.
పాస్, సెకండ్ క్లాస్, ఫస్ట్ క్లాస్, డిస్టింక్షన్… మన శివశంకర ప్రసాద్ గారు ఈ సంక్రాంతి కంబాలా పోటీలో సెకండ్, ఫస్ట్ క్లాస్ నడుమ పాసయ్యారు… దర్శకుడు అనిల్ రావిపూడి పాస్ చేయించాడు… సినిమా వోకే… గొప్పగా ఏమీ లేదు, తీసిపారేసేది కూడా కాదు… సరదా సరదాగా… పక్కా అనిల్ రావిపూడి సినిమా… టైం పాస్ పల్లీ బఠానీ… కమర్షియల్‌గా కూడా గట్టెక్కినట్టే అనుకోవచ్చు..!
నిజానికి వెండి తెర మీదకు రీఎంట్రీ తరువాత చిరంజీవి సినిమాలు బ్రహ్మాండమైన హిట్లు ఏమీ సాధించడం లేదు… అదే రొటీన్ ఫైట్లు, డాన్సులు… అవే ఎలివేషన్స్, అవే మేనరిజమ్స్… జనం కొత్త రకం సినిమాలు చూస్తూ, కొత్త తరం హీరోలను చూస్తూ, సరికొత్త ప్రయోగాలు చూస్తూ అటువైపు మళ్లుతున్న వేళ… ఏమాత్రం భిన్నత్వం లేని కథలు, అవే పాతతరం పోకడలతో ‘ఏమాత్రం మారలేని చిరంజీవి’ నుంచి తన ఫ్యాన్స్ కూడా చాలామంది మళ్లిపోతున్నారు…
Ads
తను మమ్ముట్టి, మోహన్‌లాల్ తరహాలో భిన్న ప్రయోగాలకు వెళ్లడు… రజినీకాంత్, కమల్‌హాసన్ స్టయిల్‌లో పక్కా కమర్షియల్ పోకడలోనే ఉండిపోయాడు… చివరకు తన రీఎంట్రీ సినిమాలు తన పాపులారిటీ రేంజులో ఆడకపోయేసరికి… అసలు తన తదుపరి బాట ఏమిటో తేల్చుకోలేని డైలమాలో తనకు ఈ అనిల్ రావిపూడి దొరికాడు… ఫన్ ఓరియెంటెడ్ డైరెక్టర్ తను, ఫ్లాపుల్లేవు… సేఫ్…
- సో, ఈ స్థితిలో మళ్లీ పాత వింటేజ్ చిరంజీవిని చూపించడానికి దర్శకుడు అనిల్ రావిపూడి కాస్త కొత్తగా, తనదైన స్టయిల్‌లో బాగానే ట్రై చేశాడు… చిరంజీవి కామెడీ టైమింగ్ సూపర్ ఉంటుంది… దాన్ని అనిల్ బాగా యూజ్ చేసుకున్నాడు… అనిల్ రావిపూడి పెద్దగా లాజిక్స్ జోలికి కూడా పోడు… మామూలు కథతోనే సినిమా వినోదాత్మకంగా ఉండేలా చూస్తాడు… వరుస టీవీ స్కిట్లలాగా అనిపించినా సరే… తన స్టయిల్ తనది…
ఈ సినిమాలోనూ అంతే… చిరంజీవి, వెంకటేశ్ తమ పాత పాటలకు డాన్సులు చేసినా… చిరంజీవి తన పాత లుక్కును మళ్లీ తెచ్చుకున్నా… దర్శకుడు ఎక్కువగా ఫన్ ఓరియెంటెడ్ కథనానికే మొగ్గుజూపినా… అంతా సేఫ్ బెట్… నో ఎక్స్‌పరిమెంట్స్… పండుగవేళ థియేటర్‌కు వచ్చేవాళ్లకు ఓ షో రక్తికట్టేలా ఆడించి చూపించడమే… ఫ్యామిలీ ప్రేక్షకులకు విసుగు తెప్పించకుండా ఎలా కథనం నడపాలో పల్స్ తెలిసినోడు అనిల్ రావిపూడి…

ఫస్టాఫ్ అంతా సరదా సరదాగా… చిరంజీవితో ఫన్ బేస్డ్ సీన్లతో నడిచిపోతుంది… మొత్తం సినిమా అలాగే ఉంటే తెలుగు సినిమా లెక్కలు ఒప్పుకోవు కదా… అందుకే సెకండాఫ్ రొటీన్ తెలుగు సినిమా మార్గంలోకి మళ్లుతుంది… ఏవో ఇన్వెస్టిగేషన్లు, యాక్షన్ సీన్లు… ఫస్టాఫ్‌తో పోలిస్తే స్లో, కాస్త సాగదీత… చివరలో వెంకటేశ్ కనిపించే 20 నిమిషాల్లో తను, చిరు కలిపి దున్నేస్తారు… వెంకీ కో-హీరో కాదు, సైడ్ హీరో కాదు… ఓ పెద్ద అతిథి పాత్ర అన్నట్టుగా ఉంది…
అనిల్ రావిపూడికి మరో విషయంలోనూ మెచ్చుకోవచ్చు… సినిమా ప్రమోషన్స్ కూడా కాస్త వెరయిటీ చేస్తాడు తను… తన ఏ సినిమా ప్రమోషన్లకు రాని నయనతారను కూడా ప్రమోషన్లకు ఒప్పించాడు… చిరంజీవి సమకాలీనుడు, దీటైన హీరో ఇమేజ్ ఉన్న వెంకటేశ్‌ను కూడా చివరి 20 నిమిషాల పాత్రకు ఒప్పించాడు… ఓవరాల్‌గా ఫ్యామిలీ ప్రేక్షకులను, చిరంజీవి ఫ్యాన్స్‌ను ఒప్పించాడు, ఎంతోకొంత మెప్పించాడు…
-
అనిల్ రావిపూడి అదృష్టం బాగుంది… కాబట్టే విజయ్ జననాయగన్ సినిమా వాయిదా పడింది… శివకార్తికేయన్ పరాశక్తి సినిమా తన్నేసింది… ప్రభాస్ చతికిలపడ్డాడు… చివరకు కోర్టు బుక్ మైషోల రివ్యూలను కూడా నిరోధించింది… తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రేమతో రహస్యంగా రాజాసాబ్‌కన్నా రెండురోజుల ముందే టికెట్ రేట్లు, బెనిఫిట్ షోలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది… కోర్టు అడ్డంకులూ రాలేదు… ఇంకేం కావాలి..? అన్నీ మంచి శకునములే..!!
ఈ సినిమాలో ఓ సస్పెండెడ్ ఎస్సై విలన్… ఆ విలన్ చుట్టూ వందల మంది మిషన్ గన్లతో తిరుగుతుంటారు… అలాంటివి చూసీచూడనట్టు పోవాలి మనం సినిమాను ఎంజాయ్ చేయాలంటే..! హీరో ఇందులో ఎన్ఐఏ ఆఫీసర్… ఓ ధనికురాలైన భార్యతో కుటుంబ చికాకులు, విడాకులు… తన కుటుంబాన్ని ఎలా చక్కదిద్దుకున్నాడో, అలాగే అవసరమైనప్పుడు యాక్షన్‌లోకి ఎలా దిగిపోయాడో ఈ కథ…
నయనతారకు పెద్దగా మాటలుండవ్, కానీ హావభావాలతో బాగా చేసింది… ఆ పాత్రకు కరెక్టుగా సూటైంది… పాటలు పర్లేదు… విలన్ కేరక్టరైజేషన్ ఇంప్రెసివ్‌గా ఏమీ ఉండదు… పాటలు పర్లేదు… క్లైమాక్స్ కూడా సో సో…!! వెరసి ఓ సాదాసీదా కథకు అనిల్ రావిపూడి మార్క్ ప్రజెంటేషన్ ఈ సినిమా..!!
రెండు తెలుగు ప్రభుత్వాలు అత్యంత ఉదారంగా పెంచేసిన, అంతటి టికెట్ రేట్లు పెట్టి మరీ వెళ్లాల్సిన రేంజ్ సినిమాయా..? ఈ ప్రశ్నకు జవాబు లేదు..!!
Share this Article