ఇది నిజమేనా..? హవ్వ… ఎంత అప్రదిష్ట… హైదరాబాదు కార్పొరేట్ వైద్యప్రపంచానికే అవమానం… నామర్దా… వీలయితే మిగతా కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నీ కలిపి, కేటీయార్‌కు చెప్పి, ఈ సెంచరీ హాస్పిటల్ వాడి లైసెన్స్ రద్దు చేయించాలి… కాదంటే మోడీనే రంగంలోకి దింపేయాలి… హమ్మా… అసలు వైద్యానికి ఇంత ఖర్చవుతుందని ఉజ్జాయింపు అంచనా వేసివ్వడం ఏమిటి అసలు..? మన కల్చర్ ఏమిటసలు… ఏమీ చెప్పకుండా, ఏ బిల్లులూ ఇవ్వకుండా… వీలైనంత నగదు గుంజేస్తూ… కార్డులు, బీమా పథకాలు గట్రా దగ్గరకు రానివ్వకుండా… ఐసీయూలో పడుకోబెట్టి మరీ రక్తాన్ని పీల్చేయాలి కదా… వీడెమిటి ఏదో వస్తువుకు లేదా ఏదో ఓ ప్రాజెక్టుకు ఎస్టిమేటెడ్ కాస్ట్ అన్నట్టుగా రాసిచ్చేశాడు… ఛిఛీ, ఇలాంటోళ్లు ఉన్నారు కాబట్టే కార్పొరేట్ హాస్పిటళ్ల ఇజ్జత్ పోతోంది… అసలు కార్పొరేట్ హాస్పిటల్ అంటే ఎలా ఉండాలి..? మనిషి కంపౌండ్‌లోకి వచ్చింది మొదలు సైలెంటుగా ప్రాణాలు తోడెయ్యాలి… ఇంటి దగ్గర ఆస్తులు హరించుకుపోవాలి… అప్పులు పెరిగిపోవాలి… ఆనక ఆ ఫ్యామిలీ ఆత్మహత్య చేసుకోవాలి… అదీ ఓ కార్పొరేట్ హాస్పిటల్ తరీఖా అంటే… మరి వీడికి ఓ రీతిరివాజు ఉందా..? ఛిఛీ, ఎందుకు పెడతారో కార్పొరేట్ హాస్పిటళ్లు… మొత్తం పీల్చేసి, ఇంకాస్త బకాయి పెట్టి, అప్పుడు అదంతా చెల్లిస్తే శవాన్నిస్తాం అని చెప్పాలి… అది కదా వైద్యం పద్ధతి… వీళ్లకు తెలియదా..? తెలిసీ కార్పొరేట్ కల్చర్‌కు కరోనాలాగా మారారా..?
సరే, ఇది ఫేక్ కాదు, నిజమే అనుకుందాం… పోనీ, నిజం కాదు, ఫేకే అనుకుందాం… కానీ ఎక్మో చికిత్సకు అంత ఖర్చవుతుంది అనేది మాత్రం నిజమే కదా… కొన్ని హాస్పిటళ్లలో మాత్రమే ఈ సౌకర్యం ఉందనేది నిజమే కదా… ఎక్మో పెట్టినంతమాత్రాన రోగి బతుకుతాడంటే అది అబద్ధమనేది కూడా నిజమే కదా… ఐనా ఈ హాస్పిటల్ వాడికి ఇంకో సోయి కూడా లేదు… అసలు వీడికి ఎక్మో చికిత్స అవసరం… అసలు ఎస్టిమేషన్ వేసినప్పుడే ఓ ఇరవై రెమ్డెసివర్లు… 20 లక్షలు… పనిలోపనిగా స్టెరాయిడ్లు, టోస్లిజుమాబులు…. అవి మరో 20 లక్షలు… బ్లాక్ ఫంగస్ వయల్స్ ఖరీదు 20 లక్షలు, హాస్పిటల్ ఇతరత్రా ఖర్చులు 30 లక్షలు… అన్నీ కలిపి రెండు కోట్ల దాకా వేసి ఇవ్వాలి కదా… ఇలా తక్కువ అంచనాలతో ఎవరిని మోసం చేయడానికి..? అబ్బే, ఇలా అన్- ప్రొఫెషనల్ వైద్యాన్ని ఏమాత్రం అంగీకరించకూడదు… ఎంతసేపూ ఆనందయ్య మందు, ఐవర్మెక్టిన్లంటూ ఏడ్వడమేనా మేధావుల మోకాలి బుర్రల పని..? ఇదుగో, ఇలాంటి సబ్ స్టాండర్డ్ ఎస్టిమేషన్ల హాస్పిటళ్లను పట్టించుకోకపోతే ఎలా పాపం..? ఒరేయ్, తోటి హాస్పిటళ్లను చూసి నేర్చుకోరా బాబూ అని ఒక్కసారైనా గట్టిగా మందలించొద్దా..? అసలు మిమ్మల్ని ఎక్మో బల్ల మీదకు ఎక్కించాలి… అంతే… అన్నట్టూ… కార్పొరేట్, ప్రైవేటు హాస్పిటళ్లలో ఫీజుల్ని ప్రభుత్వమే ఖరారు చేసి, గుంజిన డబ్బుల్ని వాపస్ ఇప్పించాలని కదా… ఎందుకో గుర్తొచ్చిందిలే…!!
Ads
Share this Article