.
వారసులు… ఈ దేశ ప్రజాస్వామిక రాజకీయాలకు వైరసులు… కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా… కుటుంబ పార్టీలు, అవినీతి పార్టీలు, ప్రాంతీయ పార్టీలు రకరకాల విద్వేషాల్ని… ఉద్వేగాంశాలుగా మార్చి ఓట్ల పబ్బం గడుపుకుంటున్నారు…
మన తెలుగు రాష్ట్రాలు కూడా అతీతం ఏమీ కాదు… ప్రస్తుతం మనం చెప్పుకునేది బృహన్ ముంబై కార్పొరేషన్ ఎన్నికల గురించి… అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా చతికిలపడిన ఉద్దవ్ ఠాక్రే మళ్లీ విద్వేషాన్నే ఎజెండాగా ఎత్తుకున్నాడు…
Ads
ఆల్రెడీ తన పార్టీని, శివసేన రాజకీయ వారసత్వాన్ని పోగొట్టుకున్నాడు కదా… ఫ్రస్ట్రేషన్… సొంతంగా పార్టీ పెట్టి జాడలేకుండా పోయిన రాజ్ ఠాక్రేతో కలిసిపోయాడు… మరాఠీ అస్త్రానికి పదును పెడుతున్నాడు… మొన్నమొన్నటిదాకా బద్ధశత్రువులు… ఇప్పుడు అస్థిత్వ అవసరం… అందుకే రాజ్ థాక్రే (MNS), ఉద్ధవ్ థాక్రే (Shiv Sena UBT) ఇప్పుడు కలిసిపోయి ప్రాంతీయవాద కత్తుల్ని నూరుతూ… బీజేపీని ఎదుర్కోవడానికి సిద్ధమయ్యారు…
- రాజ్ ఠాక్రే కొడుకు పేరు అమిత్ ఠాక్రే… మేం అధికారంలోకి వస్తే మరాఠీయేతరులు ఎవరూ ముంబైకి రాకుండా సరిహద్దుల్లోనే రైళ్లను ఆపేస్తాం అని కూశాడు మొన్న… మరాఠీలు తప్ప ఇంకెవరూ ముంబైలో ఉండకూడదట, రాకూడదట…
ఏమిటింత అజ్ఞానం..? ముంబై, మహారాష్ట్ర ఇండియాలో లేదా అని అడక్కండి… తక్షణం ఏవో ఉద్వేగాల్లో ఇంధనం పోసి మంట పెంచాలి, అది తన రాజకీయ అవసరం… నాన్ మరాఠీ ప్రజలు లేకపోతే అసలు ముంబై నగరమే లేదు… ఆ సోయి తనకు లేదు… మొన్నటి ఎన్నికల దాకా అవకాశవాద కూటమి కట్టిన ఎన్సీపీ, కాంగ్రెస్, ఉద్దవ్ శివసేన ఇప్పుడు ఎవరి దుకాణం వాళ్లదే… ఎవరి పోరాటం వాళ్లదే… పొత్తూగిత్తూ జాన్తానై…

తాజాగా ఈ ఠాక్రే లీడర్లు మరింత వివాదాస్పద వ్యాఖ్యలకు దిగారు… ఆ నినాదం పేరు ‘హఠావో లుంగీ – బజావో పుంగీ’… అంటే లుంగీదార్లను (పర్టిక్యులర్‌గా తమిళులను, ఇతర దక్షిణ భారతీయులను) ఉద్దేశించి వ్యాఖ్య… సౌత్ ఇండియన్లను తరిమికొట్టాలట… (తెలంగాణ జాగో- ఆంధ్రావాలా బాగో నినాదం గుర్తొస్తున్నదా..? ఇది వేరు, ఇది తెలంగాణేతరుల దోపిడీ మీద పోరాటం…, ఆత్మాభిమానం, స్వీయపాలన ఆరాటం…)
కానీ మహారాష్ట్రను పాలించేది మరాఠీలే కదా… ఈ పార్టీల నేతలందరూ వాళ్లే కదా… మరిక ఈ విద్వేషవ్యాప్తి దేనికి..? ముంబైకి వచ్చే ప్రతివాడూ పని కోసం వస్తున్నాడు తప్ప, పాలించడానికి కాదు..!
కానీ ఏదో ఒక ఎమోషన్‌ను రాజేస్తే తప్ప ఓట్లు పడవనే భ్రమాత్మక రాజకీయాలు… ముంబై అంతర్జాతీయ నగరం అని వ్యాఖ్యానించిన బీజేపీ నాయకుడు అన్నామలైని ఉద్దేశించి రసమలై అని వ్యాఖ్యలు చేశారు ఠాక్రే లీడర్లు… ‘వస్తా, ముంబైకే వస్తా, నా కాళ్లు నరుకుతారా, చూద్దాం’ అని అన్నామలై ప్రతిసవాల్ విసిరాడు…
- గుర్తుంది కదా… స్టాలిన్ రాజకీయ వారసుడు, పుత్రరత్నం ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని డెంగూ, మలేరియాలతో పోల్చాడు కదా… పైకి రాజకీయ విమర్శ… కానీ ఓ సంస్కృతిని కించపరచడం… హేట్ స్పీచ్… అంటే డీఎంకే రాజకీయాలు మరికొన్ని తరాలపాటు ఎలా ఉండబోతున్నాయో అర్థమవుతోంది కదా…
చిల్లర నాయకులు, వాళ్ల వ్యాఖ్యలకు ఇంత ఇంపార్టెన్స్ ఏమిటీ అంటున్నారా..? కాదు… ఇలాంటోళ్లే రేప్పొద్దున ప్రజాప్రతినిధులవుతారు, టైమ్ కలిసొస్తే సీఎంలు అవుతారు… విద్వేషాన్ని రుద్దుతారు… అజ్ఞానం కాదు, ఇది అవకాశవాద అతి జ్ఞానం… సమాజాన్ని కలుషితం చేసే ‘వికటరూపాలు’…

-
ఇక్కడే మరో విషయమూ చెప్పుకోవాలి… “హఠావో లుంగీ, బజావో పుంగీ” (Hatao Lungi, Bajao Pungi) అనేది 1960ల చివరలో శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాక్రే ఇచ్చిన నినాదం… ‘లుంగీ ధరించే వారిని (దక్షిణాది వారు) తరిమివేయండి, పుంగీ (యుద్ధనాదం) ఊదండి’ అని దీని స్థూల అర్థం…
ఆ సమయంలో ముంబైలోని ప్రభుత్వ ఉద్యోగాల్లో, ప్రైవేట్ సంస్థల్లో దక్షిణాది వారు (ముఖ్యంగా తమిళులు, తెలుగు వారు, కన్నడిగులు) ఎక్కువగా ఉన్నారని, వారి వల్ల స్థానిక మరాఠీలకు అన్యాయం జరుగుతోందని బాల్ థాక్రే వాదించేవాడు…
ఈ నినాదంతోపాటు ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అంటూ దక్షిణాది వారి హోటళ్లు, వ్యాపార సంస్థలపై దాడులు కూడా జరిగాయి... ఇప్పుడు మళ్లీ ఆ పరిస్థితులను తీసుకువచ్చే కుతంత్రం నడుస్తోంది... అందుకే ఈ పాత నినాదం మళ్ళీ తెరపైకి వచ్చింది..!!
Share this Article