.
ఒక మనిషికి ఎంత పేరుప్రఖ్యాతులు ఉన్నా, ఎంత హోదా ఉన్నా… “నేనెక్కడి నుంచి వచ్చాను? నా కన్నతల్లి ఎవరు?” అనే ఎప్పుడూ ఓ ప్రశ్న వేధిస్తే… ఆ వేదనను మరేదీ భర్తీ చేయలేదు… ఓ హ్యూమన్ ఇంట్రస్టింగ్ వార్త చదువుదాం… (టైమ్స్‌లో కనిపించింది)…
నాగ్‌పూర్ ‘కర్ణుడు’… కన్నతల్లి కోసం ఒక మేయర్ ఆరాటం! ఈ కథలో కథానాయకుడి పేరు ఫల్గుణ్ బిన్నెన్‌డైక్ (Falgun Binnendijk)... అవును, ఫల్గుణ్ ఇండియన్ పేరే… అదే అసలు కథ… ఆయన నెదర్లాండ్స్‌లోని హీమ్‌స్టెడ్ (Heemstede) నగరానికి మేయర్ ఇప్పుడు…
Ads
పేరు వెనుక కథ…: 1985 ఫిబ్రవరిలో నాగ్‌పూర్‌లోని ‘మాతృ సేవా సంఘ్’ ఆశ్రమంలో ఈయన్ని ఎవరో వదిలి వెళ్లారు… 3 రోజుల పసికందుగా… (అంటే ఎవరో ఓ తల్లికి అవాంఛిత సంతానం)… అప్పుడు అక్కడ ఉన్న ఒక నర్సు, ఆయన జన్మించిన హిందూ నెలను బట్టి (ఫిబ్రవరి/ఫాల్గుణ మాసం) ఆయనకు ‘ఫల్గుణ్’ అని పేరు పెట్టింది… ఆ తర్వాత ఒక డచ్ దంపతులు దత్తత తీసుకోవడంతో ఆ పిల్లాడు నెదర్లాండ్స్ వెళ్ళిపోయాడు…
మహాభారతంలో కుంతీ దేవి తన బిడ్డను (కర్ణుడిని) పుట్టిన వెంటనే వదిలివేయాల్సి వస్తుంది… కర్ణుడు పెరిగి పెద్దవాడై, వీరుడిగా ఎదిగినా తన తల్లి ఎవరనే అన్వేషణ, ఆ వేదన ఆయనను వదలవు… తల్లి ఎవరో తెలిసినా ఆమెను అవమానించలేదు సరికదా, తన తరువాత పుట్టిన కొడుకుల కోసమే తన వద్దకు వచ్చి నిజం చెప్పినా సరే, ఆమెను క్షమించి, ఆమె కోరిక ప్రకారం పాండవులను చంపబోనని హామీ ఇస్తాడు, ఒక్క పాండవ మధ్యముడు ఫల్గుణుడిని తప్ప…
ఈ ఫల్గుణ్ తన పరిస్థితిని సరిగ్గా అలాగే భావిస్తున్నాడు… (తన పేరు ఫల్గుణుడు, తన బాధ కర్ణుడిది)… “నన్ను వదిలేసినందుకు నా తల్లిపై నాకు ఎలాంటి కోపం లేదు… కుంతీ దేవికి ఉన్నట్టే ఆమెకు కూడా ఏదో ఒక బలమైన కారణం, సామాజిక ఇబ్బంది ఉండి ఉండవచ్చు…” అని ఆయన అంటున్నాడు… “ప్రతి కర్ణుడికి తన తల్లిని కుంతిని కలిసే హక్కు ఉంది” అనేది ఆయన నినాదం… అంటే, ఒక బిడ్డకు తన మూలాలను తెలుసుకునే కనీస బాధ్యత, హక్కు ఉంటుందని ఆయన నమ్ముతున్నాడు…
ప్రస్తుత పరిస్థితి…: ఫల్గుణ్ ఇప్పటికే మూడుసార్లు నాగ్‌పూర్ వచ్చాడు… తనను ఆనాడు ఎత్తుకున్న నర్సును కూడా కలుసుకున్నాడు… తన తల్లి గురించి కొన్ని వివరాలు (ఆమె పేరు, ఆమెకు అప్పుడు పెళ్లి కాలేదన్న విషయం) సేకరించగలిగాడు…
కేవలం ఆమెను ఒక్కసారి కలిసి “అమ్మా, నేను బాగున్నాను… నువ్వు నన్ను వదిలేసినందుకు బాధపడకు, నేను చాలా గౌరవప్రదమైన జీవితాన్ని గడుపుతున్నాను…” అని చెప్పడమే ఆయన ఆరాటం… తన కూతురికి కూడా ఆయన భారతీయ తల్లి పేరునే పెట్టుకోవడం ఆయనకు తన మూలాల పట్ల ఉన్న ప్రేమను తెలియజేస్తుంది…
తన తల్లిని కలిస్తే ఆమెకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, రహస్యంగానైనా కలుస్తానని హామీ ఇస్తున్నాడు… ఓ బలమైన కాంక్ష తన నెత్తుటి మూలాల కోసం… ఓ బలమైన అన్వేషణ ‘అమ్మా’ అని పిలవాలని..!!
నిజంగా ఇది గుండెల్ని పిండేసే కథ... ఒక నగరానికి మేయర్ అయినా, ఆ 'అమ్మ' పిలుపు కోసం ఆయన పడుతున్న తపన ఎందరినో కదిలిస్తోంది... ఈ కర్ణుడికి ఆ కుంతి కనిపించాలనే ఆశిద్దాం..!! (రాక్షసుడు అనే చిరంజీవి సినిమాలో కథానాయకుడి బాధ కూడా ఇదే... గుర్తొచ్చింది)...
Share this Article