.
( రమణ కొంటికర్ల ) …….. సృష్టి రహస్యాల్ని ఛేదించే క్రమంలో.. మానవుడు చేస్తున్న ప్రతిసృష్టి అంతకన్నా అబ్బురపర్చేది. అలా భూమిలాంటి ఓ నకిలీ ప్రపంచాన్నే సృష్టించారు వారు. అందులో రెండేళ్లపాటు మనుషులను కూడా ఉంచి మూసేశారు. మరి ఆ తర్వాతేం జరిగింది..?
అధి ఆరిజోనా ఎడారి. నగరాలకు, వ్యవసాయ భూములకు దూరంగా ఒక విస్తారమైన గాజు నిర్మాణం అక్కడ కనిపిస్తుంది. ప్రకృతి సిద్ధమైన గాలి, నీరు, వెలుతురు ఇవేవీ లేకుండా అసలు మనిషి బతకగలడా.. ? మానవుడి ప్రతిసృష్టి అయిన ఆ నకలీ భూగ్రహ ప్రయోగానికి ఆ సందేహమే ప్రధాన కారణం.
Ads
ఆ ప్రాజెక్ట్ పేరే బయోస్ఫియర్ 2. భూమిపైనున్న జీవావరణాన్ని ప్రతిబింబించేలా రూపొందించి.. భూగ్రహంతో ఎలాంటి సంబంధం లేకుండా మూసేసిన పరిశోధనా కేంద్రమే ఈ బయోస్ఫియర్ 2.
1990ల కాలంలో ఎనిమిది మందిని ఈ బయోస్ఫియర్ 2 ప్రాజెక్టులో భాగంగా లోనికి పంపి.. ఏకంగా రెండేళ్లపాటు బంధించారు. సౌకర్యాల కోసం కాదు… బయట ప్రకృతిలోని పంచభూతాల్లో దేనితోనూ సంబంధం లేకుండా.. గాలి, నీరు మట్టి, జీవం ఎలా పరస్పరం ప్రభావితమైతాయో తెలుసుకోవడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం.
ఇప్పటికీ ఈ బయోస్ఫియర్ 2 నిర్మాణం ఇంకా క్రియాశీలకంగానే పనిచేస్తోంది. భూమిపై కాకుండా అలాంటి వాతావరణాన్ని సృష్టించుకోగల్గితే.. మానవుడు ఇంకెక్కడైనా జీవించగలడా అనే ప్రశ్నలతో పాటు.. భూమిపై నివశించడానికి నియంత్రించలేని వాతావరణం నెలకొన్నప్పుడు జరిగే పరిణామాల్ని పరిశీలించే కేంద్రంగా కూడా ఈ బయోస్ఫియర్ పరిశోధనలు ఉపయోగపడనున్నాయి.
ఈ బయోస్ఫియర్ 2లోకి వెళ్లి విజయవంతంగా తిరిగి వచ్చింది ఎవరు..?
ఆరిజోనా బయోస్ఫియర్ 2 అనే ఆర్టిఫిషియల్ భూనమానాలోకి సరిగ్గా 1991, సెప్టెంబర్ 26న వెళ్లిన వారు.. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని, 1993, సెప్టెంబర్ 26న మళ్లీ తిరిగి బయటకు వచ్చారు. వెళ్లినవారిలో నల్గురు మగవాళ్లు, మరో నల్గురు ఆడవాళ్లను ఈ మిషన్ కొరకు ఎంపిక చేశారు.
అలా బయోస్ఫియర్ 2లోకి వెళ్లి.. పూర్తిగా గాజుఫలకలతో మూసేసిన ఆ బయోస్ఫియర్ 2 లో రెండేళ్ల పాటు.. ఆబిగెయిల్ ఆలింగ్, లిండా లీ, టేబర్ మెక్ కల్లమ్, జానే పాయింటర్, సల్లీ సిల్వర్ స్టోన్, మార్క్ వాన్ థిలో, రాయ్ వాల్ఫర్డ్, బెండ్ జాబెల్ ఉన్నారు.
ముఖ్యంగా మార్స్ వంటి ఇతర గ్రహాల పైన కూడా మానవ జీవనానికి అవకాశం ఉంటుందా తెలుసుకోవడానికి.. ఈ బయోస్ఫియర్ 2 పరిశోధన ఓ నమూనా అధ్యయనమైంది.
అసలు బయోస్ఫియర్ 2 నిర్మాణాన్ని ఎలా చేపట్టారు..?
ఆరిజోనా ఎడారిలో 3 ఎకరాల 14 గుంటల భూమిపై ఈ బయోస్ఫియర్ 2ను నిర్మించారు. 70 లక్షల ఘనపుటడుగులకు పైగా పూర్తిగా గాజుతో మూసివేసి కనిపిస్తుందిది. ఇక భూమి కింద భాగంతో కూడా ఎలాంటి సంబంధం లేకుండా.. వెల్డింగ్ చేసిన స్టెయిన్ లెస్ స్టీల్ లైనర్స్ ను ఉపయోగించారు. దీంతో బయట వాతావరణ ప్రభావం ఏమాత్రం ఈ బయోస్ఫియర్ అంతర్గత నిర్మాణంపై పడదు.
ప్రకృతిని తలపించేలా జీవావరణ ఏర్పాటు!
మనం జీవించేందుకు కావల్సిన గాలి, నీరు, ఉష్ణోగ్రత, చెట్లు, సముద్ర, అరణ్య నమూనాలతో ఈ బయోస్ఫియర్ 2 నిర్మాణం జరిగింది.
ప్రధానంగా ఉష్ణమండల అరణ్యం, పగడపు దీవులతో కూడిన సముద్రం, మ్యాన్గ్రోవ్ తడితోటలు, సవన్నా గడ్డి మైదానాలు, పొగమంచుతో కూడుకున్న ఎడారి వంటి ఆర్టిఫిషియల్ వాతావరణాన్ని ఈ బయోస్ఫియర్ 2లో రూపొందించారు. ప్రకృతిలో మాదిరిగా వాతావరణ పరిస్థితులు ఒకదానితో ఒకటి అనుసంధానమయ్యేలా ఇక్కడి డిజైనింగ్ ఉంటుంది.
ఒకచోట ఏదైనా మార్పు జరిగితే ఆ మార్పు ప్రభావం మిగతావాటిపై ఎలా ఉంటుందో ఈ బయోస్ఫియర్ లో పరీక్షించేలా దీని రూపకల్పన ఉంటుంది. ముఖ్యంగా ఈ బయోస్ఫియర్ 2 పూర్తిగా మానవ నిర్మితం కావడంతో.. సహజమైన పర్యావరణ వ్యవస్థతో పోలిస్తే పూర్తి భిన్నంగా ఉంటుంది.
ఉష్ణోగ్రత, తేమ, గ్యాస్ వంటి అంశాలను కచ్చితంగా కొలిచేలా, నియంత్రించేలా ఈ వ్యవస్థను రూపొందించారు. దాంతో బయట ప్రకృతి సిద్ధంగా ఏర్పాటై కలిసిపోయినట్టు కనిపించే ఈ భౌగోళిక, వాతావరణ పరిస్థితులను.. విడివిడిగా అధ్యయనం చేసే ఒక ప్రక్రియ ఈ బయోస్ఫియర్ 2లో జరుగుతోంది.
మనుషులను లోపలే మూసేసి ప్రయోగం!
బయోస్ఫియర్ 2 అనే ప్రతిసృష్టి మానవ చరిత్రలో ఓ అత్యంత ప్రసిద్ధమైన ఘట్టంగానే చెప్పుకోవాల్సింది. 1991లో ఈ బయోస్ఫియర్ 2 ఎక్స్పర్మెంట్ ప్రారంభమైంది. ఎనిమిది మందిని బయోస్ఫియర్ 2లోకి పంపి.. ఏకంగా రెండేళ్లపాటుంటారు.
వారు రెండేళ్లపాటు బయటకు రాకుండా.. పూర్తిగా ఆర్టిఫియల్ గా రూపొందించిన వాతావరణంలో తమ ఆహారాన్ని తామే పండిస్తూ, వండుకుంటూ, నీటి వనరులను తిరిగి వినియోగించుకుంటూ.. బయట భూమి నుంచి ఎలాంటి సరఫరా లేకుండా బతికారు.
అనేక సవాళ్లతో కూడిన ప్రయోగ కేంద్రం బయోస్ఫియర్ 2
కానీ, ప్రకృతికి పున: సృష్టి చేయడమంటే మాటలా…? అందుకే ఇందులోకి వెళ్లినవారు చాలా సమస్యలు, సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆక్సిజన్ స్థాయి పడిపోవడం, ఆహార ఉత్పత్తి ఊహించినంత సులభంగా జరగకపోవడం వంటి సవాళ్లు అందులోకి వెళ్లినవారికి జీవన్మరణ సమస్యను ముందుంచాయి.
దాంతో మూసివేసిన జీవవ్యవస్థలు ఎంత క్లిష్టమైనవో వెల్లడైంది. అవసరమైనప్పుడు కావల్సిన గాలి, నీరు, ఇతర వనరులు బ్యాకప్ గా లేకపోతే… మనిషి జీవన విధానం ఎంత కష్టమో కూడా ఈ బయోస్ఫియర్ 2 ప్రయోగం స్పష్టం చేసింది.
ఆ తర్వాత మారిన శాస్త్రజ్ఞుల దృష్టి!
ఈ నమూనా ఎర్త్ స్టేషన్ కు కూడా ఓ దీర్ఘ చరిత్ర ఉంది. 18వ శతాబ్దం నాటికే ఇదో ప్రయోగ కేంద్రంగా ఉండేది. ఆ తర్వాత ఒక కాన్ఫరెన్స్ సెంటర్ గా మారింది. 1980లలో స్పేస్ బయోస్ఫియర్ వెంచర్స్ అనే సంస్థ ఈ కేంద్రాన్ని కొనుగోలు చేసింది. 1990ల ప్రారంభంలో డిసిషన్స్ ఇన్వెస్ట్మెంట్స్ కార్పోరేషన్ యాజమాన్యం టేక్ ఓవర్ చేసింది.
ఆ తర్వాత ఈ కేంద్రం కొలంబియా యూనివర్సిటీ పరమైంది. అలా కొలంబియా యూనివర్సిటీ శాస్త్రీయ అధ్యయనాల్లో భాగంగా మొక్కలపైనా, కార్బన్ డై ఆక్సైడ్ అధ్యయనాల కేంద్రంగా ఈ ఆరిజోనాలో ప్రస్తుత నిర్మాణాన్ని ఉపయోగించారు. ఆ క్రమంలో ఇక్కడ తరగతి గదులు, విద్యార్థులకు హాస్టల్స్ వంటివి కూడా ఏర్పాటు చేశారు.
2011లో ఆరిజోనా యూనివర్సిటీ ఈ కేంద్రాన్ని స్వాధీనం చేసుకుంది. ఇప్పటికీ అరిజోనా యూనివర్సిటే ఈ కేంద్రాన్ని నిర్వహిస్తోంది.
భూ, పర్యావరణ వ్యవస్థలపై పరిశోధనల్లో భాగంగా బయోస్ఫియర్ 2
ఆరిజోనా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో బయోస్ఫియర్ 2 ఇప్పుడు దీర్ఘకాలిక పర్యావరణ పరిశోధనలకు కేంద్రంగా మారింది. ఇందులో ముఖ్యంగా ల్యాండ్ స్కేప్ ఎవల్యూషన్ అజ్జర్వేటరీ ప్రయోగ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
మట్టి, రాళ్లు కాలక్రమంలో పరస్పరం ఎలా ప్రభావితమైతాయో పరిశోధనలు చేస్తున్నారు. ముఖ్యంగా నీటికోత, వాతావరణ మార్పుల వల్ల జరిగే పరిణామాల వంటివాటిపై లోతైన, సుదీర్ఘమైన పరిశోధనలు సాగుతుంటాయి.
భూమిని పోలిన ఆర్టిఫిషియల్ భూమిగా పిల్చే ఈ బయోస్ఫియర్ 2కు ప్రైవేట్ దాతలతో పాటు… ప్రభుత్వం నుంచీ గ్రాంట్స్ అందుతాయి. నేషనల్ సైన్స్ ఫౌండేషన్ కూడా ఇందులో భాగస్వామి. విద్యాకేంద్రంగా కూడా పనిచేస్తూ.. ప్రపంచం నలుమూలల నుంచీ విద్యార్థులు, పరిశోధకులు, సందర్శకులను కూడా ఇప్పుడు ఈ బయోస్ఫియర్ 2 కేంద్రానికి ఆహ్వానిస్తున్నారు.
పర్యాటకులూ సందర్శిస్తున్న ప్రదేశం!
బయోస్ఫియర్ 2 ప్రారంభమైన్నాట్నుంచీ సుమారు 30 లక్షల మందికి పైగా దీన్ని సందర్శించినట్టు తెలుస్తోంది. చాలామంది దీన్ని విఫలమైన ఓ అవశేషంగానే చూస్తారు. కానీ, ఇప్పటికీ మానవ మేథ శోధనలకు ఓ సజీవ ప్రయోగశాలగా కూడా ఈ బయోస్ఫియర్ 2 చర్చల్లో ఉంటోంది.
ఇప్పటికీ మూసేసి కనిపించే గాజుగోడలు!
లోపల జీవవ్యవస్థల్లో నిరంతరం చిన్న చిన్న మార్పులు జరుగుతూనే ఉన్నాయి. బయటంతా ఎడారి వాతావరణంతో పొడిగా ఉన్నా.. ఈ బయోస్ఫియర్ లో మాత్రం అందుకు భిన్నమైన వాతావరణాన్ని అనుభవిస్తారట. ఎక్కడికి తప్పించుకోలేని మార్గం లేనప్పుడు భూమి ఎలా ప్రవర్తిస్తుందో చూడటానికి ఓ నమూనా భూస్థలంగా కూడా ఈ బయోస్ఫియర్ 2ను చెప్పుకుంటారు….
Share this Article