Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కాంతారావు డెస్టినీ మార్చేసిన సినిమా… ‘స్వాతి చినుకులు’ ముంచేశాయి…

January 23, 2026 by M S R

.

Subramanyam Dogiparthi …… దానే దానే పే లిఖా హై ఖానే వాలే నామ్… ఎంత మంచి సినిమా ఈ స్వాతి చినుకులు ? అలనాటి ప్రముఖ నటుడు కాంతారావు తీసిన చక్కటి సినిమా . ఆయనను కోలుకోలేకుండా చేసిన సినిమా . ఆయన డెస్టినీని మార్చేసింది.

ఇదే కధాంశంతో తెలుగులో 1963 లో వచ్చిన డబ్బింగ్ సినిమా బాగా ఆడింది . అందులో భానుమతి , షావుకారు జానకి , యస్వీఆర్ , హరనాధ్ ప్రభృతులు నటించారు .

Ads

1989 లో వచ్చిన ఈ తెలుగు సినిమాలో మహానటి సావిత్రి తర్వాత అంతటి నటీమణులు వాణిశ్రీ , జయసుధ ఇద్దరూ అద్భుతంగా నటించిన సినిమా . ఇళయరాజా సంగీత దర్శకత్వంలో శ్రావ్యమైన సంగీతాన్ని అందించిన సినిమా . అయినా ప్రేక్షకులు ఆదరించలేదు .

ఓ సినిమా గొప్పదా కాదా అనేది కేవలం కలెక్షన్ల మీదే ఆధారపడి ఉంటుందా అంటే కాదే కాదు అని చెప్పవలసి ఉంటుంది . దానికి తార్కాణం ఈ సినిమాయే . ఓ రకంగా 1+2 సినిమా . వాణిశ్రీ , జయసుధ అక్కాచెల్లెళ్ళు .

జయసుధ , శరత్ బాబు ఒకరిని ఒకరు ప్రేమించుకుంటారు . పెళ్లి చేసుకోవాలని కలలు కంటారు . శరత్ బాబు తండ్రి కాంతారావు ఫలానా వారి కూతురితో అంటే తాను ప్రేమించిన జయసుధే అనుకొని అంగీకరిస్తాడు . పెళ్లి నిశ్చయం అయిపోతుంది .

అసలు విషయం తెలుసుకున్న శరత్ బాబు ఆ పెళ్లి చేసుకోనని తండ్రి కాంతారావుతో ఘర్షణకు దిగుతాడు . తాను ప్రేమించిన శరత్ బాబుని ఒప్పించి అక్కతో వివాహం జరిపించి జయసుధ పక్కకు తప్పుకుంటుంది . శరత్ బాబుతో కన్న బిడ్డను ఎవరికి పుట్టిందో చెప్పకుండా పిల్లలు పుట్టే అవకాశం లేని అక్కకు పెంచుకునేందుకు ఇచ్చి కలకత్తా వెళ్ళిపోతుంది .

ఆ పిల్ల (రమ్యకృష్ణ) పెద్దయ్యాక తన కాలేజ్ మేట్ అయిన సురేషుని ప్రేమిస్తుంది . సురేష్ తండ్రి గొల్లపూడి మారుతీరావు శరత్ బాబు ఫేమిలీ డాక్టర్ . ఎవరికో పుట్టిన అమ్మాయిని కోడలిగా చేసుకోనని భీష్మించుకుంటాడు . ఆ బిడ్డ ఎవరో , అసలేం జరిగిందో అంతా చెప్పి జయసుధ గొల్లపూడిని ఒప్పిస్తుంది .

శరత్ బాబు విలన్ తమ్ముడు గిరిబాబు ఈ రహస్యాన్ని పెంపుడు కూతురయిన రమ్యకృష్ణకు చెపుతాడు . క్లైమాక్సులో వాణిశ్రీకి అంతా తెలిసిపోతుంది . బ్రైన్ ట్యూమరుతో ఆఖరి క్షణాల్లో ఉన్న జయసుధ కొరకు సురేష్ , రమ్యకృష్ణల పెళ్లి , జయసుధ మరణం జరిగిపోతాయి . సినిమా విషాదంతో ముగుస్తుంది .

అందరూ బాగా నటించారు . రమ్యకృష్ణకు తన ప్రతిభను చూపే పాత్ర లభించింది . బాగా నటించింది . ఇతర పాత్రల్లో సుత్తి వేలు , గిరిబాబు , కె కె శర్మ  తదితరులు నటించారు . గిరిబాబు కామెడీ విలనుగా బాగా నటించాడు .

ఇళయరాజా సంగీత దర్శకత్వంలో వేటూరి పాటల్ని బాలసుబ్రమణ్యం , జానకమ్మ , సుశీలమ్మ , మనో చాలా శ్రావ్యంగా పాడారు . మా కంటి పాప నీవే మా కాంతి రేఖ నీవే నా కన్నతల్లి నీవే పాట చాలా శ్రావ్యంగా ఉంటుంది .

అలాగే శరత్ బాబు , జయసుధ డ్యూయెట్ నన్ను కన్నా మనసు విన్నా ఎదలో మోహనాలాపనే కూడా శ్రావ్యంగా ఉంటుంది . సురేష్ , రమ్యకృష్ణల మీద రెండు డ్యూయెట్లు , సురేష్ ఫ్రెండ్సుతో పాడే చం చం చలాకీ పాట బాగుంటాయి . ఇళయరాజా BGM గొప్పగా ఉంటుంది .

సత్యానంద్ డైలాగులు కూడా బాగుంటాయి . చాలా విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించిన యన్ బి చక్రవర్తి దర్శకత్వంలో ఈ సినిమా స్క్రీన్ ప్లే కూడా బాగుంటుంది . అన్నీ బాగున్నా నిర్మాత నోట్లో శని ఉంటే ఏం జరుగుతుందో అదే జరిగినట్లుగా ఉంది నిర్మాత కాంతారావుకు .

స్వాతి చినుకులు అంటే స్వాతి నక్షత్రం సమయంలో పడే చినుకులు . వీటిని పవిత్రంగా భావిస్తారు . ముత్యాలుగా మారే గుణం ఉంటుందని కొందరి నమ్మకం .

ఈ సినిమా యూట్యూబులో ఉంది . ఎమోషనల్ , డ్రామా సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది . అందరూ చూడతగ్గ సినిమాయే . నేను పరిచయం చేస్తున్న 1230 వ సినిమా . #తెలుగు_సినిమాల_సింహావలోకనం #సినిమా_స్కూల్ #సినిమా_కబుర్లు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆహా… ఏం ప్రేమ కథరా బాబూ..! శిక్షిస్తున్నామా..? దీవిస్తున్నామా..?
  • కొందరిని మరిచిపోలేం… తరచూ గుర్తొస్తుంటారు… కళ్లు చెమ్మగిల్లజేస్తూ…
  • ట్రంపుతో పుతిన్ ఆట… ‘బోర్డ్ ఆఫ్ పీస్’పై ‘షరతులు వర్తించును’…
  • సూది కోసం సోదికెళ్తే… పాత బొగ్గు బండారాలే బయటపడుతున్నయ్…
  • ఈ భూమితో సంబంధం లేకుండా మనిషి బతకగలడా..? ఓ ప్రయోగనగరం..!!
  • కాంతారావు డెస్టినీ మార్చేసిన సినిమా… ‘స్వాతి చినుకులు’ ముంచేశాయి…
  • ‘‘వందల వీథి కుక్కల్ని చంపేసే ఊళ్లకు తెలుసు… ఆ సమస్య తీవ్రత…’’
  • రెహమాన్ ఆస్కార్ దొంగ..! రియల్ విన్నర్ సుఖ్వీందర్ సింగ్..! ఎలాగంటే..?!
  • అసలైన విజేత శర్వానంద్… పరాజితుడు రవితేజ… ఎందుకనగా..?
  • చిరంజీవికి సీఎం అమిత ప్రాధాన్యం… ఎవరికీ అంతుపట్టని ఓ మిస్టరీ…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions