.
జైలు గోడల మధ్య ప్రేమ చిగురించడం, ఆపై కోర్టు అనుమతితో వివాహం వరకు వెళ్లడం అనేది సాధారణంగా సినిమాల్లో చూస్తుంటాం… కానీ, రాజస్థాన్‌కు చెందిన ప్రియా సేథ్, హనుమాన్ ప్రసాద్ విషయంలో ఇది నిజమైంది… వీరిద్దరూ కరుడుగట్టిన నేరస్తులు కావడం, అది కూడా హత్య కేసుల్లో శిక్ష అనుభవిస్తుండటం ఈ కథనాన్ని మరింత ఆశ్చర్యకరంగా మార్చింది…
జైలు గోడల మధ్య వెరిసిన ప్రేమ.. నేడు పెళ్లి పీటలెక్కనున్న ఇద్దరు హంతకులు!
Ads
రాజస్థాన్ చరిత్రలోనే తొలిసారిగా, జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇద్దరు నిందితులు వివాహ బంధంతో ఒక్కటవుతున్నారు…. జైపూర్ జైలులో ఖైదీలుగా ఉన్న ప్రియా సేథ్, హనుమాన్ ప్రసాద్ ఈరోజు (జనవరి 23, 2026) అల్వార్ జిల్లాలో వివాహం చేసుకోబోతున్నారు…
-
ప్రియా సేథ్…: 2018లో జైపూర్‌లో దుష్యంత్ శర్మ అనే వ్యాపారవేత్తను ‘టిండర్’ ద్వారా హనీ ట్రాప్ చేసి, కిడ్నాప్ చేసి, చివరకు హత్య చేసి సూట్‌కేసులో కుక్కిన కేసులో ఈమె ప్రధాన నిందితురాలు… 2023లో కోర్టు ఈమెకు జీవిత ఖైదు విధించింది…
-
హనుమాన్ ప్రసాద్…: 2017లో అల్వార్‌లో వివాహేతర సంబంధం కోసం ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని (భర్త, ముగ్గురు పిల్లలు, మేనల్లుడు) దారుణంగా హత్య చేసిన కేసులో నిందితుడు… ఇతను కూడా జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు….
వీరిద్దరూ జైపూర్ కోర్టు వాయిదాలకు వెళ్లినప్పుడు పరిచయమయ్యారు…. ఆ తర్వాత సంగనేర్ ఓపెన్ జైలులో వీరి మధ్య అనుబంధం పెరిగింది… నువ్వూ నేనూ సేమ్ సేమ్, వై డోన్ట్ వుయ్ మ్యారీ అని మాట్లాడుకున్నారు… ప్రేమబంధం బలపడింది… మరి పెళ్లి ఎలా సాధ్యం అంటారా..?
ఏమిటి ఈ ‘ఓపెన్ జైలు’? – నియమాలు ఇవే
రాజస్థాన్ ప్రిజనర్స్ ఓపెన్ ఎయిర్ క్యాంప్ రూల్స్, 1972 ప్రకారం ఈ జైళ్లు నడుస్తాయి… ఇక్కడ ఖైదీలకు సాధారణ జైళ్ల కంటే భిన్నమైన వాతావరణం ఉంటుంది….
-
అర్హత…: కనీసం మూడవ వంతు (1/3) శిక్షా కాలం పూర్తి చేసుకుని, జైలులో మంచి ప్రవర్తన (Good Conduct) కనబరిచిన వారిని మాత్రమే వేరే జైళ్ల నుంచి ఇక్కడికి మారుస్తారు…
-
స్వేచ్ఛ..: ఇక్కడ ఎత్తైన గోడలు, ముళ్ల తీగలు ఉండవు… ఖైదీలు ఉదయం 6 నుండి సాయంత్రం 7 గంటల వరకు 10 కిలోమీటర్ల పరిధిలో బయటకు వెళ్లి పనులు చేసుకోవచ్చు.., సొంతంగా డబ్బు సంపాదించుకోవచ్చు…
-
కుటుంబంతో నివాసం…: ఓపెన్ జైలులో ఖైదీలు తమ భార్యాపిల్లలతో కలిసి ఉండటానికి కూడా అనుమతి ఉంటుంది… ఖైదీలు సమాజంలో తిరిగి కలిసిపోవడానికి (Rehabilitation) ఇదొక చక్కని వేదికగా భావిస్తారు…
-
నిఘా…: ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం హాజరు (Roll Call) ఇవ్వడం తప్పనిసరి… నిబంధనలు ఉల్లంఘిస్తే తిరిగి సాధారణ జైలుకు పంపుతారు….
కోర్టు అనుమతితో పెళ్లి పెరోల్
పెళ్లి చేసుకోవడం అనేది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని ప్రియా సేథ్ హైకోర్టును ఆశ్రయించింది… రాజస్థాన్ హైకోర్టు మానవతా దృక్పథంతో వీరిద్దరికీ 15 రోజుల పెళ్లి పెరోల్ మంజూరు చేసింది… ఈ 15 రోజులు వారు బయట ఉండి, పెళ్లి పనులు పూర్తి చేసుకుని తిరిగి జైలుకు వెళ్లాల్సి ఉంటుంది…
ప్రజా స్పందన…: ఈ వివాహం ఒకవైపు ఆసక్తి కలిగిస్తుంటే, మరోవైపు బాధితుల కుటుంబ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు…. ఇంతటి దారుణ హత్యలు చేసిన వారికి ఇలాంటి రాయితీలు ఇవ్వడం అన్యాయమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు… తీవ్ర నేరాలకు పాల్పడిన వీళ్లను శిక్షిస్తున్నట్టా..? లేక దీవిస్తున్నట్టా అనేది వాళ్ల అభ్యంతరం…
1. కలిసి ఉండేందుకు ‘ఓపెన్ జైలు’ ఒక వరప్రసాదం
ఓపెన్ జైలు నియమాల ప్రకారం, శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు తమ భార్యాపిల్లలతో కలిసి ఒకే గదిలో లేదా చిన్నపాటి క్వార్టర్‌లో నివసించే అవకాశం కూడా ఉంది… ఇప్పుడు ప్రియా సేథ్, హనుమాన్ ప్రసాద్ చట్టబద్ధంగా భార్యాభర్తలు కాబోతున్నారు కాబట్టి, వారు ఇదే నిబంధనను ఆయుధంగా చేసుకునే అవకాశం ఉంది…
2. ‘వైవాహిక హక్కుల’ కోసం కోర్టుకు వెళ్లే అవకాశం
భారతదేశంలో ఖైదీల హక్కులకు సంబంధించి గతంలో కొన్ని కీలక తీర్పులు వచ్చాయి…
-
సంతానోత్పత్తి హక్కు (Right to Procreate)…: ఖైదీలకు కూడా వంశాభివృద్ధి చేసుకునే హక్కు ఉంటుందని కొన్ని హైకోర్టులు గతంలో తీర్పులు ఇచ్చాయి….
-
దీనిని ఆధారంగా చేసుకుని, “మేము భార్యాభర్తలం కాబట్టి, మాకు కలిసి ఉండేందుకు అనుమతి ఇవ్వాలి” అని వారు ఖచ్చితంగా పిటిషన్ వేసే అవకాశం ఉంది….
3. ఎదురయ్యే సవాళ్లు
అయితే, వారు కోరుకున్నంత సులభంగా ఇది జరగకపోవచ్చు. ఎందుకంటే…
-
కేసు తీవ్రత…: వీరిద్దరూ సాధారణ నేరస్తులు కాదు, ‘హత్య’ కేసుల్లో దోషులు. ముఖ్యంగా ప్రియా సేథ్ హనీ ట్రాప్ వంటి నేరాలకు పాల్పడిన వ్యక్తి కావడంతో, ఆమెకు ఇతరులతో కలిసి ఉండే అవకాశం ఇస్తే జైలు క్రమశిక్షణకు భంగం కలుగుతుందని జైలు అధికారులు వాదించవచ్చు…
-
ప్రభుత్వ అభ్యంతరాలు…: బాధితుల తరపు న్యాయవాదులు లేదా ప్రభుత్వం ఇలాంటి వెసులుబాటును తీవ్రంగా వ్యతిరేకించే అవకాశం ఉంది… “హత్యలు చేసిన వారికి ఇలాంటి కుటుంబ సౌకర్యాలు కల్పిస్తే సమాజానికి తప్పుడు సంకేతాలు వెళ్తాయి” అన్నది వారి ప్రధాన వాదన కావచ్చు…
4. రాజస్థాన్ ఓపెన్ జైలు చరిత్ర
రాజస్థాన్‌లోని ఓపెన్ జైళ్లలో ఇప్పటికే చాలా మంది ఖైదీలు తమ కుటుంబాలతో కలిసి ఉంటున్నారు… కానీ, ఇద్దరు ఖైదీలే ఒకరినొకరు పెళ్లి చేసుకుని, ఒకే గదిలో ఉండటం అనేది చాలా అరుదైన, సంక్లిష్టమైన విషయం…
ముగింపు…: పెళ్లి తర్వాత వారు “సహజీవన హక్కు” (Right to Cohabitation) కోసం కోర్టు తలుపులు తట్టడం దాదాపు ఖాయం…. ఒకవేళ కోర్టు దీనికి అనుమతి ఇస్తే, అది భారత న్యాయ వ్యవస్థలో ఒక సంచలన, వివాదాస్పద తీర్పుగా నిలుస్తుంది…. ఏమో... అపరాధిని కాదు, అపరాధాన్ని ద్వేషించు అనబోతుందా మన వ్యవస్థ..?
Share this Article