.
రాష్ట్ర విభజన తరువాత ఏపీ, తెలంగాణ నడుమ అనేక ఆస్తుల పంపకాలు ఈరోజుకూ తెగలేదు… కొన్ని ఇక తెగవు… పంచాయితీ నడుస్తూనే ఉంటుంది… నదీజలాల పంపిణీ వంటి కీలక, క్లిష్ట అంశాలు కూడా..!
ఓ ఆసక్తికరమైన వార్త కనిపించింది… ఒకవేళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుబట్టి, కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటే… ఏపీ నుంచి సానుకూల స్పందన రాబట్టగలిగితే… విశ్వనగర హైదరాబాద్‌కు విశిష్ట అంతర్జాతీయ పర్యాటక, ఆధ్యాత్మిక శోభ వస్తుంది…
Ads
జగన్‌తో దోస్తీ కారణంగా... కేసీయార్ తెలంగాణకు చేయబోయిన పలు అన్యాయాల్లో ఇదీ ఒకటి... దీన్ని కూడా సవరించి, చక్కదిద్దే బాధ్యత రేవంత్ రెడ్డిదే...
ముందుగా ఆ వార్త సారాంశం చదవండి… ‘‘ప్రపంచ శాంతికి త్రిచరణాలు ప్రబోధించిన తథాగతుని చితాభస్మం తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలకు కేంద్ర బిందువు అయింది… అత్యంత పవిత్రంగా భావిస్తున్న ఈ చితాభస్మం తమకే చెందాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పట్టుబడుతుండతో మధ్యలో చైనా ప్రతినిధి బృందం సుమారు వంద కోట్లు చెల్లించి సొంతం చేసుకోవడానికి ప్రతిపాదనలు పంపించింది…
తెలంగాణ పురావస్తు మ్యూజియంలో అత్యధిక భద్రత మధ్య, బుల్లెట్ ప్రూఫ్ గాజు బాక్సులో కొలువు తీరిన ఈ చితాభస్యం రాష్ట్ర విభజనతో మాదంటే మాదని అంటూ తెలుగు రాష్ట్రాలు వివాదాలకు తెరతీయగా ఏపీకి ఇచ్చే ప్రసక్తి లేదని ఇప్పటికే రాష్ట్రంలోని బౌద్ధ గురువులు స్పష్టం చేశారు…
తెలుగు రాష్ట్రాల మధ్య ఇతరత్రా పురావస్తు సంపద కొలిక్కి వచ్చినప్పటికీ బుద్ధుని చితాభస్మం చిక్కు ముడి వీడటంలేదు… తెలంగాణ ఆవిర్భావం నుంచి ఈ సమస్య పీఠముడి వీడటంలేదు… అయితే కొంత మంది ఆంధ్రకు చెందిన తెలంగాణలోని అధికారులు బుద్ధుని చితాభస్మం ఆంధ్రకు చెందుతుందనడాన్ని తెలంగాణ బౌద్ధ సన్యాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు…

పురావస్తు సంపద పంపకాల్లో ఏ వస్తువు ఎక్కడ లభ్యమైందో, చరిత్ర, విలువలు రికార్డు చేయబడతాయి… ఈ చితాభస్మం చరిత్రలోకి వెళ్తే… 1980లో విశాఖపట్టణం బావికొండలోని బౌద్ధ స్థూపం దగ్గర పురావస్తు శాఖ జరిపిన తవ్వకాల్లో లభ్యమైన బుద్దుని చితాభస్మం పాత్రలో వెండి పాత్ర, వెండి పాత్రలో బంగారు భరిణ, ఆ భరిణలో చితాభస్మం, పూసలు, పంటి ఎముక ఉన్నాయి…
ఈ చితాభస్మంపై అనేక సంవత్సరాలు శాస్త్రీయ అధ్యయనం, పరిశోధన చేసిన పురావస్తు శాఖ బుద్ధుని చితాభస్మంగా నిర్ధారించడంతోపాటు బుద్ధుడి మెడలోని పూసల దండలోని పూసలు ఇందులో ఉన్నాయని నిర్ధారించింది…
2004లో దలైలామా ఈ చితాభస్మం దగ్గర ప్రత్యేక ప్రార్ధనలు చేశాడు… అనంతరం ఈ చితాభస్మం ట్యాంక్ బండ్ బుద్ధ విగ్రహం దగ్గర ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు ఆచరణకు నోచుకోకపోవడంతో ప్రస్తుతం బుల్లెట్ ప్రూఫ్ గాజు ఫ్రేమ్‌లో భద్రపరిచారు… ఇప్పుడది బౌద్ధులకు పూజనీయ ప్రాంతం… ఓవైపు బుద్ధుడి భారీ విగ్రహం, మరోవైపు బుద్ధుడి అత్యంత విలువైన ఆధ్యాత్మిక అవశేషాలు… అలా బౌద్ధులకు ఇది ఓ అంతర్జాతీయ పర్యాటక తీర్థ స్థలి…

క్రీస్తుపూర్వం 483లో తథాగతుడు తన 80వ ఏట మహా నిర్యాణం చెందాడు… అశోక చక్రవర్తి బౌద్ధాన్ని స్వీకరించిన అనంతరం చితాభస్మం కలశాలను వెలికి తీయించి 84 వేల భాగాలు చేసి తన సామ్రాజ్యంలోని అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయించాడని చరిత్ర చెబుతోంది… అలా వచ్చిన ఓ భాగమే ఈ ధాతువు కావటం విశేషం…
అలాగే బౌద్ధం విరాజిల్లిన ప్రాణహిత నది పరివాహక ప్రాంతం, ఫణిగిరి, చైతన్యపురి ప్రాంతాల్లో బుద్దుని ధాతువులు ఉండే అవకాశం ఉందని చరిత్రకారులు పరిశోధనలు చేసినప్పటికీ అరుదైన విగ్రహాలు లభించాయే కాని చితాభస్మం లభ్యం కాలేదు…
ఈ నేపథ్యంలో బావికొండలో లభ్యమైన బుద్ధుని చితాభస్మంపై వివాదం ముదురుతున్నది… 1980 నుంచి తెలంగాణలో ఉన్న ఈ చితాభస్మం ఆంధ్రకు అప్పగించే బదులు ఇక్కడే ఉంచి, అదే బుద్ధవిగ్రహం దగ్గర అందరూ సందర్శించి, పూజించేలా ఏర్పాట్లు చేయగలిగితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధుల్ని ఆకర్షించవచ్చుననేది ఓ ప్రతిపాదన…
- ఇప్పటికే ఏపీకి పంపకాల్లో ప్రాచీన బంగారు నాణేలు, కిరీటాలు, శాసనాలు, చారిత్రక ప్రాధాన్యం కలిగిన వస్తువులు ఇస్తున్నారు… అసలు విషయానికి వస్తే… 2019లో సాక్షి ఓ వార్త రాసింది… నాంపల్లిలో వైఎస్ఆర్ మ్యూజియం నుంచి ఈ బుద్ధుడి చితాభస్మం ఏపీకి తరలిస్తారనేది ఆ వార్త సారాంశం… కేసీయార్ దీనికి ఎలా అంగీకరించాడనేది పెద్ద ప్రశ్న.,. జగన్ ఏదడిగితే అది ఇచ్చేయడమే…
సరే, అది కార్యాచరణలోకి రాలేదు, సంతోషం… రేవంత్ రెడ్డి కరాఖండీగా ఏపీకి తేల్చిచెప్పేసి, దాన్ని హైదరాబాద్‌లోనే ఏ పంచాయితీ లేకుండా ఉంచేసి, బౌద్ధ సన్యాసులు, భక్తులు, పర్యాటకుల్ని రప్పించేలా ఓ కార్యాచరణకు పూనుకోవాలి… ఇలాంటి ఆధ్యాత్మిక సంపద అమూల్యం… మరో ఉదాహరణ చెప్పుకోవాలి ఇక్కడ…

1898లో ఉత్తరప్రదేశ్‌లోని పిపర్‌వాహలో (భారత్- నేపాల్ సరిహద్దుకు సమీపం) ఓ పురాతన బౌద్ధ స్తూపం తవ్వకాల్లో కొన్ని అవశేషాలు బయటపడ్డాయి… గౌతమ బుద్ధుడివని భావిస్తున్న అస్థి అవశేషాలు, విలువైన పేటికలు, బంగారు ఆభరణాలు, రత్నాలు వీటిలో ఉన్నాయి…
- బ్రిటిష్ పాలనలో భారత్ నుంచి తరలిపోయిన బుద్ధుడి ఆ పవిత్ర అవశేషాలను 127 ఏళ్ల తర్వాత తిరిగి స్వదేశానికి తీసుకొచ్చారు… ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా వెల్లడించాడు… 2025 ప్రారంభంలో ఓ అంతర్జాతీయ వేలంలో కనిపించిన వీటిని కేంద్ర ప్రభుత్వం పలు ప్రయత్నాలతో దేశానికి తిరిగి తీసుకొచ్చింది…

తాజాగా ‘ద లైట్ అండ్ ద లోటస్, ద రెలిక్స్ ఆఫ్ ది అవేకన్డ్ వన్’ పేరిట దక్షిణ ఢిల్లీ, కిలారాయ్ పిథౌరాలో అంతర్జాతీయ ప్రదర్శనకు ఉంచారు వాటిని… మోడీతోపాటు అనేకమంది బౌద్ధ సన్యాసులు కూడా హాజరయ్యారు… అది ఆధ్యాత్మిక వారసత్వ సంపద... తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అర్థమైందనే అనుకుంటున్నాను..!!
ఏపీలో దొరికాయి కదా, ఏపీకే దక్కాలి అనేవాళ్లూ ఉంటారు… కానీ ఉమ్మడి రాష్ట్రంలో, అప్పటి ఉమ్మడి రాజధానికి దక్కిన సంపద అది… దలా లామా వంటి అత్యున్నత బౌద్ధ గురువే ఆమోదించాడు ఇక్కడే ఉంచి, బౌద్ధుల పూజలకు అందుబాటులో ఉంచాలని..! అందుకే అది తరలిపోకూడదు… ఇదే తెలంగాణ వాదన..!!
Share this Article