.
సాధారణంగా అందరికీ తెలిసిన సత్యం ఏమిటి..? వేరే పండుగలకు తిథుల గొడవలు రావచ్చుగాక… కానీ భోగి, సంక్రాంతి, కనుమలు మాత్రం ఫిక్స్… 13 భోగి, 14 సంక్రాంతి, 15 కనుమ… మొదటిరోజు భోగి మంటలు, భోగి పళ్లు ఎట్సెట్రా… సంక్రాంతి పాలు పొంగించడం, పిండి వంటలు, పూజలు, స్వీట్లు, పతంగులు… కనుమ అంటే కసకసా, ఎత్తిపోతలు, పశుపూజ ఎట్సెట్రా…
ఇతర పండుగలకు తిథుల పంచాయితీలు ఎందుకొస్తాయనేది వేరే కథ… కానీ భోగి, సంక్రాంతి, కనుమ ఏటా ఒకే ఇంగ్లిషు తేదీల్లో వస్తాయంటే…?
Ads
సాధారణంగా మన పండుగలన్నీ చంద్రుని గమనం (చాంద్రమానం) ఆధారంగా వస్తాయి, అందుకే అవి ప్రతి ఏటా మారుతుంటాయి… కానీ, సంక్రాంతి మాత్రం సూర్యుని గమనం (సౌరమానం) ఆధారంగా వస్తుంది… అందుకే ఇది దాదాపు ప్రతి సంవత్సరం ఒకే తేదీల్లో (జనవరి 13, 14, 15) వస్తుంది…
దీని వెనుక ఉన్న శాస్త్రీయ, జ్యోతిష్య కారణాలు ఇవే:
1. మకర సంక్రమణం
సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించడాన్ని “సంక్రాంతి” అంటారు… సూర్యుడు ధనురాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించే రోజునే మనం ‘మకర సంక్రాంతి’గా జరుపుకుంటాం… ఖగోళ శాస్త్రం ప్రకారం, సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సమయం ప్రతి ఏటా జనవరి 14వ తేదీన (కొన్నిసార్లు లీపు సంవత్సరం వల్ల 15న) వస్తుంది…
2. సౌరమాన క్యాలెండర్
మనం అనుసరించే ఇంగ్లీష్ క్యాలెండర్ (గ్రెగోరియన్ క్యాలెండర్) కూడా సూర్యుని గమనం ఆధారంగానే రూపొందించబడింది… సంక్రాంతి కూడా సూర్యుని ఆధారంగా వచ్చే పండుగ కాబట్టి, ఇంగ్లీష్ తేదీల్లో మార్పు ఉండదు…
3. ఉత్తరాయణం ప్రారంభం
సంక్రాంతితో సూర్యుడు దక్షిణాయణం పూర్తి చేసుకుని ఉత్తరాయణంలోకి అడుగుపెడతాడు… అంటే సూర్యుడు భూమధ్యరేఖకు ఉత్తరం వైపు ప్రయాణించడం ప్రారంభిస్తాడు… ఈ ఖగోళ మార్పు కచ్చితమైన కాలచక్రం ప్రకారం జరుగుతుంది…
పండుగ వరుస క్రమం:
-
జనవరి 13 – భోగి…: సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడానికి ముందు రోజు….
-
జనవరి 14 – సంక్రాంతి…: సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజు (మకర సంక్రమణం)…
-
జనవరి 15 – కనుమ..: పంట చేతికొచ్చిన ఆనందంలో పశువులకు కృతజ్ఞత తెలిపే మరుసటి రోజు…

ఒక చిన్న గమనిక…: భూమి తన అక్షం మీద స్వల్పంగా వంగుతూ తిరగడం వల్ల (Precession of the Equinoxes), ప్రతి 70 నుండి 100 ఏళ్లకు ఒకసారి సంక్రాంతి తేదీ ఒక రోజు ముందుకు జరుగుతుంది…. వందల ఏళ్ల క్రితం ఈ పండుగ జనవరి 10 లేదా 11 తేదీల్లో వచ్చేది…. భవిష్యత్తులో (చాలా ఏళ్ల తర్వాత) ఇది జనవరి 15 లేదా 16 తేదీలకు మారే అవకాశం ఉంది….
- 2026 సంవత్సరంలో సంక్రాంతి పండుగ తేదీల విషయంలో చిన్న సందిగ్ధత ఉన్నప్పటికీ, పంచాంగం మరియు ప్రభుత్వ సెలవుల జాబితా ప్రకారం ప్రధాన తేదీలు ఇవే:
-
జనవరి 14, 2026 (బుధవారం): భోగి
-
జనవరి 15, 2026 (గురువారం): మకర సంక్రాంతి (పెద్ద పండుగ)
-
జనవరి 16, 2026 (శుక్రవారం): కనుమ
ముఖ్య గమనిక…: ఖగోళ శాస్త్రం ప్రకారం సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే ‘మకర సంక్రమణం’ జనవరి 14వ తేదీ మధ్యాహ్నం 3:13 గంటలకు జరుగుతుంది… అయితే, మన సంప్రదాయం ప్రకారం పండుగను ‘ఉదయ తిథి’ (సూర్యోదయ సమయంలో ఉన్న తిథి) ఆధారంగా జరుపుకుంటాం కాబట్టి, ఆంధ్రప్రదేశ్- తెలంగాణ రాష్ట్రాల్లో జనవరి 15వ తేదీని ప్రధాన సంక్రాంతి పండుగగా నిర్ణయించారు… తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ సెలవుల క్యాలెండర్‌లో కూడా జనవరి 15నే సంక్రాంతి సెలవుగా ప్రకటించారు…
కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా (Central Government Holidays) ప్రకారం మకర సంక్రాంతి సెలవును జనవరి 14, 2026 (బుధవారం) నాడు కేటాయించారు… అందుకే పండుగ ఏరోజు అనే సందిగ్ధత…
దీనికి కారణం ఏమిటంటే:
-
మకర సంక్రమణం…: ఖగోళ గణన ప్రకారం, సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సమయం (సంక్రమణ పుణ్యకాలం) జనవరి 14వ తేదీ మధ్యాహ్నం 3:13 గంటలకు ఉంది. అందుకే కేంద్ర ప్రభుత్వం ఆ రోజే సెలవుగా పరిగణించింది.
-
రాష్ట్రాల నిర్ణయం…: సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లో (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ), అలాగే తమిళనాడు (పొంగల్) వంటి రాష్ట్రాల్లో సూర్యోదయ తిథిని బట్టి లేదా సంక్రమణం జరిగిన మరుసటి రోజున ‘పెద్ద పండుగ’గా జరుపుకోవడం ఆనవాయితీ… అందుకే రాష్ట్ర ప్రభుత్వాలు జనవరి 15ని సెలవుగా ప్రకటించాయి….
సాధారణంగా తెలుగు పంచాంగం, మన సంప్రదాయాల ప్రకారం, సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన తర్వాత వచ్చే మొదటి సూర్యోదయాన్ని పండుగగా జరుపుకోవడం ఆచారం…
సో, ఏతావాతా తేలేది ఏమిటయ్యా అంటే… ఎప్పటిలాగే 13, 14, 15 తేదీలు గాకుండా… ఈసారి 14, 15, 16 తేదీల్లో వరుసగా భోగి, సంక్రాంతి, కనుమ జరుపుకోవాలని తెలుగు ప్రభుత్వాల ఉవాచ…
అన్నట్టు... హేపీ పొంగల్ అని శుభాకాంక్షలు వద్దు... ఎంచక్కా సంక్రాంతి శుభాకాంక్షలు అని చెప్పండి... మరీ తెలంగాణ విద్యా శాఖలాగా సోయి లేని రాతలొద్దు... అబ్బే,, పాలు పొంగిస్తాం కదా, అందుకే పొంగల్ అని పేరు వచ్చిందేమో అని జోకులు కూడా వద్దు... హేపీ మకర సంక్రాంతి..!!
Share this Article