.
పెద్ద పెద్ద స్టార్లు… అనగా వందల కోట్ల పందెం కోళ్లు ఎలివేషన్ కత్తులు కట్టుకుని బరిలో దిగాయి… పైగా ఆహా ఓహో భజన ఫ్యాన్ బృందాల హైప్ ఉండనే ఉంది… ఈ నేపథ్యంలో ఆ పందెం కోళ్లకు దీటుగా బరిలోకి… తక్కువ ఖర్చతో… కేవలం కామెడీని నమ్ముకుని… ఓ చిన్న హీరో బరిలోకి దిగి తట్టుకోగలడా..?
ఇదే కదా ప్రశ్న..? అవును, నవీన్ పోలిశెట్టి తన భుజాల మీద అన్నీ తానై మోసిన ‘అనగనగా ఒక రాజు’ సినిమా గురించే నేను చెప్పేది… విపరీతమైన ప్రచారం లేదు, ఎడాపెడా ముందస్తు ఎలివేషన్లు లేవు, భారీ పటాటోపాలు లేవు, అట్టహాసాల ఈవెంట్లు లేవు, అంత భారీ ఖర్చూ లేదు… కానీ బరిలో నిలబడింది… కాస్త అతి అనిపించినా సరే, హైప్ లేకుండా వచ్చిన హీరో సక్సెస్ కొట్టడమే అసలైన సక్సెస్… సంక్రాంతి అసలు విజేత నవీన్ పోలిశెట్టి..!
Ads
ఇదేమీ అతిశయోక్తి కాదు… ఈ సినిమా సూపర్ ఉందనీ కాదు… కానీ కేరక్టరైజేషన్‌లోనే కామెడీ ఇమిడ్చి, కృతకంగా లేకుండా జాగ్రత్తపడి, ఆద్యంతం నవ్వులతో రక్తికట్టించడం మామూలు టాస్క్ కాదు… ఒరిజినల్‌గా స్టాండప్ కమెడియన్ అయిన నవీన్ పోలిశెట్టి తనదైన కామెడీ టైమింగుతో మెప్పించాడు… అదీ చెప్పదగిన అంశం…

అసభ్యత లేదు, అడ్డమైన ఎలివేషన్లు లేవు… అన్నింటికీ మించి ఫ్యాన్ల సోషల్ మీడియా పోరాటాల చికాకు అస్సల్లేదు… వామ్మో వాయ్యో వంటి కూతపాటలు కూడా లేవు… గ్రాఫిక్స్ తంటాలు అసలే లేవు… ఒక ఫ్యామిలీతో సినిమాకు వెళ్తే, ఏ ఇబ్బందీ లేకుండా చూసేలా జాగ్రత్తపడ్డాడు దర్శకుడు, హీరో, నిర్మాత…
సినిమా రివ్యూకు వస్తే… సినిమా కథ చాలా సింపుల్. ఒకప్పుడు కోటీశ్వరుడిగా వెలిగిన రాజు (నవీన్ పోలిశెట్టి) ఇప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటాడు… ఎలాగైనా తిరిగి తన పూర్వ వైభవాన్ని సంపాదించుకోవాలనే కసిలో ఉంటాడు… ఈ క్రమంలోనే మీనాక్షి చౌదరితో పెళ్లి… ఆమె నిజంగానే ధనవంతురాలా లేక రాజుని బురిడీ కొట్టించిందా…? రాజు తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడు…? ఈ క్రమంలో వచ్చే పొలిటికల్ గమ్మత్తులేంటి…? అనేదే ఈ సినిమా….
సినిమా మొదలవ్వడమే ఒక విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో మొదలవుతుంది… మొదటి అరగంట చాలా రొటీన్‌గా, “ఇలాంటివి ఎన్నో చూశాం కదా” అనే ఫీలింగ్ కలిగిస్తుంది… కానీ ఎప్పుడైతే నవీన్ పోలిశెట్టి తనదైన శైలిలో ఎంట్రీ ఇచ్చి వన్-మ్యాన్ షో మొదలుపెడతాడో, అప్పుడు సినిమా కాస్త ఊపందుకుంటుంది… నవీన్ మార్క్ కామెడీ టైమింగ్, ఆ పంచ్‌లు ఇంటర్వెల్ వరకు ప్రేక్షకులను బాగానే నవ్విస్తాయి…
అయితే, సెకండ్ హాఫ్ మొత్తం ఒక ఎలక్షన్ చుట్టూ, సోషల్ మీడియా రీల్స్ చుట్టూ తిరుగుతుంది… ఇక్కడే అసలు సమస్య మొదలైంది… కామెడీ మీద పెట్టిన శ్రద్ధ కథ మీద పెట్టలేదనిపిస్తుంది… కొన్ని సీన్లు బాగా నవ్వించినా, చాలా వరకు “ఓవర్” అనిపిస్తాయి… క్లైమాక్స్‌లో ఎమోషన్ పండించడానికి ట్రై చేశారు కానీ, అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోవడంతో అది అంతగా కనెక్ట్ అవ్వదు….
నవీన్ పోలిశెట్టి ఈ సినిమాకు ప్రధాన బలం, తనే ఒకింత బలహీనత కూడా… తన కామెడీ టైమింగ్‌తో సినిమాను భుజాల మీద మోశాడు… అయితే, నవీన్ లాంటి టాలెంటెడ్ నటుడు ఇలాంటి రొటీన్ స్క్రిప్ట్స్ కాకుండా కొంచెం గట్టి కథలు ఎంచుకుంటే బాగుంటుంది… తను మినిమం గ్యారంటీ చిన్న హీరో…
మీనాక్షి చౌదరి కేవలం గ్లామర్ కోసమే అన్నట్టు ఉంది ఆమె పాత్ర… పెర్ఫార్మెన్స్‌కు పెద్దగా స్కోప్ లేదు… అందంగా కనిపించింది… రావు రమేష్ ఎప్పటిలాగే తన పాత్రకు న్యాయం చేశాడు కానీ, ఆయన స్థాయికి తగ్గ సీన్లు లేవు… మిగిలిన నటీనటులు అలా వచ్చి ఇలా వెళ్తుంటారు…
మిక్కీ జే మేయర్ సంగీతంలో ‘భీమవరం బుల్మా’ సాంగ్ మాస్ ప్రేక్షకులను ఊపేస్తుంది… బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సోసోగా ఉంది… యువరాజ్ సినిమాటోగ్రఫీ ఓకే…
ముచ్చటగా ఒక్క మాటలో... పండుగ పూట లాజిక్కులు వెతకకుండా, కథతో పనిలేకుండా కేవలం నవీన్ పోలిశెట్టి చేసే అల్లరి చూసి నవ్వుకోవాలనుకుంటే 'అనగనగా ఒక రాజు' ని ఒకసారి చూడొచ్చు... కాకపోతే నవీన్ పోలిశెట్టి అనగానే అన్నీ 'జాతి రత్నాలు' రేంజ్ సినిమా అని మాత్రం ఊహించొద్దు...
Share this Article