.
మొత్తానికి రవితేజ చాలా అదృష్టవంతుడు… కొన్నాళ్లు గ్యాప్, తరువాత అదే ఎనర్జీ… వరుసగా ఫ్లాపులు… అసలు ఒక్క హిట్ మొహం చూసి ఎన్నేళ్లయిందో… అనేక డిజాస్టర్లు ఇస్తున్నా సరే, ఎవరో నిర్మాత దొరుకుతాడు… రవితేజకు ఓ సినిమా ఇస్తుంటాడు… రిజల్ట్ మారదు…
తనకన్నా కమర్షియల్లీ బిగ్ స్టార్స్‌తో సంక్రాంతి బరిలోకీ దిగి పందెం కోడిలా సై అంటాడు కూడా… కానీ తన తాజా సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అని సినిమాలోని ఓ పాటలాగే… వామ్మో వాయ్యో ఎల్లంకిలో అన్నట్టుగా… ఎల్లెలుకల పడ్డాడు… అనగా వెల్లకిలా పడిపోయాడు..!!
Ads
అంతకుముందు ఏవో సాదాసీదా కథల్ని తనొక్కడే మోసేవాడు… మధ్యలో తుపాకులు పట్టాడు, హింస… ఎవరెవరో దర్శకులు… వరుసగా దెబ్బతింటుంటే… ఈసారి కామెడీ జానర్‌తో సరదాగా అలరిద్దామని వచ్చాడు… ఓ వైఫ్, లైఫులో మరో నైఫు… నడుమ మగాడి రోస్టు బాపతు కథలు బోలెడు వచ్చాయి తెలుగులో…
వెంకటేశ్ సినిమా ఇంట్లో ఇల్లాలు- వంటింట్లో ప్రియురాలు తరహాలోనే… ఇందులోనూ ఓ సాధ్వీమణి, తనకు ఓ భర్త… అర్థంతరంగా ఏదో విదేశంలో (స్పెయిన్) తగుల్కునే మరో మహిళ… మేనేజ్ చేయలేక భర్త పడే పాట్ల నుంచి కామెడీ పిండుకోవడం…

రవితేజ వరకూ వోకే, తనకు మంచి నీళ్లు తాగినంత ఈజీ ఈ పాత్ర… కామెడీ ప్రధానం కాబట్టే సునీల్, వెన్నెల కిషోర్, సత్య తదితరులు టీమ్‌లో చేరారు… గెటప్ సీను, సోనియా సింగ్ తరహా టీవీ ఆర్టిస్టులు కూడా… కానీ సోషల్ మీడియాను బాగా ఫాలో అయ్యేవాళ్లు… మీమ్స్, తాజా రీల్స్ ఎంజాయ్ చేసేవాళ్లు… రీసెంటు వివాదాల మీద అవగాహన ఉన్నవాళ్లు ఈ కథనాన్ని, ఈ కామెడీని కాస్త ఎంజాయ్ చేయగలరు…
మిగతావాళ్లకు అంతా ఏదో అర్థంకాని యవ్వారమేదో చూస్తున్నట్టు ఉంటుంది… సోషల్ మీడియా అడిక్టులకేమో రోజూ స్మార్ట్ ఫోన్లలో చూసేవే కదా అన్నట్టుంటుంది… పోనీ, పాత్రల నడుమ సంఘర్షణ బలంగా పండిందా అంటే అదీ లేదు… ఫస్టాఫ్ అయితే మరీ సో సో… స్లో స్లో… సెకండాఫ్ కాస్త బెటర్ అనిపించినా క్లైమాక్స్ మరీ ఫ్లాట్… పాటలు మరీ ఇరికించినట్టు…
ఉత్త కామెడీ కావాలంటే టీవీలు, ఓటీటీలు, స్మార్ట్ ఫోన్లలో సోషల్ మీడియా రీల్స్, షార్ట్స్, పోస్టులు ఎన్ని లేవు..? వ్యయప్రయాసలకోర్చి థియేటర్‌కు వచ్చేవాళ్లకు ఓ కొత్త కథో, ఓ కొత్త ప్రజెంటేషనో, ఓ కొత్త ఎమోషనో, ఓ కొత్త ప్రయోగమో, తమను బలంగా కనెక్టయ్యే అంశమో లేకపోతే ప్రేక్షకులు ఎందుకు వస్తారు..? పైగా ఈమధ్య నీయమ్మని, నీయక్కని వంటి బూతు పాటల ధోరణికీ దిగిపోయాడు…
రవితేజ బహుశా ఇక మారడు, మారలేడు… పక్కా కమర్షియల్ లెక్కల్లో తను రొటీన్ ఫార్ములా పిచ్చి కథల్లో మునిగీ తేలుతున్నన్ని రోజులు రవితేజ సినిమాల ఫలితాలూ మారవు… ఆషికా రంగనాథ్, డింపుల్ హయతిలు, ఎల్లెంకలో వంటి పాటలు ఎన్నాళ్లో తనను రక్షించలేవు…
సర్లెండి, మళ్లీ ఎవరో నిర్మాత దొరక్కపోడు, మరో పిచ్చి సినిమా జనం మీదకు వదలకపోడు అంటారా..? అదీ నిజమే… ఈ పందెం కోడి ప్రతిసారీ ఫెయిలవుతూనే ఉన్నా, ఎవరో వస్తున్నారు, కొత్త కత్తులు కడుతున్నారు, బరిలోకి వదులుతున్నారు… మొండిబారిన ఆ కత్తులు ఫెయిలవుతూనే ఉన్నాయి… మంచి సత్తా ఉన్న హీరో అని తనను అభిమానించినవాళ్లనూ తలెత్తుకోకుండా చేస్తూనే ఉంటాడు రవితేజ..!!
.
పాత ఖడ్గం సినిమాలో ఓ పాట... రవితేజదే... గుర్తుండి ఉండదు బహుశా... ‘‘గోవిందా గోవిందా, బాగు చెయ్ నను గోవిందా... మాస్ హీరో చాన్సులివ్వు, హిట్టు సినిమా స్టోరీలివ్వు...’’ అవును, రవితేజ ఇలా పాడుకోవాల్సిందే..!!
Share this Article