.
కేసీయార్ బ్లండర్ రూలింగు నిర్ణయాలకు మరో ఉదాహరణ… తెలంగాణకు కాబోయే ‘తెల్ల ఏనుగు’… కటువుగా అనిపించినా సరే, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటు (వైటీపీఎస్) అనే భారీ థర్మల్ పవర్ ప్లాంటు తాలూకు నిజం ఇదే…
రాజకీయాలు, కమీషన్ల మాట కాసేపు పక్కన పెడితే… వర్తమాన థర్మల్ పవర్ ప్రపంచ కోణంలో నిశితంగా ఆలోచిస్తే ఇదే నిజం… ఇది ఇప్పుడెందుకు చెప్పుకుంటున్నాం అంటే… నిన్న ఈ ప్లాంటు మూడో యూనిట్ సీఓడీ ప్రకటించారు… అంటే కమర్షియల్ ఆపరేషన్ డేట్… గ్రిడ్‌కు అనుసంధానించారు, నిన్నటి నుంచి అది వాణిజ్యపరంగా ఉత్పత్తి దశలోకి వచ్చినట్టు లెక్క…
Ads
అబ్బో, మా కేసీయార్ ఘనత, తెలంగాణ తలమానికం అన్నట్టుగా బీఆర్ఎస్ క్యాంపు సోషల్ మీడియా, మీడియా ప్రచారానికి పూనుకున్నాయి… నిజాలు తెలియక… తెలిసీ జనానికి చెప్పలేక…!
ఈ ప్లాంటు నల్గొండ జిల్లా, దామరచర్లలో నిర్మాణంలో ఉంది… మొత్తం ప్రతిపాదిత కెపాసిటీ 4 వేల మెగావాట్లు… మొత్తం 5 యూనిట్లు… 800 మెగావాట్ల చొప్పున… సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో ప్రభుత్వ రంగంలో ఒకే చోట నిర్మితమవుతున్న అతిపెద్ద థర్మల్ పవర్ ప్రాజెక్టులలో ఒకటి…

సాధారణ (Sub-critical) ప్లాంట్ల కంటే ఇది తక్కువ బొగ్గును వినియోగించి ఎక్కువ విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల కాలుష్యం తక్కువగా ఉంటుంది మరియు సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది… పర్యావరణ నిబంధనల ప్రకారం గాలిలోకి విడుదలయ్యే సల్ఫర్ డయాక్సైడ్ తగ్గించడానికి ఇందులో FGD (Flue-gas desulfurization) పరికరాలను కూడా అమర్చుతున్నారు… అన్నీ గుడ్ అనిపిస్తున్నాయి కదా స్థూలంగా… కానీ..?
లోడ్ ఉన్నచోట ప్లాంట్లు అనేవి పురాతన, అశాస్త్రీయ విధానం… కేసీయార్ సొంత ఆలోచనలన్నీ ఇలాగే మేడిగడ్డలే కదా… నిజానికి పిట్ హెడ్ ప్లాంట్లు అభిలషణీయం… అంటే ఇంధనం (బొగ్గు) ఉన్నచోటే ప్లాంటు కడితే… రవాణా ఖర్చు ఉండదు.., 800 కేవీ లైన్ల శకంలో ఎంత కరెంటైనా సెకన్లలో ఎంతటి లోడ్ ఉన్న ఏరియాకైనా కారు చౌకగా తీసుకుపోవచ్చు… (గ్రిడ్ ఛార్జీలు స్వల్పం)…
కానీ కేసీయార్ కదా… పిట్ హెడ్ ప్లాంట్ల జోలికి పోకుండా ఇలా లోడ్ ఏరియా ప్లాంట్లకు ఆలోచించాడు… ఆరంభంలో సుమారు ₹25,000 కోట్లుగా అంచనా వేసినా, ప్రస్తుతం ఇది ₹30,000 నుండి ₹34,500 కోట్ల వరకు పెరిగింది…
విద్యుత్ ఉత్పత్తి ఖర్చు ప్రతి యూనిట్‌కు ₹5.00 నుండి ₹6.00 వరకు ఉండవచ్చునని అంచనా… కాదు, 8 దాటిపోతుందని తాజా అంచనాలు… బొగ్గు గనులు (సింగరేణి లేదా ఒడిశా గనులు) ఇక్కడికి సుమారు 300 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి… రైల్వే ద్వారా బొగ్గును తరలించడానికి ఏటా సుమారు ₹800 నుండి ₹1,000 కోట్ల వరకు అదనపు ఖర్చు అవుతుందని అంచనా…

అదనపు మౌలిక సదుపాయాలు…: విశుద్ధపురం రైల్వే స్టేషన్ నుండి ప్లాంట్ వరకు ప్రత్యేక రైల్వే లైన్లు, మౌలిక సదుపాయాల కోసం భారీగా ఖర్చు చేయాల్సి వచ్చింది…
ప్రస్తుతం సౌర (Solar), పవన (Wind) విద్యుత్ యూనిట్ ధర ₹2.50 నుండి ₹3.00 లోపు (ఇంకా తక్కువకే) దొరుకుతుంటే, ₹5.00 – ₹8.00 ఖర్చయ్యే ఇలాంటి పాతకాలపు భారీ థర్మల్ ప్రాజెక్టులు ఎందుకు అనే చర్చ ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది…
ప్లాంటు కరెంటును తీసుకున్నా తీసుకోకపోయినా జనంపై భారీ ఫిక్స్‌డ్ ఛార్జీలు తప్పవు… (భారీ వ్యయం, రవాణా వ్యయం వల్ల ఈ ప్లాంటు ఫిక్స్‌డ్ ఛార్జీలు మరీ ఎక్కువ)… చీప్ పవర్ దొరుకుతున్న నేపథ్యంలో దీన్ని చాలాసార్లు బ్యాక్ డౌన్ (యూనిట్లు ఆపేయడం) తప్పదు… అంటే జనానికి మాత్రం ఫిక్స్‌డ్ ఛార్జీలు తప్పవు… (బ్యాక్ డౌన్ దేనికీ అంటే… మెరిట్ ఆర్డర్ డిస్పాచ్ అని ఓ పద్దతి ఉంటుంది… అంటే, తక్కువ ధర కరెంటును ముందు తీసుకోవాలి గ్రిడ్‌లోకి (వాడకానికి), సో, చీప్ పవర్ దొరికిన రోజుల్లో ఈ ప్లాంట్లు బ్యాక్ డౌన్ చేయక తప్పదు)…
ఎస్, కరెంటు పరిభాషలో ఇలాంటి ప్లాంట్లు బేస్ లోడ్ కోణంలో గ్రిడ్ స్టెబిలిటీ కోసం అవసరమే… కానీ పిట్ హెడ్ ప్లాంట్లకు వెళ్లాల్సి ఉండింది… భారీ రాజకీయ తప్పిదం… దీని సంగతి ఇలా ఉంటే… భద్రాద్రి పవర్ ప్లాంటు మరో బ్లండర్… ఇది మరీ పాతబడిన, కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీతో చేపట్టారు… 1080 మెగావాట్ల 4 యూనిట్లు…
7 వేల కోట్లతో ప్రారంభిస్తే… 10 వేల కోట్లు దాటిన నిర్మాణవ్యయం… ప్రపంచవ్యాప్తంగా ఈ టెక్నాలజీ ప్లాంట్లను కూలగొడుతుంటే, కేసీయార్ తెలంగాణ నెత్తిన రుద్దాడు… ఇక్కడా యూనిట్ కరెంటు 6 – 7 రూపాయలు… బ్యాక్ డౌన్ చేసినా ఇక్కడా భారీ ఫిక్స్‌డ్ ఛార్జీలు తప్పవు జనం మీద… ఇది మరో తెల్ల ఏనుగు… పోలవరం రెండు దశలు గనుక పూర్తయితే దీనికీ ముంపు సమస్య… జనాన్ని ముంచే ప్లాంటు తనే మునిగిపోతుందట…
ఈ రెండు తెల్ల ఏనుగులు అవి డిస్కమ్‌లను కూడా ముంచేయబోతున్నాయి..!!
సో, నిజాలు ఇవీ... NTPC వంటి కేంద్ర సంస్థలు యూనిట్ ₹4.00 - ₹4.50 కే ఇస్తామంటున్నా, రాష్ట్ర సొంత ప్లాంట్లు (యాదాద్రి, భద్రాద్రి) పై మొగ్గు చూపడం వల్ల రాబోయే 25 ఏళ్లలో తెలంగాణ ప్రజలపై వేలాది కోట్ల అదనపు భారం పడే అవకాశం ఉంది... రేవంత్ రెడ్డి ప్రభుత్వం తప్పకుండా భరించాల్సిన కేసీయార్ తప్పిద భారం..!!
అవునూ… కేసీయార్ పవర్ నిర్ణయాల మీద ఓ కమిషన్ వేశారుగా, రిపోర్ట్ కూడా వచ్చేసిందిగా… దానిపై రేవంత్ రెడ్డి నిర్ణయం ఏమైంది..? కాళేశ్వరం కథను సీబీఐకి అప్పగించి, కేసీయార్‌ను క్షమించేసినట్టుగా, ఈ కథా కంచికేనా..!!!
Share this Article