.
Subramanyam Dogiparthi ….. ఈ సాక్షి బాపు , కృష్ణ , విజయనిర్మల సాక్షి కాదు . ఈ సాక్షి 1989 డిసెంబర్లో వచ్చిన సస్పెన్స్ , క్రైం , థ్రిల్లర్ … షీరో జయసుధ . చూసి ఉండకపోతే తప్పక చూడండి . చూడతగ్గ సినిమాయే . కాకపోతే యూట్యూబులో వీడియో క్వాలిటీ కాస్త బాగాలేదు . అయినా చూడొచ్చు .
కధాంశం ఏంటంటే…. ఓ సర్కిల్ ఇనస్పెక్టర్ ఓ లాకప్ హత్య చేస్తాడు . అది లాకప్ హత్యే అని తన లాయర్ భార్య రుజువు చేయటంలో ఫెయిల్ అవుతుంది . కేసు సిబిఐకి వెళుతుంది . అప్పుడు సిబిఐ ఆఫీసర్లు ఇప్పటిలాంటోళ్ళు కాదు కదా !
Ads
విచారణ చేస్తున్న సిబిఐ DSP అలెగ్జాండర్ అది లాకప్ హత్యే అని , విధి నిర్వహణ పేరుతో నేరాన్ని ఒప్పించేందుకు చేసిన ప్రయత్నంలో సర్కిల్ ఇనస్పెక్టర్ రఘువరనే చావుకు కారణమని రిపోర్ట్ తయారు చేస్తాడు . ఆ రిపోర్ట్ మార్చమని రఘువరన్ కాళ్ళావేళ్ళా పడినా ఆ సిబిఐ ఆఫీసర్ అంగీకరించడు .
వేరే కేసులో లాకప్పులో ఉన్న ఇద్దరు గూండాలను బయటకు విడుదల చేసి ఆ సిబిఐ DSP ని చంపిస్తాడు . అయితే ఆ హత్యను స్వప్న (నటి పేరు లిజీ . మళయాళ నటి ) అనే అమ్మాయి చూస్తుంది . ఆ అమ్మాయిని రఘువరనే చంపేస్తాడు .

ఆరోజు ఆ అమ్మాయి పుట్టినరోజు కూడా కావటంతో ఆ అమ్మాయి ప్రేమికుడు రాజేంద్రప్రసాద్ , అతని స్నేహితుడు చంద్రమోహన్ ఆ అమ్మాయి ఫ్లాటుకు వచ్చి హత్య కేసులో అరెస్టు చేయబడుతారు . వాళ్ళు అమాయకులని నమ్మిన జయసుధ బెయిల్ ఇప్పించి, కేసును పరిశోధించి మాజీ భర్త అయిన రఘువరన్ని చట్టం ముందు దోషిగా నిలబెడుతుంది .
చాలా బిర్రయిన స్క్రీన్ ప్లే , దర్శకత్వాన్ని అందించారు పి యన్ రామచంద్రరావు . సినిమా సాదాసీదాగా మొదలవుతుంది . సినిమా పిచ్చోళ్ళయిన రాజేంద్రప్రసాద్ , చంద్రమోహన్ సినిమా కష్టాలు పడుతుంటారు . లాయర్ జయసుధ వాళ్ళిద్దరి చేత We help అనే self-employment start-up ని ప్రారంభింప చేస్తుంది . శ్రేయోభిలాషిగా ఉంటుంది .
ఇలాంటి పాత్రలను జయసుధ , రఘువరన్ వెడమ చేత్తో చేసేస్తారు . ఇద్దరిలో జయసుధ బ్రహ్మాండంగా చేసింది . రాజేంద్రప్రసాద్ , చంద్రమోహన్లకు కూడా ఇలాంటి పాత్రలు కొట్టిన పిండేగా . బాగా చేసారు .
ఫైర్ బ్రాండ్ కాలేజి అమ్మాయిగా , రాజేంద్రప్రసాద్ ప్రేమికురాలిగా మళయాళ నటి లిజీ చాలా బాగా నటించింది . ఇతర పాత్రల్లో నిర్మలమ్మ , బట్టల సత్యం , గిరిబాబు తదితరులు నటించారు . ఏమో అనే ఊతపదంతో గిరిబాబు కామెడీ స్పేసుని ఫిల్ చేయటానికి ప్రయత్నించాడు .
రాజ్- కోటి సంగీత దర్శకత్వంలో మూడు పాటలూ శ్రావ్యంగా ఉంటాయి . ఝమ్మని మనసిమ్మని అనే రొమాంటిక్ డ్యూయెట్ రాజేంద్రప్రసాద్ , లిజీ మీద బాగుంటుంది . Enjoyable . ఏక్షన్లో యన్టీఆర్ స్టెప్పుల్లో ఏయన్నార్ అంటూ సాగే పిక్నిక్ పాట చిత్రీకరణ కూడా బాగుంటుంది . విజయ్ , వై టి నాయుడు నిర్మాతలు .
Undoubtedly a watchable suspense , crime , thriller. నేను పరిచయం చేస్తున్న 1227 వ సినిమా
#తెలుగు_సినిమాల_సింహావలోకనం #సినిమా_కబుర్లు #సినిమా_స్కూల్
- ( ఇక్కడ లిజీ (Lissy) గురించిన ముచ్చట ఏమిటంటే… కెరీర్ మంచి ఊపులో ఉండగానే… (ఏటా 10- 12 మూవీస్)… ఈ సినిమా తరువాత ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్‌ను పెళ్లి చేసుకుంది, లక్ష్మి అని పేరు మార్చుకుని, హిందూ మతంలోకి మారింది… సినిమాలు- నటన వదిలేసింది… కానీ 26 ఏళ్ల తరువాత విడాకులు తీసుకుంది… 2018లో చల్ మోహన రంగ అనే తెలుగు సినిమాలో నటించింది కూడా…)

- నెలకు కొంత డబ్బు మందుల కోసం ఇవ్వడం (మెయింటెనెన్స్) లేదని ఆమె తండ్రి కోర్టుకెక్కడం అప్పట్లో విశేషం…
- హలో, రణరంగం, చిత్రలహరి తదితర తెలుగు సినిమాల్లో నటించిన కళ్యాణి ప్రియదర్శన్ లిజీ కూతురు…

Share this Article