.
మన గుళ్లకు వెళ్లండి… ఏ గుడికి వెళ్లినా దేవాదాయ శాఖ తాలూకు దోపిడీ ఉంటుంది… ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు ఎట్సెట్రా… దర్శనం తరువాత కాసింత పులిహోర లేదా ఇతర ప్రసాదం చేతిలో పెడతారా అంటే అదీ ఉండదు, అవీ అమ్మకాలే…
కానీ కర్నాటక డిఫరెంట్… ఆధ్యాత్మికత, ఆహారం రెండింటినీ కలుపుతారు… గుడికి వచ్చినవాడు ఆకలితో తిరిగిపోకూడదు అనే భావన ప్రతి ఆధ్యాత్మిక సంస్థ పాటించబడుతుంది… ప్రతి గుడి, ప్రతి మఠం, ప్రతి ఆశ్రమం తన స్థాయిని బట్టి అన్న వితరణ చేస్తుంది తప్పనిసరిగా…
Ads
గానుగాపూర్ వెళ్లేవారికి తెలిసిందే… భక్తులు తాము తీసుకొచ్చిన స్వీట్లను లేదా ఇతర ఆహారాన్ని భక్తులకు పంచిపెడతారు… కర్నాటక స్పిరిట్యుయల్ కల్చర్ చాలా డిఫరెంట్… రెండు జాతరల గురించి చెప్పుకుంటే దాని విశిష్టత అర్థమవుతుంది…
మేడారం, గిరిజన కుంభమేళా… ఇప్పుడంటే దర్శనం ప్రధానం… కానీ మేడారం రియల్ పిక్చర్ గతంలో ఏమిటంటే… పిల్లాపాపాలతో ఎడ్ల బళ్లను కట్టుకుని వచ్చేవాళ్లు… జాతర పరిసరాల్లోనే విడిది… బండే టెంటు… మేకనో, కోడినో బలి ఇవ్వడం, సారాయి… అక్కడే తినడం, తాగడం… కేశఖండనలు, పుట్టువెంట్రుకలు… సగటు ఆదివాసీ కుటుంబ ముఖ్య కార్యక్రమాలన్నీ అమ్మల సన్నిధిలోనే…
సరే, కర్నాటకకు వద్దాం… భక్తి అంటే కేవలం మంత్రాలు, పూజలు మాత్రమే కాదు.. తోటి మనిషి ఆకలి తీర్చడం కూడా అని చాటిచెప్పే సంప్రదాయం కర్నాటకలోని జాతరలది… అక్కడ భక్తికి “రుచి” తోడైతే, అది ఒక జనసంద్రాన్నే కదిలిస్తుంది… ఇందుకు కిత్తూరు హోలిగె జాతర, కొప్పళ మిర్చి బజ్జీల జాతర అద్భుతమైన ఉదాహరణలు….
తీపి కలిపిన భక్తి: కిత్తూరు ‘హోలిగె’ జాతర
బెళగావి జిల్లా కిత్తూరులోని ఛాజుకా దేవి జాతర అంటే అది “హోలిగె”ల (బొబ్బట్లు – భక్ష్యాలు – బచ్చాలు – హొబ్బట్లు) పండుగ… అమ్మవారికి నైవేద్యంగా భక్తులు సమర్పించే వేల సంఖ్యలోని హోలిగెలు ఇక్కడ ప్రధాన ఆకర్షణ….
-
శ్రమ వెనుక ఆనందం…: ఇక్కడ హోలిగెలు హోటళ్ళ నుంచి రావు…. వందలాది కుటుంబాలు తమ ఇళ్ల నుండి పిండి, బెల్లం, నెయ్యి మూటగట్టుకుని గుడి దగ్గరకు వస్తాయి….
-
సామూహిక వంట….: గుడి ఆవరణలోని ఖాళీ స్థలంలో వేలాది చిన్న పొయ్యిలు (చూల్లాలు) వెలుస్తాయి…. ఆడవారు గుంపులుగా కూర్చుని, ఒకరు పిండి ముద్దలు చేస్తుంటే, మరొకరు ఒత్తుతూ, ఇంకొకరు కాల్చుతూ… ఒక పెద్ద ‘లైవ్ కిచెన్’లా ఆ ప్రాంతాన్ని మారుస్తారు…. పొగ కమ్ముతున్నా, ఎండ కాస్తున్నా లెక్కచేయకుండా ఆ రోజంతా లక్షలాది హోలిగెలు సిద్ధమవుతాయి….

ఘాటు సేవాభావం: కొప్పళ ‘మిర్చి బజ్జీల’ జాతర
‘మహాదాసోహ’ సమయంలో భోజనం కోసం అనేక రకాల వంటకాలు వడ్డిస్తారు… గత ఏడాది ఏకంగా 20 లక్షల రోటీలు, 6 లక్షల షెంగహోలి (హోలిగ), 400 క్వింటాళ్ల మదలి, 10 క్వింటాళ్ల తుప్ప, వివిధ వంటకాలను తయారు చేసి మఠాన్ని సందర్శించే భక్తులకు వడ్డించారు….
దక్షిణ భారత కుంభమేళాగా పిలిచే కొప్పళ గవిసిద్ధేశ్వర జాతరలో ఈ “మహా దాసోహం” ఒక అద్భుతం…. ఇక్కడ లక్షలాది మందికి పంపిణీ చేసే వేడివేడి మిర్చి బజ్జీలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి….
-
మహా యజ్ఞంలా తయారీ…: ఒక్కో జాతరలో సుమారు 6 నుంచి 8 లక్షల మిర్చి బజ్జీలను పంపిణీ చేస్తారు…. ఆరు లక్షల బజ్జీల కోసం సుమారు 22 క్వింటాళ్ల మిర్చిని కడగడం, వాటికి గాట్లు పెట్టడం, 28 క్వింటాళ్ల శనగపిండిని కలపడం… ఇదంతా ఒక క్రమశిక్షణతో కూడిన సైన్యంలా చేస్తారు…
-
నిరంతర సేవ…: 400 మందికి పైగా వంటగాళ్లు భారీ బాండీల్లో బజ్జీలు వేస్తుంటే, మరో 150 మంది వలంటీర్లు వాటిని వేడివేడిగా భక్తులకు అందజేస్తారు…. మండుతున్న మంటల దగ్గర గంటల తరబడి నిలబడి ఉన్నా, వారి ముఖాల్లో అలసట ఉండదు, కేవలం సేవ తాలూకు తృప్తి మాత్రమే కనిపిస్తుంది….

గుడి నుంచి కడుపు నిండా..
కర్నాటకలోని మఠాలు, గుళ్లు “అన్న వితరణ”ను ఒక పవిత్ర యజ్ఞంగా భావిస్తాయి… వంట చేసే భక్తుడు తన శ్రమను దైవకార్యంగా భావిస్తే, తినే భక్తుడు దానిని ఆశీర్వాదంగా స్వీకరిస్తాడు…. ఒకచోట హోలిగె తీపి భక్తిని పెంచితే, మరోచోట మిర్చి బజ్జీ ఘాటు సేవా నిరతిని చాటుతుంది….
"గుడికి వచ్చిన వాడు ఆకలితో తిరిగిపోకూడదు" అనే ఈ ఆశయం కర్నాటక స్పెషల్... దైవం అంటే కేవలం విగ్రహం కాదు, ఆకలి తీరిన ప్రతి మనిషి ముఖంలో కనిపించే చిరునవ్వు అని ఈ జాతరలు నిరూపిస్తున్నాయి...
Share this Article