.
శ్రీ వెంకటేశ్వర నాస్తిక సమాజంలాగా… కుల నిర్మూలన సంఘం కులవన భోజనాల్లాగా… ఇదీ ఓ పారడాక్స్…! నీతులు చెప్పేవాళ్లే గోతిలో పడ్డట్టు… శకునం చెప్పే బల్లి కుడితి తొట్టెలో పడ్డట్టు… ఇలా ఎన్నయినా చెప్పుకోవచ్చు…
పర్టిక్యులర్‌గా అనసూయ బాపతు వివాదం నేపథ్యంలో… ఆడది తనను తానే అబ్జెక్టిఫై చేసుకుంటూ… శివాజీ భాషలో చెప్పాలంటే సరుకును, సామాన్లను ప్రదర్శించుకుంటూ… సమాజంలో ఓ చర్చ జరగుతున్నవేళ ఓ సినిమా గురించి, ఓ దర్శకురాలి ఫేక్ నీతుల గురించీ చెప్పుకోవాలి…
Ads
నేపథ్యం… దాదాపు ప్రతి పత్రిక సినిమా పేజీలో దాదాపు ఒకే హెడింగుతో… నిశ్శబ్దాన్ని చేధించిన రాయ… పవర్ ఫుల్ రాయ… యష్ ఫోటోలో సాధుసంతులకు కూడా లేనంత గడ్డం… (అసలు ఎంత గడ్డం పెరిగి ఉంటే అంత హైపర్ మగతనం అనే పిచ్చి భ్రమల్లోకి దాదాపు స్టార్లందరూ ఎప్పుడు జారిపోయారో తెలియదు…) వచ్చిన ప్రెస్‌నోట్ యథాతథంగా ‘కవర్’ చేశారు…
సినిమా పేరు ‘టాక్సిక్’… యష్ ఇంకా కేజీఎఫ్ హ్యాంగోవర్ నుంచి బయటపడినట్టు లేదు… అదే గ్యాంగ్‌స్టర్… హైపర్ యాక్షన్… తన పాత్రను పరిచయం చేసే రోల్ ఇంట్రో ఏదో విడుదల చేసినట్టున్నారు, అదీ సందర్భం… గతంలో టీజరో ఏదో రిలీజ్ చేసినట్టున్నారు కూడా…

దాన్ని చూశాక దర్శకురాలు గీత మోహన్‌దాసు (మలయాళీ) మీద విమర్శలు… బాలనటి నుంచి మొదలుకొని… నిర్మాత, దర్శకురాలు, నటి… బోలెడు అవార్డులు… ఎప్పుడూ స్వేచ్ఛగా, ధైర్యంగా ఆడవాళ్ల అబ్జెక్టిఫికేషన్ మీద విమర్శలు చేస్తుంటుంది… అశ్లీలత, వల్గారిటీలకు వ్యతిరేకి… కానీ ఆమె దర్శకురాలిగా చేసిన సినిమాల్లో బోల్డ్, ఇంటెన్స్, ఇంటిమేట్ సీన్లుంటాయనే విమర్శా ఉంది…
ఇప్పుడూ అంతే… యష్ వంటి స్టార్ హీరో, పాన్ ఇండియా స్టార్ ఉన్నా సరే… ఆమె హాట్ సీన్లను ఇరికించిందని అంటున్నారు… వుమెన్ ఆబ్జెక్టిఫికేషన్ బలంగా వ్యతిరేకించే తనే చివరకు తనే అదే మార్గంలో వెళ్లడమే అసలు పారడాక్స్… అదీ కథకు సంబంధం లేని అబ్సీన్ సీన్లను ఇరికించడం..! మరీ కారులో సంభోగం, దానికో సింబాలిక్ షాట్…

పైగా ఈ సినిమాకు యష్ వంటి స్టార్ ఉన్నా సరే… ఆరబోతకు ఏకంగా ఐదుగురు ఫిమేల్ స్టార్లను ఎంచుకుంది ఆమె… 1) నయనతార… ఈమె యష్‌కు సోదరిగా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి… 2) కియారా అద్వానీ… ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ (యష్ జోడీ)గా కనిపించనుంది…
3) రుక్మిణి వసంత్… ‘సప్త సాగరదాచె ఎల్లో’, కాంతార-1 ఫేమ్ రుక్మిణి ఇందులో కీలక పాత్రలో ఉంది… 4) హ్యూమా ఖురేషి… ఈమె సినిమాలో విలన్ లేదా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించవచ్చు…. 5) తారా సుతారియా… ఈ బాలీవుడ్ నటి తారా కూడా ఒక పవర్‌ఫుల్ రోల్‌లో నటిస్తోంది…
సో, ఒక యానిమల్, ఒక కేజీఎఫ్‌కు బోల్డ్‌తనం అద్దడం అనేది ఈ కొత్త ధోరణి… పైగా విపరీతమైన హింస… ఎంత హింస ఉంటే అంత గొప్ప సినిమా అనే భ్రమ హీరోల్లో, దర్శకుల్లో బాగా పెరుగుతోంది… సో, ఆదర్శ ఫెమినిస్ట్ గీతు మోహన్‌దాస్ కూడా ‘అశ్లీలత’నే ఆశ్రయించడమే మనం ఇక్కడ చెప్పుకునే ఓ పారడాక్స్..!! ‘టాక్సిక్’ మరో టాక్సిక్ సినిమా ధోరణి కాబోతున్నదన్నమాట..!!
Share this Article