.
Gottimukkala Kamalakar….. ప్రతీరోజూ నూటాఎనభై కోట్ల ఫోటోలు సోషల్ మీడియాలో అప్లోడ్ అవుతున్నాయట..! నిజంగా అన్ని అపురూప సంఘటనలు జరుగుతున్నాయా అని ప్రశ్నించుకుంటే సమాధానం చాలా నిరాశాజనకంగా ఉంటుంది. ఆ ఫోటోలన్నీ స్థూలంగా చెప్పేదొక్కటే..!
“నన్ను చూడండి.. ఈ గుడ్డలేసుకున్నా..! ఇలా వున్నా..! ఇది తిన్నా..! ఇక్కడికెళ్లా..! దీన్ని చూసా..! దాన్ని చూడలేదు..! వీళ్లిష్టం..! వాళ్లు అసహ్యం..! ఫలానా ఫలానా చోట్లకు తిరుగుతున్నా..!”
Ads
****
నేను మధ్యవయస్కుణ్ని..! నా బాల్యంలో చిన్నవో, పెద్దవో నాకంటూ కొన్ని అపురూపమైన జ్ఞాపకాలు గుండెల్లో నిండున్నాయి. వాటి ఫోటోలేవీ లేవు. కానీ, ఈ కాలపు జ్ఞాపకాల సాంద్రతంతా ఫోటోల మీదే ఆధారపడి ఉంటోంది.
తాగుతున్న కాఫీ/ సిగరెట్టూ..;
తింటున్న ఇడ్లీ/ పిజ్జా..;
చూస్తున్న సినిమా/ ఓటీటీ;
ద్యోతకమౌతున్న సూర్యోదయం/ సూర్యాస్తమయం..;
పొద్దున్నే జిమ్మూ/ సాయంత్రం రమ్మూ..;
చిన్నా చితకా ఔటింగ్/ వార్షికవిహారయాత్రా..;
పిల్లులూ/ జల్లులూ..;
ఫ్యాన్సూ/ఆంటీ ఫ్యాన్సూ;
శివాజీ/ అనసూయాజీ
అన్నీ ఫోటోలే..! ప్రతీ ఉద్వేగాన్నీ కెమెరాలో బంధించాల్సిందే..! దీనమ్మ, టెక్నాలజీ డీయెస్సెల్లార్ కెమెరా అన్ లిమిటెడ్ స్టోరేజ్ సదుపాయంతో ఫోన్ లో దూరి జేబులో కూర్చుంది. మన ఫోనుకూ, సెల్ఫీలకూ కట్టప్పలమయ్యాం..!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనలోని నేచురల్ కామన్ సెన్స్ ని కబళించేస్తోంది…!
ఎక్కడ తినాలి..? ఏం తినాలి..? ఎక్కడికెళ్లాలి..? ఎప్పుడు వెళ్లాలి నుండి, ప్రీ వెడ్డింగ్/ ప్రీ ఎంగేజ్మెంట్ ఫోటోలు ఏ స్టూడియో వాళ్లు తీసారు..? ఫంక్షన్ హాలేది..? మెన్యూ ఏంటి..? మాత్రమే కాకుండా, మూర్తి గారి నాన్నగారు చనిపోతే ఏ శ్మశానంలో ఎన్ని గంధపు కట్టెలు ఎంత నెయ్యితో దహనం చేశారు..? అనేవి తెలిసినోళ్ల ఇన్స్ స్టాగ్రామ్ చూసి నిర్ణయం తీసుకొంటున్నాం..!
ఏతావాతా మన బతుకును మన ఫోన్& సోషల్ మీడియా నిర్ణయిస్తున్నాయి. మనం మన జీవితాన్ని మనకోసం జీవించడం లేదు. జనానికి చూయించడం కోసం బతికేస్తున్నాం..!
పోనీ, దీంతో ఎమైనా ఆత్మతృప్తి ఏడిచిందా అంటే అదీలేదు. ఎవ్వరికీ పిక్చర్ పర్ఫెక్ట్ లైఫ్ ఉండదన్న విషయం మరిచిపోతున్నాం..! ప్రతీ పెంటనూ పంచభక్ష్యపరవాన్నంలా ఫీలవుతూ, మన అన్నాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. మన ఆనందాన్ని మనం అనుభవించకుండా, ప్రపంచాన్ని తూకమేయమంటున్నాం..!
లైకులు, కామెంట్లూ రాకపోతే, మన అనుభవానికి వీసమెత్తు విలువైనా లేదా..? మనం బతికున్నామన్న సాక్ష్యం మన ఎఫ్బీ & ఇన్స్టా లోనే నిరూపితమవుతుందా..? అసలు బైటి ప్రాంతాలకు వెళ్లేదే ఫోటోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడానికైతే, ఏం ఆనందం మిగులుతుంది..?
నాకైతే అలాంటివాళ్లను చూస్తే, తిరుమల వైకుంఠం క్యూలో గంటల తరబడి నిలబడి, తీరా వేంకటేశ్వరుని ముందు నిలిచిన లిప్తలో కళ్లు మూసుకునే మూఢుల్లా; కార్తీక పౌర్ణమి రోజున తాజ్మహల్ ముందు నిద్రపోయేవాళ్లలా కనిపిస్తారు.
స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ముందు సెల్ఫీ దిగకపోతే అమెరికా ట్రిప్పూ; ఈఫిల్ టవర్ ముందు సెల్ఫీ దిగకపోతే పారిస్ ట్రిప్పూ పూర్తవనట్టేనా..? ఈ బాపతు జనాలు ఛాన్సుంటే ” crossing rourava..& feeling finished” అంటూ సెల్ఫీ పెట్టేయగలరు.
“Having mexican lunch at Hyatt with Pulla Rao” అంటూ పోస్టూ పిక్కూ పెట్టేస్తే, ఓ నూటా యాభై ఎమోటికాన్స్ వస్తే, తిండి తినే టైంలో కోరి పెంటను రుద్దుకోవడమే కదా..? మన ప్రతీ ఆనందాన్ని పక్కోడు అప్రూవ్ చేయకపోతే దేశాలు మునిగిపోతాయా..?
మనం పబ్లిక్ లో పోస్ట్ చేస్తున్న ప్రతి సంఘటన మధ్యలో మాత్రమే మన నిజమైన ఆనందాలుంటాయి. వాటిని గుర్తించి, గుండెపొరల్లో దాచుకోలేకపోవడం కన్నా విషాదం లేదు.
నిజమైన విలువైన అనుభవాలను శోధించి, సాధించి సొంతం చేసుకోకుండా, పనికిరాని ప్రతీ విషయాన్ని ఫోటోలు తీసి పోస్టులు పెట్టడం…
పాడిగేదెనమ్ముకుని పనికిరాని దున్నపోతును కొనుక్కోవడం లాంటిది.
మనం పరిశుద్ధాత్మలమని నిరంతరం ప్రవచనాల టముకేసుకోవడం వల్ల చిల్లుకాణీ ప్రయోజనం లేదు. జనాల లైకుల వల్ల ఒరిగేదీ లేదు. ఆత్మవిశ్వాసం మిల్లీగ్రాము కూడా పెరగదు. దాన్ని అంతశ్శోధనతో పెంచుకోవలసిందే..!
మనల్ని మనం నగ్నంగా అద్దంలో చూసుకుని సమీక్షించుకుంటే సరిపోతుంది. మనం మామూలు మనుషులమనీ, పొరపాట్లూ, తప్పులూ చేస్తుంటామనీ, అందరూ అంతేననీ తెలుసుకుంటే చాలు.
వేల మంది ఫాలోవర్లకన్నా పై విషయాన్ని అర్ధం చేసుకుని, చిరునవ్వుతో భుజం తట్టగలిగే ఒఖ్క హితుడు చాలు..!!
Share this Article