.
సుమారు మూడు దశాబ్దాల క్రితం ‘బోర్డర్’ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు… ఇప్పుడు అదే పేరుతో, అదే సన్నీ దేవల్‌తో వచ్చిన ‘బోర్డర్ 2’పై భారీ అంచనాలు ఉన్నాయి… అయితే, ఈ సినిమా సీక్వెల్ భారీతనానికి ప్రాధాన్యత ఇచ్చి కథను గాలికొదిలేసింది…
అసలు కథేంటంటే: సినిమా మళ్ళీ 1971 ఇండో-పాక్ యుద్ధం నేపథ్యానికే వెళ్తుంది… ఈసారి కథ కేవలం లాంగేవాలా పోస్ట్ దగ్గరే ఆగదు… పాకిస్థాన్ తన యుద్ధ తంత్రాన్ని మార్చి, అటు భూమి మీద (ఆర్మీ), ఇటు సముద్రం మీద (నేవీ) ఏకకాలంలో దాడికి ప్లాన్ చేస్తుంది…
Ads
రిటైర్మెంట్ దగ్గరగా ఉన్న సీనియర్ ఆఫీసర్ కుల్దీప్ సింగ్ చౌదరి (సన్నీ దేవల్) నేతృత్వంలో ఒక కుర్రాళ్ళ టీమ్ సిద్ధమవుతుంది… మేజర్ హోషియార్ సింగ్ (వరుణ్ ధావన్), నేవీ అధికారి (అహాన్ శెట్టి), ఎయిర్ ఫోర్స్ పైలట్ (దిల్జీత్ దోసాంజ్) – ఇలా ముగ్గురు మూడు వైపుల నుండి శత్రువును ఎలా ఎదుర్కొన్నారు…? ఈ క్రమంలో వారి వ్యక్తిగత జీవితాలు, వారి త్యాగాలు ఏమయ్యాయి…? అదే ఈ సినిమా కథ….
విశ్లేషణ: ఎక్కడ మెరిసింది? ఎక్కడ బెడిసికొట్టింది?
1. పాత సీసాలో పాత సారా…: కథలో కొత్తదనం ఏమీ లేదు… మొదటి భాగంలో సైనికులు ఉత్తరాల కోసం ఎదురుచూస్తే, ఇందులో వీడియో కాల్స్ కోసం చూస్తారు… సన్నీ దేవల్ తన పాత బాణీలోనే పాకిస్థానీయులపై విరుచుకుపడుతుంటే థియేటర్లో మాస్ ఆడియన్స్ ఖుషీ అవుతున్నారు కానీ, అందులో ‘లాజిక్’ వెతికే వారికి మాత్రం తలనొప్పి వస్తుంది…
2. శబ్దం ఎక్కువ… శిల్పం తక్కువ…: సినిమా అంతా అరుపులే… దేశభక్తి అంటే కేవలం పాకిస్థాన్‌ను తిట్టడమే అన్నట్టుగా సీన్లు రాసుకున్నారు… ఇందులో ‘దేశభక్తి’ కంటే ‘అతివాదం’ ఎక్కువగా ఉంది… యుద్ధ సన్నివేశాల్లో గ్రావిటీ ఉండాలి కానీ, ఇందులో హీరోలు సూపర్ మేన్లలాగా యుద్ధం చేస్తుంటే రియలిజం దెబ్బతిన్నది…
3. నిడివి – ఒక శాపం…: 3 గంటల 16 నిమిషాల సినిమా అంటే సహనానికి పరీక్షే… యుద్ధం మొదలవ్వడానికి ముందు వచ్చే ఫ్యామిలీ సెంటిమెంట్ సీన్లు మరీ సాగదీతగా ఉన్నాయి… సన్నీ దేవల్ డైలాగులు మొదట బాగున్నా, సినిమా మొత్తం అవే కావడంతో మొహం మొత్తుతుంది…
4. నటన…:
-
సన్నీ దేవల్…: తన గొంతుతో ఇంకా మ్యాజిక్ చేయగలరని నిరూపించాడు… తనే సినిమాకు అసలు హీరో…
-
వరుణ్ ధావన్…: ఈ సినిమాలో పర్వాలేదనిపించిన నటుడు వరుణ్… ఆయన పాత్రలో కాస్త ఎమోషన్ ఉంది…
VFX…: భారీ బడ్జెట్ అన్నాక విజువల్స్ అద్భుతంగా ఉండాలి… కానీ కొన్ని చోట్ల వీడియో గేమ్స్ చూస్తున్నట్టు అనిపిస్తుంది…
“సందేసే ఆతే హై” పాట రీమిక్స్ విన్నప్పుడు కలిగే ఉద్వేగం, సినిమా చూస్తున్నప్పుడు కలగదు… ‘బోర్డర్ 2’ పాత సినిమా మీద ఉన్న గౌరవాన్ని వాడుకోవాలని చూసింది తప్ప, అంతకంటే గొప్పగా ఏమీ తీయలేదు… కానీ హిట్ అవుతుంది, కలెక్షన్లు కురుస్తాయి, ఎందుకంటే..?
ప్రస్తుతం దేశంలో ‘నేషనలిజం’ ఒక పెద్ద సేల్స్ పాయింట్… కథలో లోపాలున్నా, దేశభక్తిని ఎమోషనల్‌గా టచ్ చేస్తే చాలు, ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు…. ధురంధర్ మెగా హిట్ చూశాం కదా…
-
పాకిస్థాన్ ఫ్యాక్టర్…: వెండితెరపై పాకిస్థాన్‌తో యుద్ధం అంటే సగటు ప్రేక్షకుడికి ఒక రకమైన కిక్… గతంలో ‘గదర్ 2’ సాధించిన రికార్డులే దీనికి నిదర్శనం… ‘దురందర్’ వంటి చిత్రాల విజయం కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది….
-
సన్నీ దేవల్ మ్యాజిక్…: మల్టీప్లెక్స్ ఆడియన్స్ ఎలా ఆదరించినా, ఆదరించకపోయినా సరే… ‘బి’ ‘సి’ సెంటర్లలో సన్నీ దేవల్ అంటే ఇప్పటికీ ఒక పవర్… ఆ మాస్ సెంటర్లలో జనం కథ కంటే సన్నీ ఇచ్చే పవర్‌ఫుల్ డైలాగులనే కోరుకుంటారు….
వరుణ్ ధావన్ మీద జరిగిన ట్రోలింగ్ ఏమిటి?
వరుణ్ ధావన్ అంటేనే అందరికీ రొమాంటిక్, కామెడీ పాత్రలు గుర్తొస్తాయి… అలాంటి నటుడు ఆర్మీ మేజర్‌గా, పవర్‌ఫుల్ యుద్ధ సన్నివేశాల్లో సూట్ అవుతారా అని నెటిజన్లు మీమ్స్‌తో విరుచుకుపడ్డారు…
ఆయన కంటే ‘విక్కీ కౌశల్’ లేదా ‘సిద్ధార్థ్ మల్హోత్రా’ లాంటి వారు బాగా సెట్ అవుతారని ట్రోల్ చేశారు… సన్నీ దేవల్ ఇమేజ్ ముందు తేలిపోతాడని అనుకున్నారు… కానీ..?
ఈ సినిమాలో వరుణ్ తన కామెడీ ఇమేజ్‌ను పక్కన పెట్టి, చాలా సీరియస్‌గానే నటించాడు పాత్రకు తగినట్టు… ముఖ్యంగా కళ్ళతో ఎమోషన్స్ పండించడం, ఆర్మీ ఆఫీసర్‌కు కావాల్సిన ‘బాడీ లాంగ్వేజ్’ కోసం ఆయన పడ్డ కష్టం స్క్రీన్ మీద కనిపిస్తోంది… సన్నీ దేవల్ లాంటి సీనియర్ పక్కన ఉన్నప్పుడు కూడా తన ఉనికిని చాటుకోవడంలో సఫలమయ్యాడు…
మరి ఫిమేల్ రోల్స్..?
-
-
మోనా సింగ్…: సన్నీ దేవల్ భార్యగా ఆమె ఎమోషనల్ సీక్వెన్స్‌లలో అద్భుతంగా నటించింది… ఒక సీనియర్ ఆఫీసర్ భార్య పడే ఆందోళనను ఆమె కళ్ళకు కట్టినట్టు చూపించింది…
-
మేధా రాణా…: ఈ సినిమాతో ఈమె వెండితెరకు పరిచయం అయ్యింది… వరుణ్ ధావన్‌కు జోడీగా నటించిన ఈమె, ఆర్మీ కుటుంబం నుండే రావడంతో ఆ పాత్రలో చాలా సహజంగా కనిపించింది…
-
సోనమ్ బజ్వా…: పంజాబీ స్టార్ హీరోయిన్ సోనమ్, దిల్జీత్ మధ్య కెమిస్ట్రీ సినిమాకి కొంత రిలీఫ్ ఇస్తుంది…
-
యుద్ధం నేపథ్యంలో సాగే సినిమా కావడంతో వీరికి స్క్రీన్ టైమ్ (Screen Time) తక్కువే…. అయితే, సైనికుల త్యాగాల వెనుక వారి కుటుంబ సభ్యుల భావోద్వేగాలను చూపించడానికి దర్శకుడు వీరి పాత్రలను వాడుకున్నాడు… సినిమా బోర్డర్ సినిమా అంతగా ఈ సీక్వెల్ ఉండకపోవచ్చుగాక… కానీ వసూళ్లపరంగా హిట్టే… థియేటర్లలో వినిపించే అరుపులే సాక్ష్యం..!!
Share this Article