మనం ఇంతకుముందు చెప్పుకున్నాం… చెప్పుకుంటూనే ఉన్నాం… చెప్పుకుంటాం కూడా… కరోనాతో ఎవరైనా మరణిస్తే ఆ శవాలను కూడా తీసుకుపోవడానికి కుటుంబసభ్యులు, బంధువులు రావడం లేదు… ఒక హైదరాబాదో, ఒక బెంగుళూరో కాదు… దేశమంతటా దాదాపు ఇదే పరిస్థితి… అనేక కారణాలుంటయ్… కరోనా మనకూ అంటుకుంటుందనే భయం… లేదా అప్పటికే అప్పుల పాలై ఇంకా దహనసంస్కారాల కర్చులు కూడా పెట్టుకునే స్థితి లేకపోవడం… (కొన్ని కులాల్లో చావు కూడా పెళ్లిలాంటిదే…) కొన్ని కుటుంబాల్లో బాధ్యత మీద వేసుకునేవారు మిగలకపోవడం… చివరకు ప్రభుత్వమే విద్యుత్ దహన వాటికల్లో దహనం చేసినా సరే, సంబంధిత అస్థికల్ని చిన్న చిన్న మట్టికుండల్లో పెట్టేసి, నంబర్లు రాసి పెట్టి, ఎవరైనా వస్తే ఇద్దామని వెయిట్ చేసినా… కనీసం అస్థికల్ని తీసుకుపోవడానికి, వాటిని ఏదో ఓ ప్రవాహంలో నిమజ్జనం చేయడానికి కూడా ఎవరూ ముందుకురాని దుస్థితి…
బెంగుళూరు శివార్లలోని సుమనహళ్లి క్రిమటోరియం వద్ద ఇలాంటి అస్థికల కుండలు (చిన్నవే కదా, గురిగి అనాలేమో…) వరుసగా కనిపిస్తాయి… తెల్లబట్టతో చుట్టేసి, ఓ నంబర్ తగిలించి ఉంటయ్… ఆ నంబరే తవ్వితేనే ఆ మనిషి ఎవరో తేలేది… కానీ తవ్వే సందర్భమే రావడం లేదు, కొత్తవి వచ్చి జతచేరుతున్నాయి తప్ప..! అలాంటి అనాథ ఆత్మలు గౌరవంగా ఈ లోకం వీడి ఊర్ద్వలోకం వైపు ప్రయాణించాలంటే ఎవరో ఒకరు కర్మ చేయాలని మన శాస్త్రాలు చెబుతాయి, మన నమ్మకాలు, మన సంప్రదాయాలు చెబుతాయి… వాటన్నింటినీ బ్రేక్ చేసి, వాటన్నింటికన్నా భయమే పవర్ఫుల్ అని నిరూపించింది కరోనా… ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే..?
Ads
బుధవారం ప్రభుత్వమే దాదాపు 1200 మంది అస్థికల్ని సమీపంలో కావేరీ ప్రవాహంలో నిమజ్జనం చేయించింది… జస్ట్, ఇలా తీసుకుపోయి అలా నదిలో పారేయడం కాదు… పైన ఫోటో చూశారుగా… ప్రతి అస్థికల పాత్రకూ చిన్న దండ, నాలుగు బంతిపూలు, వరుసగా పేర్చారు… బెంగళూరుకు 125 కిలోమీటర్ల దూరంలోని బెలకవాడి ఊరు, కావేరీ ఒడ్డున దృశ్యం ఇది… శాస్త్రోక్తంగా నిమజ్జనం కోసం పురోహితులనూ పిలిచారు… సామూహిక అస్థికా నిమజ్జనం కార్యక్రమాన్ని నిర్వర్తించారు… అశోక్… రాష్ట్ర రెవిన్యూ మంత్రి శాస్త్రానికి ఒక అస్థికల కుండను ప్రవాహంలో నిమజ్జనం చేశాడు… తరువాత వాటన్నింటినీ నది మధ్యలోకి తీసుకుపోయి, కలిపేశారు… దీన్ని కూడా రచ్చ చేసేవాళ్లు ఉంటారా..? ఉండే ఉంటారు… ఇక స్టార్ట్ చేయండర్రా…!! దీనిపైనా ఓ దిక్కుమాలిన కవితాఖండిక రాసి సోషల్ మీడియాలో నిమజ్జనం చేస్తారా… కానివ్వండి…!
Share this Article