సాధారణంగా సినిమా ఇండస్ట్రీ అంటేనే ఓ అకశేరుక ప్రపంచం… అంటే వెన్నెముకల్లేని జీవజాతులు కొన్ని వంగుతూ, పాకుతూ నడుస్తుంటాయి… తప్పదు… వెన్నెముక ఉన్నట్టు గానీ, విద్యత్తు ఉన్నట్టు గానీ, జోకుడు జ్ఞానం తప్ప ఇంకేమైనా జ్ఞానమున్నట్టు గానీ పసిగడితే సినిమా పెద్దలు మెడలు విరిచేస్తారు… ఇక స్త్రీలయితే తాము రక్తమాంసాలున్న ప్రాణులమని కూడా మరిచిపోవాల్సిందే… ఈ స్థితికి అలవాటుపడ్డవాడే ఉంటాడు… ఏళ్ల తరబడీ స్టార్ కమెడియన్గా వెలిగిన బ్రహ్మానందానికి ఈ విషయం తెలుసు… తను స్వతహాగా కాస్త మెరిట్, ఆలోచించే జ్ఞానం ఉన్నవాడే… ఐనా సరే, దాన్ని ప్రదర్శించలేదు… వివాదాల తెర మీదకు ఎప్పుడూ రాడు… తనలోకం తనది… అలాంటిది ఓ ఆధ్యాత్మిక వివాదంలోకి తనంతటతానే తలదూర్చిన తీరు విస్మయాన్ని కలిగించింది… అసలు ఆ బురదే చికాకు పుట్టిస్తుంటే దాన్ని తన స్వభావానికి భిన్నంగా తనెందుకు పూసుకునే ప్రయత్నం చేశాడో అర్థం కాలేదు…
నిన్న ఏబీఎన్ చానెల్ ఆంజనేయుడి జన్మస్థలి వివాదం మీద ఓ డిబేట్ నడిపింది… ఏ వివాదమైనా సరే, వేలు పెట్టి, కాలు పెట్టి, మరింత కంపు చేసి, చలికాచుకోవడమే కదా చానెళ్ల పని… కర్నాటకలోని పంపానదీ తీరాల్లోని కిష్కింధలోనే ఆంజనేయుడు పుట్టాడని వాదిస్తాడు అక్కడి ట్రస్టు ప్రతినిధి గోవిందానంద… నిజానికి దేశంలోని కోట్ల మంది భక్తులు నమ్మేది ఆంజనేయుడు పుట్టింది ఇప్పటి కర్నాటకలోని హంపి ప్రాంతాల్లోనే అని విశ్వసిస్తారు… ఎక్కడైతేనేం..? ఆంజనేయుడి గుడి లేని ఊరేది..? కానీ టీటీడీ పండితులకు వేరే పనేమీ ఉండదు కదా… నో, నో, ఆంజనేయుడు పుట్టింది మా తిరుమల అంజనాద్రి గుట్ట మీద గుహల్లోనే… మేం చదివిన పురాణాలు అదే చెబుతున్నయ్ అని తేల్చేశారు… అనవసరమైన పనుల్ని చేపట్టడంలో టీటీడీ ఎప్పుడూ ముందు ఉంటుంది కదా… ఈవో కూడా సై అన్నాడు, ఓ కమిటీ వేయించి, మమ అనిపించేసి, అంజనాద్రిని ఆంజనేయుడి జన్మస్థలిగా డిక్లేర్ చేసేశారు… ఆనందయ్య మందు మీద ఆయుష్ రాములు కమిటీలాగా…
Ads
ఇదేమో కిష్కింధలోని ట్రస్టుకు చిర్రెక్కించింది… దాని ప్రతినిధి ఈ గోవిందానందకు మాట్లాడటం రాదు, చర్చకు రెడీ అన్నాడు… అసలే టీటీడీలో ఉన్నది ముదురు పండితులు కదా… సరే రావోయ్ అన్నారు, ఆ గోవిందుడికి అటూఇటూ వాచిపోయింది… తనకు సంస్కృతం సరిగ్గా రానప్పుడు, వాదించే తర్కజ్ఞానం లేనప్పుడు ఎవరినైనా వెంట తెచ్చుకోవాలి… ఆ సోయి లేదు పాపం… టీటీడీ కమిటీలో పెద్ద జియ్యర్ ఉన్నడా..? చిన్న జియ్యర్ ఉన్నడా..? శృంగేరీ పీఠ ప్రతినిధి ఉన్నాడా..? అని ఏమేమో అడిగాడు… పనిలోపనిగా స్వరూపానందనూ రచ్చలోకి లాగే ప్రయత్నం చేశాడు… అసలు ఆంజనేయుడి జన్మస్థలి వివాదమే ఇప్పుడు అనవసరం… ఎక్కడ పుడితేనేం..? కిష్కింధ మనది కాదా..? తిరుమల గుట్టల్లోనే పుట్టాడనే నిర్ధారణ అవసరమా ఇప్పుడు..? ఈ అనవసర వివాదాన్ని నెత్తిన పెట్టుకోవడమే కాదు, అర్జెంటుగా జపాలి గుడిలో ప్రత్యేక ఉత్సవాలూ ప్రారంభించారు… దాన్నలా వదిలేస్తే…
అసలు ఆ టీటీడీ పండితులు, గోవిందానంద చర్చే ఓ పెద్ద కంపు… వాక్ పంకిలం… ఆయన్ని పట్టించుకోం అంటాడు ఈవో… నిన్నూ పట్టించుకోను అంటాడు ఈయన… ఏబీఎన్ చర్చలోకి జొరబడిన బ్రహ్మానందం… ‘‘అవతార పురుషులకు జన్మదినాలు ఉండవ్, జన్మస్థలాలు ఉండవ్… ఎందుకొచ్చిన వివాదం ఇప్పుడు..? అసలు ఆంజనేయుడు పుట్టడం ఏమిటి..? ఆయన రాముడి రూపం… రాముడి నీడ… భారత దేశాన్ని చీల్చుకుని పుట్టాడు… ఇలాంటివి చేసుకుంటూ పోతే… కొంతకాలం తరవాత వేమన ఏ కులం అనే మీమాంస కూడా వస్తుందనడంలో సందేహం లేదు….’’ అని ఏదేదో చెబుతూ పోయాడు… హేమిఠో… ఈ వివాదం దిక్కుమాలినదీ అనడం వరకూ బ్రహ్మానందం కరెక్టే… కానీ దేశాన్నీ చీల్చుకుని పుట్టడం ఏమిటో..? తను రాముడి రూపం అనడం ఏమిటో… ఈ గోవిందానందుడి రూపంలాగే అనిపించింది కాసేపు బ్రహ్మానందం వాదన, ఆవేదన వింటుంటే..! ఇంతకీ ఈ పండిత చర్చలోకి, అసలు ఏ సంబంధమూ లేని ఈ సెలబ్రిటీ ఎలా దూరాడు..? ఏబీఎన్ తననెందుకు దూర్చింది..?!
Share this Article