
మంత్రి చేయాల్సిన పని ఏమిటో తెలుసా..?
సంక్రాంతి సమయంలో ఈ హైవేపై సాధారణంకంటే 200% ఎక్కువ ట్రాఫిక్ ఉంటుందని.., పంతంగి, కొర్లపహాడ్ వంటి టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోకుండా చూడటమే తమ ఉద్దేశమని మంత్రి ఏదో విఫల సమర్థనకు దిగినట్టున్నాడు… వాహనాల టోల్ ప్రభుత్వం భరించడానికీ, వాహనాలు నిలిచిపోవడానికి ఏమైనా సంబంధం ఉందా అసలు..?
- నిరంతరం రద్దీగా ఉండే హైద్రాబాద్ టూ విజయవాడ నేషనల్ హైవేపై చిట్యాల టౌన్,పెద్దకాపర్తి, చౌటుప్పల్ తో పాటు బ్లాక్ స్పాట్ గా గుర్తించిన పలుప్రాంతాల్లో ఫ్లై ఓవర్ నిర్మాణాలు జరుగుతున్నాయి… కంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో పనులు నత్తనడక… అడిగేవాళ్లు లేరు…
అసలు రద్దీ టోల్ గేట్ల వద్ద కాదు… జాప్యం జరుగుతున్న పనుల వద్ద అని గ్రహించండి మంత్రివర్యా… టోల్ గేట్ల వద్ద కంటే నాలుగైదు రెట్ల ట్రాఫిక్ నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతంలోనే కనబడుతుంది… డిసెంబరులోగా హైద్రాబాద్ – విజయవాడ హైవేపై ఫ్లై ఓవర్ పనులు పూర్తి చేస్తామన్న కంట్రాక్టర్లపై కొరడా పట్టుకొండి… కనీసం ఇప్పటికి 50% పనులు ఎందుకు పూర్తిచేయలేదో నిలదీయండి… అదీ చేయాల్సిన పని… తమరి సొంత ఇలాకా నల్గొండ బైపాస్ వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణానికి కూడా ఇంకా మోక్షం లేనే లేదు…
Share this Article