.
(ఎ.సాయిశేఖర్) …… నిజం చెప్పాలంటే, హఠాత్తుగా ఆకాశం కుప్పకూలినట్టు అనిపించింది… లోకమంతా ఓ విషాదం అలుముకుంది…
అప్పుడు హైదరాబాద్ ఇప్పుడున్నంత వేడిగా ఉండేది కాదు, చాలా చల్లగా… ఇంకా చెప్పాలంటే వణికించే చలిగా ఉండేది… అది 1996, జనవరి 18వ తేదీ… చలి పెడుతున్న ఆ శీతాకాలం ఉదయం సుమారు 5.50 గంటల సమయంలో మా అమ్మ నా బెడ్‌రూమ్ తలుపు తట్టింది…
Ads
నేను వెంటనే తలుపు తీశాను… నటరాజ్ వచ్చాడు అని చెప్పింది… (డెక్కన్ క్రానికల్‌లో రెసిడెంట్ ఎడిటర్)… నేను డ్రాయింగ్ రూమ్‌లోకి వెళ్లేసరికి ఆయన కాఫీ తాగుతున్నారు… నన్ను చూడగానే వెంటనే తయారవ్వమనీ, బయల్దేరాలనీ చెప్పారు నన్ను చూస్తూ… త్వరగా ఆఫీసుకు వెళ్లాలి పద అన్నారు…
కారణం అడిగితే, చెప్పడానికి ఆయన సిద్ధంగా లేరు… ఏదో చాలా పెద్ద అనర్థం జరిగిందని నాకు అనుమానం కలిగింది… సరిగ్గా అదే సమయంలో, అప్పుడప్పుడే కొత్తగా ఇన్స్టాల్ చేసుకున్న నా ల్యాండ్‌లైన్ ఫోన్ కూడా పనిచేయడం మానేసింది… (ఆ ఫోన్ లోనే ఒకసారి ఎన్టీఆర్ నాకు కాల్ చేశారు, ఆ ఆసక్తికరమైన జ్ఞాపకాన్ని మరోసారి రాస్తాను…).
నేను వెంటనే రెడీ అయిపోయాను… అప్పుడు చెప్పారు నాకు… ఎన్.టి. రామారావు గారు ఇక లేరు అనే వార్తను…!! కాసేపు నాకేమీ అర్థం కాలేదు… ఆ మాట వినగానే నాలోని శక్తి అంతా ఎవరో పిండేసినట్లయింది, మనసు మొద్దుబారిపోయింది… నిజంగానే నేను తల్లడిల్లిపోయాను… ఎందుకంటే, ఆ మహానుభావుడిని నేను కలిసి అప్పటికి కేవలం కొన్ని గంటలే అయింది…
ఆ ముందు రోజు సాయంత్రం ఎన్టీఆర్ గారు కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చారు… ఆ ఇంటర్వ్యూలు చేసిన కొంతమంది జర్నలిస్టులు నాకు గుర్తున్నారు… ‘ది వీక్’ నుంచి లలిత అయ్యర్, ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ నుంచి పుష్ప అయ్యంగార్ ఆయన చివరి ఇంటర్వ్యూలు చేశారు… రమేష్ కందుల, నేను అప్పుడు డెక్కన్ క్రానికల్‌లో పొలిటికల్ బీట్ కవర్ చేసేవాళ్లం…
లండన్ నుండి వచ్చిన రాయిటర్స్ (Reuters) బ్యూరో చీఫ్‌తో కలిసి రమేష్, ఎన్టీఆర్ ఇంటర్వ్యూ కోసం వచ్చారు… ఇద్దరు సీనియర్ మహిళా జర్నలిస్టులు వెళ్ళిపోయాక, రాయిటర్స్ ఇంటర్వ్యూ మొదలయ్యే ముందే నేను ఆ లెజెండరీ లీడర్‌తో నా సంభాషణను— (అది ఇంటర్వ్యూ కాదు)—ముగించాను…
అప్పటికే కొంతమంది ప్రజలు, సీనియర్ పార్టీ నాయకులు లోపలికి వచ్చారు… ఎన్టీఆర్‌కు ఏదో కోర్టు తీర్పు గురించి సమాచారం ఇచ్చారు (దాని తీవ్రత ఏమిటో ఆ తర్వాత అందరికీ తెలిసింది)… ఆ వార్త విన్నాక ఆ పెద్దాయన ఒక్కసారిగా కలత చెందారు…
ఆ తర్వాత మేము బయటకు వస్తుండగా, దేవినేని నెహ్రూ గారు చేపల పులుసు తీసుకుని అక్కడికి వచ్చారు… నాకు ‘హలో’ చెప్పి ఆయన లోపలికి వెళ్లారు… అదంతా చకచకా గుర్తొచ్చింది మనసంతా చేదుగా అయిపోయింది…

ఉదయం 6.30 గంటలకల్లా నేను నటరాజ్‌తో కలిసి ఆఫీసులో ఉన్నాను… ఎన్టీఆర్ మరణవార్తను ప్రపంచానికి తెలియజేస్తూ మొదటి వాక్యాన్ని నేనే టైప్ చేయాల్సి వచ్చింది… టైపింగ్ మొదలుపెట్టగానే, నేను ఒక్కసారిగా పెద్దగా ఏడ్చేశాను… అప్పుడు బ్యూరోలో ఉన్న కొద్దిమంది జర్నలిస్టులు మూగ సాక్షులుగా నిలబడిపోయారు…
కొందరు నన్ను ఓదార్చడానికి ప్రయత్నిస్తుండగా, మా ఎడిటర్ పి.ఎన్.వి. నాయర్ గారు వచ్చి నాకు ధైర్యం చెప్పారు…: “సాయి, మనం జర్నలిస్టులం… భావోద్వేగాలకు లోనుకాకూడదు… నీ బాధ నాకు అర్థమవుతోంది… కానీ, తమాయించుకుని నీ పని పూర్తి చేయి… మనం వీలైనంత త్వరగా నాలుగు పేజీల స్పెషల్ సప్లిమెంట్‌ను తీసుకురావాలి….”
ఈలోగా సి.ఆర్. గౌరీ శంకర్ ఆఫీసుకు చేరుకున్నారు, తరువాత అక్కడి నుండి ఘటనా స్థలానికి పరుగులు తీశారు….. మా సీనియర్ సహోద్యోగి, సీనియర్ ఎడిటర్ ఎం.పి. రవీంద్రనాథ్ గారు కూడా అక్కడికి వెళ్లారు… రవీందర్ సార్ ఎన్టీఆర్ నివాసంలో ఉన్న ఫోన్‌ను ఎలాగోలా యాక్సెస్ చేసి, నాకు ఫోన్ చేసి ‘గ్రౌండ్ జీరో’ నుండి ఇన్‌పుట్స్ ఇస్తూనే ఉన్నారు…
నేను స్టోరీ టైప్ చేయడం మొదలుపెట్టాను… అదే సమయంలో నా బ్యూరో చీఫ్, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న శ్రీ సయ్యద్ అమీన్ జాఫ్రీ గారికి కాల్ చేశాను… అప్పట్లో మాకు ఆయనే గూగుల్ సెర్చ్ ఇంజన్… ఎందుకంటే అప్పుడు భారతీయ వార్తాపత్రికలకు ఇంటర్నెట్ కనెక్షన్ లేదు, అసలు గూగుల్ అనేదే లేదు… ఆయన వెంటనే ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్ ప్రొఫైల్ బుక్ నుండి ఎన్టీఆర్ 8 పేజీల ప్రొఫైల్‌ను తీసి ఆఫీసుకు ఫ్యాక్స్ చేశారు…
కంపోజిటర్లు దాన్ని టైప్ చేశారు, మా లైబ్రరీ నుండి కొన్ని ఫోటోలు తీసుకున్నాము… నటరాజ్ , కాశీ బి.హెచ్. అతి తక్కువ సమయంలో వేగంగా పేజీలు పూర్తి చేశారు… ఉదయం 7.15 గంటలకే మా స్పెషల్ ఎడిషన్ బయటకు వచ్చింది…
(ntr మరణించిన తెల్లవారి డెక్కన్ క్రానికల్ ఎడిషన్ ఇది)
ఆ రోజే వీధుల్లోకి వచ్చిన మొదటి స్పెషల్ ఎడిషన్ మాదేనని, అది హాట్ కేకుల్లా అమ్ముడైందని నేను గర్వంగా చెప్పుకోగలను…
ఆ తర్వాతే నేను బంజారాహిల్స్ రోడ్ నంబర్ 13 లోని ఎన్టీఆర్ నివాసానికి వెళ్లాను… అక్కడ ఉన్న జనం, వాహనాల రద్దీ మధ్య లోపలికి వెళ్లడం దాదాపు అసాధ్యం… అప్పటి హైదరాబాద్ రేంజ్ డీఐజీ, మాజీ డీజీపీ జె.వి. రాముడు గారు స్వయంగా తన సిబ్బందితో కలిసి జనాన్ని నెట్టుకుంటూ దారి క్లియర్ చేయడం నేను చూశాను… వీఐపీలు రావడం మొదలైంది… ఎట్టకేలకు నేను ఎన్టీఆర్ ఇంటి లోపలికి వెళ్లాను… ఆ ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఇరువైపులా రెండు పాలరాతి సింహాల విగ్రహాలు ఉండేవి… కానీ, ఆ అసలైన సింహం అక్కడ నిర్జీవంగా పడుకుని ఉంది…
అక్కడంతా ఒక విధమైన నిశ్శబ్దం ఆవరించి ఉంది… లక్ష్మీపార్వతి గారు తట్టుకోలేక రోదిస్తున్నారు… ఎన్టీఆర్ పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు వచ్చారు… ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు… డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు, ఇతర ప్రముఖులందరూ చేరుకున్నారు… మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి పి. ఉపేంద్ర, ఎంపీ రేణుకా చౌదరి, మరో దిగ్గజ నటుడు అక్కినేని నాగేశ్వరరావు… ఇలా హైదరాబాద్‌లోని ప్రముఖులందరూ అక్కడ ఉన్నారు…
మృతదేహాన్ని లాల్ బహదూర్ స్టేడియానికి తరలించాలని నిర్ణయించే వరకు నేను అక్కడే ఉండి, ఆ తర్వాత ఆఫీసుకు తిరిగి వచ్చాను… ఆయన ఇంటి వెనుక ఉన్న బస్తీలో నివసించే ప్రజలకే అక్కడ ఏదో జరిగిందని మొదట అనుమానం వచ్చింది… అక్కడున్న కొందరు ఏడుస్తూ నాతో ఒక మాట చెప్పారు—
ప్రతిరోజూ ఉదయం 4 గంటలకు ఎన్టీఆర్ నివాసం నుండి స్పీకర్లలో భగవద్గీత వినిపించేదని, కానీ ఆ రోజు ఆ సమయానికి అది వినిపించలేదని చెప్పారు… గంటసేపు వేచి చూసి, అసలేమైందో చూడటానికి వారు వెళ్లారట… ఏడుస్తున్న ఒక వృద్ధుడు అన్న మాట…: “ఆ దేవుడు మమ్మల్ని దిక్కులేని వారిని చేసి వెళ్లిపోయాడు…” అది నిజంగా గుండెను పిండేసే మాట….
మళ్లీ ఆఫీసులో మెయిన్ స్టోరీ రాశాను, చాలా మంది సహోద్యోగులు ఇన్‌పుట్స్ ఇచ్చారు… జాఫ్రీ సాబ్ అప్పటికే ఆఫీసుకు వచ్చారు… మేము ఉదయం 11 గంటలకు రెండో స్పెషల్ ఎడిషన్ తెచ్చాము… సాయంత్రం 5 గంటలకు తాజా అప్‌డేట్స్, ఫోటోలతో మూడవ ఎడిషన్‌ను కూడా ముద్రించాము… బహుశా ఎన్టీఆర్ మరణవార్తతో ఆ రోజు ఇన్ని ఎడిషన్లు తెచ్చిన ఏకైక పత్రిక డెక్కన్ క్రానికల్ మాత్రమే…
అప్పటికి ఇంకా లాంచ్ కూడా కాని ‘వార్త’ పత్రిక, మధ్యాహ్నం వేళలో కలర్‌ఫుల్ స్పెషల్ సప్లిమెంట్‌ను తెచ్చింది… ఈనాడు ఒక సప్లిమెంట్‌ను ప్రచురించింది…
(మరుసటిరోజు ఈనాడు పత్రిక)
ఇక ఆ తర్వాత అంతా చరిత్రే… ఆ మహానుభావుడు కాలగర్భంలో కలిసిపోయారు… మరుసటి రోజు, అప్పటి ప్రధానమంత్రి పి.వి. నరసింహారావు, సీనియర్ నాయకులు ఎల్.కె. అద్వానీ, డాక్టర్ మర్రి చెన్నారెడ్డి వంటి జాతీయ నాయకులు, అశేష జనవాహిని మధ్య… ఒక రాజుకు దక్కాల్సిన వీడ్కోలుతో ఆయన అంతిమ సంస్కారాలు జరిగాయి…
Share this Article