( రమణ కొంటికర్ల ) … పరిస్థితులకనుగుణంగా పనిచేయడమే కాదు… ప్రకృతికనుగుణంగా కూడా పనిచేయాల్సి ఉంటుంది. అదే చేసింది మధ్యప్రదేశ్ లో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా.
వీరాంగన దుర్గావతి టైగర్ రిజర్వ్ మధ్య నుంచి నిర్మించిన రోడ్డు… ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. అంతకంటే ముఖ్యంగా అటవీ జంతులను కాపాడేలా ఆ రోడ్డును డిజైన్ చేయడమే.. ఆ రహదారి గురించి మనం చెప్పుకోవడానికి కారణం.
రెడ్ అండ్ బ్లాక్ రోడ్డు.. మధ్యప్రదేశ్ అటవీప్రాంతంలో జంతువులు రోడ్డు దాటడానికి ఎలా సురక్షితంగా మారిందో చెప్పుకుందాం.
Ads
నిత్యం రద్దీగా ఉండే భోపాల్ – జబల్పూర్ మధ్య జాతీయ రహదారి ఒకప్పుడు అడవి జంతువులకు ప్రమాదకారిగా ఉండేది. కానీ, ఇప్పుడు ఆ జంతువులకు ప్రమాదరహితంగా ఉండేలా ఈ రోడ్డును డిజైన్ చేశారు. పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు, తోడేళ్లు, హైనాలు, అడవి కుక్కలు సహా అనేక రకాల వన్యప్రాణులకు నివాసం వీరాంగన దుర్గావతి టైగర్ రిజర్వ్ ఫారెస్ట్.
ఇక్కడి నుంచి వెళ్లే జాతీయ రహదారి ఏకంగా టైగర్ రిజర్వ్ గుండె భాగంలోంచే వెళ్లడంతో.. వాహనాలు ఢీకొట్టి ఎన్నో జంతువులు ప్రాణాలు కోల్పోయినాయి. మొత్తంగా పర్యావరణ సమతుల్యతకే ఇక్కడి రోడ్డు ముప్పుగా మారింది.
ఇది జాతీయ స్థాయిలో పెద్ద చర్చకే దారి తీసింది. పర్యావరణ ప్రేమికులు నిరసనలకు దిగారు. దీంతో ఇక్కడి జాతీయ రహదారికి ఒక పరిష్కారం చూపక తప్పని పరిస్థితి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాకు అనివార్యమైంది. దీంతో టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పై నుంచి వెళ్లే రెండు కిలోమీటర్ల రోడ్డును వన్యప్రాణులకు అనుకూలంగా డిజైన్ చేసింది.
ఇక్కడి రోడ్డును కాస్త ఎత్తు పెంచి… ఎరుపు, నలుపు రంగుల్లోని థర్మోప్లాస్టిక్ గుర్తులతో ఉపరితలాన్ని తయారు చేశారు. అవి చూడటానికీ, అలాగే, వాహనం ఆ రోడ్డు మీదకెక్కినప్పుడు స్పర్శ ద్వారా డ్రైవర్లకు హెచ్చరికలుగా మారాయి.
సాధారణ స్పీడ్ బ్రేకర్లలా అకస్మాత్తుగా వాహనాలకు అంతరాయం కల్గించకుండా.. ఈ రోడ్డు మీద వేసిన డిజైన్ డ్రైవర్ల వేగం తగ్గించేలా చేస్తుంది. ఫలితంగా డ్రైవర్లు మరింత అప్రమత్తంగా వాహనాలు నడిపేందుకు కారణమవుతోంది.

ఇప్పుడు ఈ రోడ్డు వేశాక.. జంతువులు వాహనాల కింద పడటం, వాహనాలు వాటిని ఢీకొట్టడం తగ్గిపోయింది. దీంతో రోడ్డు మీదకొచ్చి చనిపోయే అటవీ జంతువుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయి.. అటవీప్రాంతాల్లో ఈ రోడ్డు నిర్మాణశైలి ఒక సక్సెస్ ఫుల్ ప్రయోగంగా ఆకట్టుకుంటోంది.
భోపాల్ – జబల్పూర్ హైవేపై జంతువులు సర్వసాధారణంగా తిరిగే మార్గాలను గుర్తించి… మొత్తం 25 అండర్ పాసేజులను నిర్మించారు. ఇరువైపులా కంచెలు ఏర్పాటు చేసి.. ఈ అండర్ పాసేజులవైపు జంతువులను మళ్లించేలా రోడ్డును డిజైన్ చేశారు. దాంతో అవి మెయిన్ రోడ్డుపైకొచ్చి ప్రమాదాల బారిన పడటం కూడా తగ్గిపోయింది.
ఇలాంటి ప్రాజెక్టుల నుంచి వచ్చిన ఫలితాలు ఆశాజనకంగా ఉండటంతో ఇలాంటి రిజర్వ్ ఫారెస్టుల వద్ద నేషనల్ హైవేస్ డిజైనింగ్ కు మధ్యప్రదేశ్ లోని ఈ హైవే ఓ దారిదీపమైంది. జింకల నుంచి అనేక జంతువులు.. ఈ అండర్ పాసేజుల ద్వారా వెళ్తున్నాయి. వాటి సహజమార్గానికి ఎలాంటి ఆటంకం ఏర్పడకుండా ఉండేలా ఈ రోడ్ డిజైనింగ్ పర్యావరణానికి మేలు చేస్తోంది.
అడవికి ఎలాంటి చేటు చేయకుండా ఎత్తులో నిర్మించిన ఫ్లైఓవర్ తో పాటు… రోడ్ మార్కింగ్స్, కంచెలు, అండర్ పాసేజులు కలయికతో.. మౌలిక సదుపాయల విభాగంలో ఇదో కొత్త ప్రయోగంగా ఆకట్టుకుంటోంది. ఇది ఇక్కడి జీవవైవిధ్యాన్ని గౌరవించే ఒక సమతుల్య మార్గంగా మారిందిప్పుడు.
సరైన ఆలోచనలు, ప్రణాళికలు, పర్యావరణ అవగాహనతో రోడ్ల రూపకల్పన చేస్తే.. అడవులను చీల్చకుండా, వైల్డ్ లైఫ్ కు ఎలాంటి ఆటంకాలు సృష్టించకుండానే ఎలా పురోగతి సాధించొచ్చో ప్రగతికి మార్గమైన భోపాల్ – జబల్పూర్ హైవే రోడ్డు ఓ ఉదాహరణై నిలుస్తోంది.
https://www.facebook.com/reel/1575898697159818
Share this Article