మనం పలుసార్లు చెప్పుకున్నట్టు… ఓ టైం వస్తుంది… అదంతే, తరుముకుంటూ వస్తుంది… అది యమపాశం… దానికి అడ్డు ఉండదు… మెడకు పడి బిగుసుకుంటుంది… ఊపిరి ఆగిపోతుంది… అది డెస్టినీ…. వైఎస్ఆర్… అనగా వై.శ్రీనివాసరావు అనే ఓ జర్నలిస్టు… హైదరాబాదులో తనను ప్రేమించని జర్నలిస్టు లేడు… భిన్న సిద్ధాంతరాద్ధాంత వర్గాలకు అతీతంగా అందరికీ ఇష్టుడు… జర్నలిస్టు అంటే అదుగో ఆయన అని చెప్పుకునే టైపు… ఆస్ట్రాలజీ, అస్ట్రానమీ మాత్రమే కాదు, మనుషుల్ని చదివాడు… ఆజన్మ బ్రహ్మచారి… జిజ్ఞాసపరుడు… వృత్తిలో ఎంత నిఖార్సయిన నిజాయితీ అంటే… ప్రెస్మీట్లు, టూర్లకు వెళ్లినా సరే తన చాయ్ తనదే, తన తిండి తనదే… ఒక రుషి, అంతే… కొన్నాళ్లు మూలికావైద్యం మీద గురి కుదిరి శ్రీశైలం అడవుల్లోకి వెళ్లిపోయాడు… అప్పుడే ఓ చెంచు అమ్మాయిని తనతోపాటు తెచ్చుకుని పెంచుకున్నాడు… ఇప్పుడు కరోనాతో మరణిస్తే ఆమే తనకు కొరివి పెట్టింది… సరే, ఆయన చరిత్రలోకి వెళ్తే అదొక పుస్తకం… అయితే..?
తనకు కరోనా సోకింది… అది సోకని వాళ్లెవరు..? మంచిమంచోళ్లనే కదా అదీ ఇష్టపడుతున్నది… ఆయన దగ్గర డబ్బేమీ లేదు… తన బతుకంతా డిటాచ్డ్తనమే కదా… మరి కరోనా చికిత్స అంటేనే లక్షల యవ్వారం కదా… తనను ప్రేమించే పలువురు జర్నలిస్టు మిత్రులు అక్షరాలా ఓ టాస్క్ ఫోర్స్‌లా ఏర్పడ్డారు… ఓ చిరు ఉద్యోగి నుంచి ఉపరాష్ట్రపతి దాకా తలా కొంత సాయం చేశారు… ఆయన అందరికీ తెలిసినవాడే… అప్పటి పీఎం వాజపేయి నుంచి ఇప్పటి సీఎం కేసీయార్ దాకా… అందరికీ వైఎస్ఆర్ అంటే తెలుసు… ఇష్టపడేవాళ్లే… కానీ కేసీయార్ నోటీసుకు ఈ కష్టం సరిగ్గా వెళ్లనట్టుంది… సరే, దాదాపు 7-8 లక్షల దాకా సమకూరినట్టుంది… అయితే అది కాదు అసలు చెప్పుకోదగింది… తనను కాపాడుకోవడానికి ఆ మిత్రబృందం చేసిన విశ్వప్రయత్నం… అప్పటికే తన ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ బాగా పెరిగిపోయి ఉంది… వివిధ రంగాల్లో తమకున్న పరిచయాలను మొత్తం కదిలించారు ఆ జర్నలిస్టులు…
Ads
రెమ్డెసివర్లు, స్టెరాయిడ్లు తెప్పించుకున్నారు… వీళ్ల ఆరాటానికి తగినట్టుగా ఉదారంగా వ్యవహరించే ఓ సోమాజీగూడ హాస్పిటల్ దొరికింది… ఇన్ఫెక్షన్ తగ్గడం లేదు… టోస్లీజుమాబ్ ఇంజక్షన్ కావాలి… బయట బ్లాక్మార్కెట్లో 9, 10 లక్షలు చెబుతున్నారు… ఉన్నత స్థాయి యంత్రాంగం దాకా ఘర్షణకు దిగి మరీ అదీ సంపాదించారు… ఈమధ్య కొత్తగా కనిపెట్టబడిన ఓ మందును కూడా పంపించారు, వాళ్లకు వైఎస్ఆర్ తెలుసు కాబట్టి… చివరకు ఆనందయ్య మందును కూడా సమీకరించారు ఎలాగోలా… కానీ అప్పటికే ఇన్ఫెక్షన్ బాగా ఎక్కువైన స్థితి, ఫలించలేదు… చివరకు వెంటిలేటర్ వద్దంటూ తనే తిరస్కరించడంతో మరణం అనివార్యమైపోయింది ఇక… బతుకంతా ఓ పరిత్యాగిలా బతికినా సరే, చివరకు తనను అభిమానించే మిత్రబృందం తనను కాపాడుకోవడానికి 15 రోజులపాటు చేసిన సకల ప్రయత్నాలూ అభినందనీయం… అందుబాటులో ఉన్న ఏ అవకాశాన్ని వదిలేయలేదు… కానీ చివరకు ఈ టాస్కులో కరోనాయే గెలిచింది… ఆ నిఖార్సయిన జర్నలిస్టును తీసుకుపోయింది… ప్చ్, ఎన్నెన్ని విషాదాలో… ఎవరిని కదిలించినా ఎన్నెన్నో కథలు… కాలం కన్నీరు పెట్టుకుంటున్న వ్యథలు…!! చివరగా :: ఎంఏ ఎంఫిల్ చేసిన వైఎస్ఆర్ ఈమధ్య పీహెచ్డీ కోసం ఓ సబ్జెక్ట్ రిజిష్టర్ చేయించాడు… తను ఎంచుకున్న సబ్జెక్టు పేరు… మృత్యువు- ఒక భావన’’…!!
Share this Article