.
దురహంకార అమెరికా…. ప్రజాస్వామ్యప్రియ భారత్ – విదేశాల్లో సైనిక ఆపరేషన్లలో పరస్పర విభిన్న విధానాలు ………… ( వడ్డాది శ్రీనివాస్)
––––––––––––––––––––––––
అగ్రరాజ్యం అమెరికా ఆధిపత్య దురహంకారం, దురాక్రమణ ఎలా ఉంటుందో యావత్ ప్రపంచం మరోసారి నివ్వెరపోయి చూస్తుండిపోయింది. అమెరికా సైన్యం వెనెజువెలా గగనతలంలోకి చొచ్చుకుపోయి… ఆ దేశ అధ్యక్షుడు భవనంపై మెరుపు దాడి చేసి…
ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సోలియా ఫ్లోర్స్ లను బంధించి న్యూయార్క్‌కు తీసుకువచ్చేసింది. మనం గొప్పగా విద్యార్థులకు సిలబస్‌లో బోధించే ఐక్య రాజ్య సమితి వాస్తవంగా ఓ దిష్టి బొమ్మని… అంతర్జాతీయ న్యాయ చట్టాలన్నీ చిత్తు కాగితాలేనని మరోసారి తేటతెల్లమైంది.
Ads
గల్ఫ్ , వెనెజువెలా తదితర దేశాల్లో ఉండే అపార చమురు నిక్షేపాలను తమ గుప్పిట్లో పెట్టుకోడానికి… ప్రపంచ దేశాలపై పైచేయి నిలుపుకునేందుకు, అమెరికన్ డాలర్ ఆధిపత్యాన్ని కొనసాగించడం కోసం అమెరికా ఎంతకైనా తెగబడుతుందన్నది మరోసారి స్పష్టమైంది. ఆ క్రమంలో తాజా సైనిక దుశ్చర్య మొదటిది కాదు… చివరిది కూడా కాబోదు.
అది సరే… కానీ భారతదేశం కూడా గతంలో ఓ దేశంలో ఇటువంటి తరహా సైనిక చర్య చేపట్టిందన్నది తెలుసా…!? ఆశ్చర్యంగా ఉన్నా అది నిజం. వెనెజువెలాపై సైనిక చర్యకు అమెరికా 2025, ఆగస్టు నుంచి పథక రచన చేస్తూ వచ్చింది. భారత్ మాత్రం అప్పటికప్పుడు ఇన్‌స్టంట్‌గా మరో దేశంలోకి దూసుకువెళ్లి మెరుపు వేగంతో సైనిక ఆపరేషన్ పూర్తి చేయడం… అదీ ఓ సదుద్దేశంతో చేయడం ఆసక్తికరం… స్పూర్తిదాయకం… భారత సైన్యం అసమాన సాహస గాథ ఏమిటో తెలుసుకుందాం రండి….

అది 1988 నవంబర్ 3 తెల్లవారు జామున…
అరేబియా సముద్రంలో ఉండే చిన్న ద్వీప దేశం మాల్దీవుల్లో ప్రభుత్వాన్ని కూల్చేందుకు సైనిక కుట్రకు తెరలేచింది. వివాదాస్పద వ్యాపారవేత్త అబ్దుల్లా లిటిఫీ తమ దేశ అధ్యక్షుడు అబ్దుల్ గయూమ్ కు వ్యతిరేకంగా కుట్రకు తెగబడ్డాడు.
50 మందికి పైగా సాయుధ ఉగ్రవాదులతోపాటు శ్రీలంకకు చెందిన తీవ్రవాద సంస్థ ‘ పీపుల్స్ లిబరేషన్ ఆర్గనైజేషన్ ఆఫ్ తమిళ్ ఈలం (పీఎల్‌ఓటీఈ) కి చెందిన మరో 50 మందితో కిరాయికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. 100 మంది సాయుధ ఉగ్రవాదులు స్పీడ్ బోట్లలో సముద్ర మార్గం గుండా మాల్దీవుల రాజధాని మాలే చేరుకున్నారు..
మాలేలోని కీలక ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నారు. రవాణా శాఖ మంత్రితోపాటు 27 మంది పౌరులను బంధించారు . అనంతరం ఉగ్రవాదులు ఆ దేశ అధ్యక్షుడు గయూమ్ అధికార నివాసంవైపు దూసుకువచ్చారు. ప్రమాదాన్ని సకాలంలో గుర్తించిన ఆ దేశ రక్షణ మంత్రి తమ అధ్యక్షుడిని ఓ సేఫ్ హౌస్ ( సురక్షిత స్థావరానికి ) లోకి తరలించారు. దాంతో ఉగ్రవాదులు అధ్యక్షుడు గయూమ్‌ను బందీగా పట్టుకోలేకపోయారు. ఆయన నివాస భవనాన్ని చుట్టు ముట్టారు.

- అధ్యక్షుడు గయూమ్ తమకు సహాయం చేయాలని అగ్రరాజ్యం అమెరికాను కోరారు. మాలేకు కేవలం వేయి కి.మీ. దూరంలోని డిగోగార్షియాలో అమెరికాకు సైనిక స్థావరం ఉంది. అక్కడ ఉండే అమెరికా సైన్యాన్ని పంపుతారని ఆయన ఆశించారు. ఆయన ఆశ అడియాశే అయ్యింది. తమకు కనీసం రెండు మూడు రోజుల సమయం కావాలని చెప్పి అమెరికా జారుకుంది. దాంతో గయూమ్ బ్రిటన్ ప్రభుత్వాన్ని సంప్రదించారు. బ్రిటన్ సహాయం చేస్తానని చెప్పలేదు గానీ ఓ ఉపయుక్తమైన సలహా ఇచ్చింది. ఈ సంక్షోభ సమయంలో తక్షణం స్పందించగలిగేది భారత్ మాత్రమేనని చెప్పింది. గయూమ్ వెంటనే అప్పటి భారత ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీతో హాట్ లైన్‌లో మాట్లాడారు.
రాజీవ్ గాంధీ సత్వరం సానుకూలంగా స్పందించి భారత త్రివిధ దళాల అధిపతులతో అత్యవసర సమావేశం నిర్వహించారు.. మాల్దీవులకు అండగా నిలవాలని ఆదేశించారు. ఆర్మీ చీఫ్ వీ ఎన్ శర్మ, లెఫ్టినెంట్ జనరల్ రోడ్రిగ్స్ యాక్షన్ ప్లాన్ ను రూపొందించారు. ఆగ్రాలో ఉన్న భారత సైన్యానికి చెందిన ‘ 6 పారా బ్రిగేడ్‘ ను రంగంలోకి దించాలని సూచించారు. అందుకు భారత రాజకీయ వ్యవహారాల సబ్ కమిటీ ఆమోదం తెలిపింది. ఆగ్రాలోని 6 పారా బ్రిగేడ్ కు చెందిన బ్రిగేడియర్ ఫరూక్ బుల్సారా మల్దీవుల మ్యాప్ తెప్పించి తమ బృందంతో విశ్లేషించి సైనిక ఆపరేషన్ ప్రణాళిక రూపొందించారు…. అదే ‘ ఆపరేషన్ కాక్టస్ ’…

1988, నవంబర్ 3 రాత్రి…
బ్రిగేడియర్ ఫరూక్ బుల్సారా నేతత్వంలో భారత పారాచూట్ బ్రిగేడ్, పారాచూట్ రెజిమెంట్, పారాచూట్ ఫీల్డ్ రెజిమెంట్ చెందిన 500 మంది మెరికల్లాంటి సైనికులతో ఆగ్రాలోని భారత్ వాయుసేన బేస్ నుంచి రెండు యుద్ద విమానాలు టేకాఫ్ తీసుకుని మాలే వైపు దూసుకుపోయాయి. వాటికి ఎస్కార్టుగా 6 మిరేజ్ 2000 యుద్ధ విమానాలు అనుసరించాయి.
అరేబియా సముద్రంలో ఉన్న భారత నేవీకి చెందిన ఐఎన్‌ఎస్ గోదావరి, ఐఎన్‌ఎస్ బెట్వా అప్పటికే మాల్దీవుల తీరం సమీపానికి చేరుకున్నాయి. నేవీ అధికారులు భారత యుద్ధ విమానాలు ల్యాండ్ అయ్యేందుకు అనుకూలంగా ఉన్న ప్రాంతాల ఫోటోలు తీసి పంపారు. హుల్హాలే ఎయిర్ స్ట్రిప్ లో భారత యుద్ధ విమానాలు ల్యాండ్ కావచ్చని సూచించారు.
మాల్దీవుల అధ్యక్షుడు గయూమ్ సహాయం అభ్యర్థించిన కేవలం 9 గంటల వ్యవధిలోనే భారత సైన్యం సర్వ సన్నద్ధమై 3,700 కి.మీ. దూరం ఏకబిగిన ప్రయాణించి హుల్హాలే ఎయిర్ స్ట్రిప్ పై ల్యాండ్ అయింది. వెంటనే భారత పారా ట్రూపర్లు కిందకు దిగి ఆపరేషన్ చేపట్టారు. మొదటగా మాలే ఎయిర్ ఫీల్డ్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 19 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టారు.

భారత సైన్యం దాడిలో 39 మంది ఉగ్రవాదులు గాయపడ్డారు. కొందరు స్పీడ్ బోట్లలో పారిపోయారు. మిగిలిన ఉగ్రవాదులు ఒక కార్గో షిప్ లో శ్రీలంకకు వెళ్ళిపోవాలని భావించారు. తమ బందీలుగా ఉన్న మాల్దీవుల రవాణా శాఖ మంత్రితోపాటు తమ బంధీలుగా ఉన్న 27 మంది పౌరులను ఆ షిప్ ఎక్కించారు. తమను వెళ్ళనివ్వకపోతే బందీలుగా ఉన్న వారిని అంతం చేస్తామని బెదిరించారు.
అప్పటికే మాలే తీరానికి సమీపంలో మోహరించి ఉన్న భారత యుద్ద నౌకలు ఉగ్రవాదుల యత్నాన్ని అడ్డుకున్నాయి. ఆ నౌకల నుంచి భారత నేవీ సైనికులు ఉగ్రవాదులు ఉన్న షిప్ ఏమాత్రం కదిలేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా కాల్పులు కొనసాగించారు. ఒకానొక దశలో ఉగ్రవాదులు సహనం కోల్పోయి తమ వద్ద ఉన్న ఇద్దరు బందీలను షూట్ చేసి హత్య చేశారు. వారి మృత దేహాలను అరేబియా సముద్రంలోకి విసిరేశారు.
అయినా ఓ వైపు నుంచి భారత పారా ట్రూపర్లు దూసుకువచ్చారు. మరోవైపు భారత నేవీ కాల్పులతో విరుచుకుపడుతూ ఉగ్రవాదుల షిప్ ఎటూ కదల లేకపోయింది. ఇక ఏం చేసినా ఫలితం లేదని గుర్తించిన ఉగ్రవాదులు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి భారత సైన్యానికి లొంగి పోయారు. మాల్దీవుల రవాణా శాఖ మంత్రితో పాటు మిగిలిన 25 మంది పౌరులను మన బలగాలు సురక్షితంగా విడిపించాయి.

భారత సైన్యం మాలేను తమ ఆధీనంలోకి తీసుకుంది. అధ్యక్షుడు గయూమ్‌తోపాటు అందరూ సురక్షితంగా బయటపడ్డారు. భారత సైన్యం తమలో ఒక్కరు కూడా మృతి చెందకుండా విజయవంతంగా ఈ ఆపరేషన్‌ను పూర్తి చేయడం విశేషం. అప్పటి అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్, బ్రిటన్ ప్రధానమంత్రి మార్గరేట్ థాచర్‌తోపాటు ప్రపంచ దేశాల అధినేతలు అందరూ భారత ప్రభుత్వ తక్షణ స్పందనను, భారత సైన్యం అసమాన ధైర్య సాహసాలను ప్రశంసించారు .
భారత్ మాల్దీవులపైకి దూసుకు వెళ్లింది ఆ దేశంలోని సహజ వనరులను కొల్లగొట్టడం కోసమో ఆ దేశాన్ని తమ గుప్పిట్లో ఉంచుకోవడం కోసమో కాదు... మాల్దీవుల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కాపాడటం కోసం... ఆ దేశంలో ప్రజాస్వామాన్ని పరిరక్షించడం కోసం. ఓ సహజ ప్రజాస్వామ్య దేశంగా అది తన బాధ్యతగా భారత్ భావించింది. అదీ భారత దేశం. భారతీయ ప్రజాస్వామ్య స్పూర్తి......
Share this Article