.
ముందుగా ఒక మాట… ప్రస్తుతం సైబర్ క్రిమినల్స్ ఎంత వ్యూహాత్మకంగా, ఎంత తెలివిగా పనిచేస్తున్నారంటే… అతిశయోక్తి అని కాదు గానీ… కాస్త ఏమరుపాటుగా ఉంటే సైబర్ పోలీసులను కూడా బోల్తా కొట్టించగల ఘనాపాటీలు..!!
నిన్న మొత్తం సోషల్ మీడియాలో జేడీ లక్ష్మినారాయణ భార్య ఊర్మిళ దగ్గర సైబర్ నేరగాళ్లు 2.5 కోట్లు కొట్టేశారనే వార్త బాగా సర్క్యులేటైంది…దురాశా దుఃఖానికి చేటు, సీబీఐ జేడీగా పనిచేసిన హైప్రొఫైల్ మాజీ పోలీసుకు సైబర్ క్రిమినల్స్ ఎత్తుగడలు తెలియవా..? అసలు ఇంత వైట్ మనీ ఎక్కడిది..? దాకా బోలెడు చర్చలు, వ్యాఖ్యలు…
Ads
ముందే చెప్పుకున్నాం కదా… వర్తమానంలో సైబర్ క్రిమినల్స్ తెలివితేటలు అనూహ్యంగా, విస్మయకరంగా ఉన్నాయి… అంతగా నమ్మించగలరు, డబ్బు పెట్టించగలరు… ఏదో ట్రేడింగ్ చిట్కాల పేరిట, అడ్డగోలు ఆదాయం పేరిట… కొన్ని లాభాలు చూపిస్తారు ముందుగా… నమ్మకాన్ని పెంచుతారు, ఇక ఇరికిస్తారు, డబ్బు లాగేస్తారు… విత్‌డ్రా ఆప్షన్ మాయం, అడిగితే మొత్తం అందరూ మాయం అయిపోతారు…
అనేక మ్యూల్ ఖాతాలు వాడతారు… డబ్బులు కమీషన్లుగా ఇచ్చి రకరకాల బ్యాంకు ఖాతాలు వాడతారు… జేడీ లక్ష్మినారాయణ భార్యకు కూడా ఎక్కడెక్కడో ఉన్న బ్యాంకు ఖాతాలకు డబ్బు బదిలీ చేయాలని చెబుతూ ఉండటంతోనే సందేహం వచ్చినట్టుంది… ఆమె తన పేరిట గాకుండా లక్ష్మినారాయణ పేరిటే ఈ లావాదేవీలు ఆపరేట్ చేసిందంటున్నారు… బ్యాంకు డిపాజిట్లతోపాటు బంగారంపై రుణాలు తీసుకుని మరీ మోసపోయింది ఆమె…

నిజం ఏమిటంటే..? సైబర్ క్రిమినల్స్ టార్గెట్స్ ఎవరంటే..? చిన్నాచితకా వ్యాపారులో, ఉద్యోగులో కాదు… రిటైర్డ్ అధికారులు, పెద్ద పెద్ద పదవుల్లో పనిచేసినవాళ్లు, తమ తెలివితేటలకు సైబర్ క్రిమినల్స్ వలలో పడేది లేదనే అతి ధీమాతో ఉన్నవాళ్లు,, బ్యాంకుల్లో డిపాజిట్ల ద్వారా అధిక వడ్డీ ఆదాయం రావడం లేదనే అసంతృప్తితో ఉన్నవాళ్లు…
వాట్సపు గ్రూపుల్లో, ఫేస్‌బుక్‌లో వచ్చే ప్రకటనలన్నీ దాదాపు ఇంతే… చివరకు ఏవేవో సరుకుల మార్కెటింగ్ యాడ్స్ కూడా ఫేక్… ఐతే నాసిరకం సరుకులు లేదా సైబర్ ట్రాప్… ఎవరు ఏపీకే ఫైళ్లు పంపించినా ఓపెన్ చేయొద్దు, డౌన్ లోడ్ చేయొద్దు… అది అత్యంత ముఖ్యమైన జాగ్రత్త… ఎవరి పేరిట ఎవరు అడిగినా ఓటీపీలు షేర్ చేయొద్దు, ఇది రెండో అతి ముఖ్యమైన జాగ్రత్త…
షేర్ ట్రేడింగ్ చిట్కాల యాప్స్, ప్రచారాలన్నీ బోగసే… ఇక డిజిటల్ అరెస్టులు ప్రస్తుతం దేశాన్ని వణికిస్తున్న సైబర్ వైరస్… సైబర్ క్రిమినల్స్ వలలో ఎలాంటి తెలివైనవాళ్లయినా పడిపోతున్నారని చెప్పడానికి ఓ తాజా ప్రబల ఉదాహరణ…

ఐక్యరాజ్యసమితిలో 48 ఏళ్లపాటు పనిచేసి, రిటైరయి, ఢిల్లీలో ప్రశాంతంగా బతుకుతున్న ఓ వృద్ధ డాక్టర్ల జంట (ఓం తనేజా, ఇందిర తనేజా) నుంచి ఏకంగా 14.85 కోట్లు కాజేశారు సైబర్ నేరగాళ్లు… డిజిటల్ అరెస్టు పేరిట…
మీ నంబర్ నుంచి అసభ్య వీడియోలు, కాల్స్ వస్తున్నాయని 26 ఫిర్యాదులు వచ్చాయి, మీమీద కేసు నమోదైంది… అదేకాదు, మనీ లాండరింగ్, ఎఫ్ఐఆర్ నమోదు, అరెస్ట్ వారెంటు జారీ అంటూ 17 రోజులపాటు ఇంట్లోనే డిజిటల్ అరెస్టు చేశారు… 24 గంటలూ ఆన్‌లైన్‌లోనే ఉంచారు…
ఐరాసలో పనిచేసిన హైప్రొఫైల్, వెల్ ఎడ్యుకేటెడ్, చట్టాలు తెలిసిన వాళ్లను కూడా బోల్తాకొట్టించారంటే ఇక సైబర్ నేరగాళ్ల తెలివిని, ఆపరేషన్ నైపుణ్యాన్ని అర్థం చేసుకోవాల్సిందే… జేడీ లక్ష్మినారాయణ ఓ లెక్కా వాళ్లకు..? పెద్ద పెద్ద వాళ్లే బోల్తా కొట్టారు..!!

ఆమధ్య సాక్షాత్తూ ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఫోటో పెట్టి, ఎఐ వాయిస్‌తో రోజుకు వేల రూపాయలు సంపాదించవచ్చునని ఫేక్ యాడ్స్ సోషల్ మీడియాలో బహుళ ప్రచారం పొందినా సరే, కేంద్ర ప్రభుత్వానికి సోయి లేదు..!!
Share this Article