.
Subramanyam Dogiparthi …… ఒక్కోసారి మెయిన్ ప్లాట్ పక్కకు జరిగి సబ్ ప్లాట్ ప్రాముఖ్యత సంతరించుకుంటూ ఉంటుంది . 1989 మే నెలలో వచ్చిన ఈ సాహసమే నా ఊపిరి సినిమాలో ఇదే జరిగింది . సినిమాకు మెయిన్ ప్లాట్ చాలా సినిమాల్లో లాగా దుష్టశిక్షణ , దేశ రక్షణ . దేశంలో కొందరు విద్రోహులు దేశ రక్షణకు సంబంధించిన రహస్య పత్రాలను విదేశీ ద్రోహులకు అమ్మటం .
ఈ కార్యక్రమంలో స్వదేశీ ద్రోహి రంగనాధ్ . గతంలో రక్షణ శాఖలో పనిచేయటం వలన దేశ రక్షణ రహస్యాలు సంపాదించటం సులభం కావటం వలన ఇతన్ని ఎంగేజ్ చేసుకుంటారు . ఇతన్ని ఎంగేజ్ చేసిన శక్తులు చాలా సినిమాల్లోలాగే రాజకీయులు . ఇక్కడే సబ్ ప్లాటుని కలిపాడు కృష్ణ . ఈ దుండగులలో ఒకరు హోం మినిస్టర్ . పేరు శంభు ప్రసాద్ . మరొకరు MLA పరాత్పరరావు .
Ads
విదేశీ ద్రోహులలో ఒకరు బాబ్ క్రిస్టో . ఇంకొకరు రాధా రవి . తమిళ నటుడు యం ఆర్ రాధా కొడుకు , రాధికకు సవతి సోదరుడు . స్వదేశీ ద్రోహులకు కొమ్ము కాసి అమ్ముడుపోయిన పోలీస్ సబ్ ఇనస్పెక్టర్ ప్రదీప్ శక్తి . స్వదేశీ ముఠాకు నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి . వీరందరూ కాకుండా ఇంకో MLA కూడా ఉంటాడు . అతని పేరు మోహనరావు .
- ముఖ్యమంత్రి పేరు కోదండరామయ్య . హోం మంత్రి పేరు శంభు ప్రసాద్ . హత్య కావించబడే MLA పేరు మోహనరావు . అతని భార్య పేరు అరుణ కుమారి . ముఖ్యమంత్రి టోటల్ గా యన్టీఆర్ని పోలి ఉంటాడు . కాబట్టి ఈ పేర్లన్నీ అప్పట్లో ఉన్న ఏయే పేర్లను గుర్తుకు తెస్తాయో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు . కాబట్టే రభస అయింది .
అసలీ సినిమా పేరు చెప్పగానే ఆ తరం వారికి పూర్తిగా స్టోరీ అర్థం అయిపోయి ఉంటుంది . కృష్ణ 200 వ సినిమా అయిన ఈనాడు ఆనాటి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక భావజాలంతో ఉండి యన్టీఆర్ తెదేపాకు బలం చేకూర్చింది . ఆయన గెలుపుకు కాస్తో కూస్తో దోహదపడిందని అప్పట్లో భావించేవారు .
తర్వాత తర్వాత వీరిద్దరి మధ్య అభిప్రాయ బేధాలు , పంతాలు పట్టింపులు వగైరాలు చోటు చేసుకోవటంతో కృష్ణను రాజీవ్ గాంధీకి దగ్గరకు చేర్చటం జరిగింది . ఆ టైంలో వచ్చిన సినిమా ఈ సాహసమే ఊపిరి .
కావలసినంత రాజకీయ రభస నడిచింది .
ఈ సినిమా 1989 మే నెలలో వచ్చింది . వంగవీటి మోహన రంగా 1988 డిసెంబర్ నెలాఖరులో హత్య చేయబడ్డారు . చుక్కలన్నీ కలపబడ్డాయి . Connecting the dots అంటాం కదా ! ఇవన్నీ చోటుచేసుకున్నాయి . Thank God . అప్పట్లో ఫేస్ బుక్ , వాట్సప్పులు లేవు . అయినా పుంఖానుపుంఖాలుగా పత్రికలు , సినిమా మేగజైన్లు వీరిద్దరి మధ్య చోటుచేసుకున్న వైరాన్ని బాగానే వైరల్ చేసాయి .
ఇంక సినిమా మెయిన్ ప్లాటుకు వస్తే కృష్ణ పేరు ఈ సినిమాలో కూడా ప్రతాపే రాజకీయ చదరంగం సినిమాలో లాగా . ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ కొరకు కేంద్రం ప్రత్యేకంగా ఓ పోలీసు అధికారి కృష్ణను పంపుతుంది . ఈయన భార్య విజయనిర్మల ఓ ప్రభుత్వ డాక్టర్ .
ఆ నగరంలో పేదప్రజల రక్షకుడు నరేష్ . అతన్ని DIG గారి పుత్రిక వాణీ విశ్వనాధ్ ప్రేమించి రౌడీ నుండి పోలీస్ సబ్ ఇనస్పెక్టర్ అయ్యేలా మోటివేట్ చేస్తుంది . దేశద్రోహులందరూ కలిసి కృష్ణ కూతురిని చంపుతారు .
క్లైమాక్సులో కృష్ణ అల్లూరి సీతారామరాజు డైలాగులను చెప్పి అందరినీ విదేశీ ద్రోహులను లేపేస్తాడు . స్వదేశీ ద్రోహులకు కోర్టులో శిక్షలను వేయిస్తాడు . నరేష్ , వాణీ విశ్వనాధ్ జంటవుతారు . సినిమా అయిపోతుంది .
శ్రీ విజయకృష్ణ మూవీస్ బేనర్లో వచ్చిన ఈ సినిమాకు అధికారికంగా రచయిత పి చంద్రశేఖర రెడ్డి . డైలాగులను అధికారికంగా , వాస్తవంగా కూడా వ్రాసింది వాళ్ళ ఆస్థాన రచయిత త్రిపురనేని మహారధి . ఆయన కోవలోనే కృష్ణకు ఎలా ఉండాలో అలాగే ఉంటాయి . దర్శకురాలు విజయనిర్మల .
సాధారణంగా కృష్ణ సినిమాలలో తారాగణం మస్తుగా ఉంటుంది . ఇందులో రమణమూర్తి , రంగనాధ్ , పండరీబాయి , ప్రదీప్ శక్తి , బాబ్ క్రిష్టో , గుమ్మడి , సూర్యకాంతం , నరేష్ , వాణీ విశ్వనాధ్ , కోట శ్రీనివాసరావు , రాజేష్ , విజయచందర్ , త్యాగరాజు , గిరిబాబు , శ్రీలక్ష్మి , మాడా , రాజ్యలక్ష్మి , సత్యప్రియ , రజిత తదితరులు నటించారు .
విద్యాసాగర్ సంగీత దర్శకత్వంలో పాటలు బాగానే ఉంటాయి . వినువీధిలో ధృవతారలా అనే బర్త్ డే పాట కృష్ణ ఫేమిలీ మీద ఉంటుంది . కృష్ణ రౌద్రంతో పాడే పాట హృదయానికి దహన జ్వాల ఆయన మోడల్లోనే ఉంటుంది . మారువేషంలో కూడా ఓ డాన్స్ పాట ఉంది . కన్ను గీటుతుంది వయ్యారం అనే పాట .
నరేష్ , వాణీ విశ్వనాధుల మీద ఓ మూడంటే మూడు డ్యూయెట్లు ఉన్నాయి . వీర శివుడు , పిట్ట ముద్దు పెట్టనా , కవ్వించే జీవితం అంటూ సాగుతాయి . వేటూరి వారు వ్రాయగా సుశీలమ్మ , రాజ్ సీతారాం , మనో , చిత్ర వాటిని పాడారు .
సినిమా యూట్యూబులో ఉంది . కృష్ణ అభిమానులు చూసి ఉండకపోతే తప్పక చూడవచ్చు . It’s not totally a political satire movie . It’s an action oriented , patriotic , feel good movie. నేను పరిచయం చేస్తున్న 1226 వ సినిమా
#తెలుగు_సినిమాల_సింహావలోకనం #సినిమా_స్కూల్ #సినిమా_కబుర్లు
Share this Article