మోడీ వేక్సిన్ పాలసీలపై అసంతృప్తి వ్యాప్తి చెందుతూనే ఉంది… చివరకు జగన్ కూడా పెదవి విరిచాడు… అందరమూ ఏకాభిప్రాయంతో ఉందామని ముఖ్యమంత్రులకు లేఖ రాశాడు… కరోనా వేక్సిన్ చివరకు కేంద్రం వర్సెస్ రాష్ట్రాలుగా మారుతోందనీ, రాష్ట్రాల మీద బాధ్యత పెట్టేయడం సరికాదనీ, కేంద్రమే బాధ్యత తీసుకోవాలనీ వాటిల్లో పేర్కొన్నాడు… ‘‘చివరకు జగన్ కూడా’’… అని ఎందుకు ప్రత్యేకంగా పేర్కొనాల్సి వస్తున్నదీ అంటే..? పేరుకు బీజేపీయేతర ముఖ్యమంత్రే అయినా, తటస్థుడే అయినా, కేంద్ర విధానాలకు సంబంధించి జగన్ దాదాపు బీజేపీ సీఎంగానే కనిపిస్తున్నాడు కొన్ని సందర్భాల్లో… మరీ ఆమధ్య ఒక ఇష్యూలో బీజేపీ ముఖ్యమంత్రులకన్నా మోడీకి ఎక్కువ సపోర్ట్ చేశాడు… అలాంటి జగన్ కూడా మోడీ వేక్సిన్ విధానం మీద అసంతృప్తి వ్యక్తం చేశాడు అంటే విశేషమే కదా… ఇంతకీ ఆ ఇష్యూ ఏమిటంటారా..?
మోడీ కరోనా సమస్యపై కొందరు సీఎంలతో వర్చువల్ భేటీ నిర్వహించినప్పుడు… జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ మోడీ ధోరణి పట్ల విసుక్కున్నాడు… ఎంతసేపూ నువ్వు చెప్పేదేనా..? మేం చెప్పేదేమీ వినవా సారూ, ఇదేం పోకడ అని విమర్శించాడు… అదొక రాజకీయ ధోరణి, కాంగ్రెస్తో పొత్తు ప్రభుత్వం కాబట్టి మోడీ మీదకు విమర్శనాబాణాలు ఎక్కుపెట్టాడు… దానికి జగన్ స్పందిస్తూ… ఇలాంటి సందర్భాల్లో కేంద్రం మీద ఇలాంటి విమర్శలు తగవు అన్నాడు… ‘‘మీ నిస్సహాయత నేను అర్థం చేసుకోగలను’’ అంటూ సోరెన్ మర్మగర్భంగా జగన్ను ఎత్తిపొడుస్తూ ఓ ట్వీట్ బాణం వదిలాడు… ఎక్కడ తన బెయిల్ రద్దవుతుందో అనే భయంతో ఉన్నాడు జగన్, అందుకే మోడీ మీద ఈగ వాలనివ్వడం లేదు అనే విమర్శలు వచ్చాయి… అదిక్కడ కాసేపు వదిలేయండి…
Ads
మరి అలాంటి జగన్ కూడా మోడీ వేక్సిన్ పాలసీ మీద పెదవివిరిచాడు… కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ మొదట స్టార్ట్ చేశాడు ఈ లేఖల్ని… తటస్థంగా ఉండే ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కూడా ఈవిషయంలో ఇతర బీజేపీయేతర ముఖ్యమంత్రులతో కలిశాడు… మోడీ ధోరణి కరెక్టు కాదన్నాడు… తటస్ఠ కేటగిరీలోనే కనిపించేవారిలో ఇక మిగిలింది జగన్, కేసీయార్… ఇప్పుడు జగన్ కూడా ఆ ముఖ్యమంత్రుల ధోరణితో ఏకీభవిస్తున్నాడు… అందరమూ ఒకే అభిప్రాయంతో ఏకస్వరం వినిపిద్దాం అని పిలుపునిస్తున్నాడు… ఇక మిగిలింది కేసీయార్… ప్రధానంగా అందరి వాదనా ఒకటే… కరోనాపై పోరాటానికి వేక్సిన్లే శరణ్యం, ఆ బాధ్యతను కేంద్రం తీసుకోవడం లేదు… 18-44 కేటగిరీలో వేక్సిన్లు వేయించే బాధ్యత మీదే అంటూ రాష్ట్రాలపైకి నెట్టేసింది… దేశీయ ఉత్పత్తి సరిపోవడం లేదు… గ్లోబల్ టెండర్లు పిలిచినా ఎవరూ రావడం లేదు… మేం డబ్బు ఖర్చుకు సిద్ధపడుతున్నా వేక్సిన్ దొరకని ఈ దుస్థితికి కేంద్ర విధానాలే కారణం అనేది రాష్ట్రాల విమర్శ… వేక్సినేషన్ లేకుండా కరోనాపై పోరు ఎలా సాధ్యమని వాటి ప్రశ్న… దురదృష్టవశాత్తూ కేంద్రం దగ్గర దీనికి సరైన సమాధానమూ లేదు, సానుకూల నిర్ణయాల వైపు చూపు కూడా లేదు… ఒకవైపు సుప్రీం కోర్టు కూడా అక్షింతలు వేస్తున్నా సరే…!!
Share this Article