.
కొన్ని విషయాలు చెప్పుకోవాలి… ఏపీ మార్క్ పాలిటిక్స్ కాదు, తెలంగాణ రాజకీయాలు స్ట్రెయిట్ ఫైట్… రాజకీయాల్లో నిజాయితీ ఉండేది… కానీ అది గతం… బీఆర్ఎస్ ద్వంద్వ ప్రమాణ (డబుల్ స్టాండర్డ్స్) రాజకీయ ధోరణులతో తెలంగాణ రాజకీయాలు కూడా భ్రష్టుపడుతున్నాయి…
అధికారం కోల్పోగానే అనేక ప్రజాస్వామిక విలువలు గుర్తొస్తున్నాయి ఆ పార్టీకి… ప్రజాజీవితానికీ, జనజీవన స్రవంతికి దూరమైన అధినేత, వరుసగా వాతలు పెడుతున్న ఆ అధినేత బిడ్డ… భవిష్యత్తు ఏమిటో అర్థం కాని స్థితి… ఈ ఫ్రస్ట్రేషన్‌లో హరీష్ రావు, కేటీయార్ మాట్లాడుతున్న మాటలు సర్వత్రా చర్చనీయాంశాలు…
Ads
ఫోన్ ట్యాపింగ్ కేసే తీసుకుందాం… కొన్ని తప్పకుండా చెప్పుకోవాలి…
- 1. కేటీయార్ పదే పదే నా వ్యక్తిత్వ హననం చేస్తున్నారు అంటున్నాడు… అనగా కేరక్టర్ అసాసినేషన్… తనకు సినిమా తారలతో రంకు అంటగడుతున్నారని ఆవేదన కమ్ ఆరోపణ కమ్ విమర్శ…
జస్ట్, చిన్న ఉదాహరణ చెప్పుకుందాం… మొన్న ఓ మంత్రితో మహిళా ఐఏఎస్‌లకు రంకు అంటగడుతూ ఎన్టీవీ ప్రసారంబ చేసిన నీచమైన దిగజారుడు కథనం ఆధారంగా కేటీయార్ పెయిడ్ సోషల్ మీడియా బోలెడు కథనాలు వడ్డించింది… ఏం..? ఆ మహిళా ఐఏఎస్‌కు కుటుంబం లేదా..? ఆమెది బాధ కాదా..? అది వ్యక్తిత్వ హననం కాదా..?

- 2. గతంలో ఫోన్ ట్యాపింగ్‌ను అభ్యంతరపెట్టిన మాజీ ఐపీఎస్, తాజా బీఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏకంగా ఫోన్ ట్యాపింగ్ సిట్ అధినేత సజ్జనార్ మీద 7 క్రిమినల్ కేసులున్నాయనీ, సిట్‌కు విశ్వసనీయత, విలువ ఏమున్నాయని అంటున్నాడు… అసలు ఫోన్ ట్యాపింగ్ నేరమే కాదు అంటున్నాడు…

రాజకీయ విమర్శలు వేరు… పార్టీలు పరస్పరం బురద జల్లుకుంటాయి… కానీ చట్టబద్దంగా ఏర్పాటైన ఓ సిట్ అధినేత మీద క్రిమినల్ కేసులున్నాయనే ఆరోపణ నిర్హేతుకం… ఇంకా రాజకీయ విమర్శకూ, వ్యక్తిత్వ హననానికీ తేడా ఆయనకు తెలిసినట్టు లేదు… పైగా సజ్జనార్, శివధర్‌రెడ్డిల మీదకు అస్త్రాలు వదిలితే వాళ్లు ఊరుకుంటారా..? వాళ్లు రాజకీయ నాయకులు కాదు, రాజకీయ పదవుల్లో లేరు… పైగా ఇంకా సర్వీసులో ఉన్న ఐపీఎస్‌లు…
అందుకే వెంటనే సజ్జనార్ స్పందించాడు… 2 రోజుల్లో ఆధారాలు చెప్పు, లేకపోతే క్రిమినల్ నేచర్ పరువు నష్టానికీ, లీగల్ ప్రొసీడింగ్స్ ఎదుర్కోవడానికి సిద్ధపడు అని ఘాటుగా స్పందించాడు… వెరసి ఈ ఫోన్ ట్యాపింగ్ కథ ఎటెటో పోతోంది…

- 3. హరీష్ రావు ఏమన్నాడు..? తమను విచారించే పోలీసు అధికారులు రేప్పొద్దున ఏ పొక్కలో దాక్కున్నా, సప్తసముద్రాలు దాటిపోయినా వెంటపడతాం, ఇంతకింతా తీర్చుకుంటాం…. ఇదా..? వ్యవస్థకు ఇచ్చే గౌరవం..? మీ అత్యంత అనుంగు మాజీ ఎస్ఐబీ చీఫ్ సప్తసముద్రాలు దాటి, పారిపోయి, చట్టానికి దొరక్కుండా ఉండాలని ప్రయత్నించాడు… అందుకేనా ఈ మాటలు..? ఐనా ఇదేం బెదిరింపు..? మీ కాలంలో వేధింపులకు గురైన వాళ్లంతా అప్పట్లో మీకు సర్వెంట్లుగా సహకరించిన మొత్తం అధికారులపై కేసులు పెడితే..? వెంటపడితే..?
చట్టబద్దంగా సాగే విచారణలను, పోలీసులను కించపరిచే, బెదిరించే ప్రయత్నాలు మానుకోవాలని… లేెకపోతే చట్టపరంగా మళ్లీ బోనులో నిలబడాల్సి ఉంటుందని తెలంగాణ పోలీస్ అధికారుల సంఘం హెచ్చరించింది…

- 4. కేటీయార్ గానీ, హరీష్ రావు గానీ ఏమంటున్నారు..? మేమే ఉల్టా సిట్‌కు ప్రశ్నలు వేశాం… నీళ్లు నమిలారు… కానీ నిజం ఏమిటంటే..? సిట్ ఏం అడిగిందో, వీళ్లేం చెప్పారో బయటకు చెప్పదు… వీళ్లు బయటకు వచ్చి చెప్పుకునే డొల్ల మాటలకు విలువ ఉండదు… విచారణ సమయంలో అన్నీ రికార్డు అవుతాయి… మీ ఫోన్లు కూడా ట్యాప్ అయింది, ఇవిగో ఆధారాలు అని చూపిస్తే హరీష్ రావు దగ్గర జవాబు లేదు… పైగా తనే అప్పట్లో అందరికీ చెప్పుకున్నాడు… నా ఫోన్లు ట్యాపవుతున్నాయ్ బాబోయ్ అని…

5. సింగరేణిలో కుంభకోణాలు బయటపెడుతున్నందుకే… డైవర్షన్ కోసం రేవంత్ రెడ్డి ఈ సిట్ పిలుపులకు దిగాడని హరీష్, కేటీయార్ ఆరోపణ… దానికీ దీనికీ సంబంధం ఏముంది..? ఏదో విషయాన్ని డైవర్ట్ చేయాలని వీళ్లిద్దరి ప్రయత్నం తప్ప…
![]()
- 6. అసలు ఫోన్ ట్యాపింగ్ నేరమే కాదు, దేశభద్రత కోసం కేసీయార్ ఈ మహత్కార్యం చేశాడని మరో ప్రచారం… ఎస్, ఫోన్ ట్యాపింగ్ నేరం కాదు, కేటీయార్ చెబుతున్నట్టు గూఢచార వ్యవస్థ రాజుల కాలం నుంచీ ఉంది… కానీ కేసీయార్ కాలంలో అది అరాచకంగా, పద్దతి తప్పిన తీరు గురించి… మీడియా హౌజుల్లో, సిరిసిల్ల వార్ రూముల్లో నుంచి… ప్రజాప్రతినిధులు, నాయకులు, జర్నలిస్టులు, మేధావులు, న్యాయమూర్తులు, ధనికులు, పారిశ్రామికవేత్తల ఫోన్ల ట్యాపింగు…
అసాంఘిక శక్తుల మీద మాత్రమే, అధికారికంగా, అనుమతి తీసుకుని మాత్రమే చేయాల్సిన ట్యాపింగు ఇంత అరాచకంగా ఎందుకు సాగిందనేది కదా ప్రశ్న… ఒక ఈటల, ఒక రఘునందన్‌రావు, ఒక బండి సంజయ్, చివరకు అధినేత బిడ్డ, అల్లుడి ఫోన్లు సహా (సోకాల్డ్ మేనల్లుడు హరీష్ రావు సహా) ట్యాపింగుకు గురైనట్టు ఎందరో చెబుతున్న నిజాల నిగ్గు తేలాలి కదా… బ్లాక్‌మెయిళ్లు, ఎలక్టోరల్ బాండ్స్ దాకా… చివరకు రాష్ట్రానికి వచ్చే కేంద్ర మంత్రుల ఫోన్లకూ రక్షణ లేదట కదా… ఈ బండారాలన్నీ బయటపడాలి కదా మరి… ఐరనీ, పారడాక్స్ ఏమిటంటే… అదే హరీష్ రావు ఈరోజు ఫోన్ ట్యాపింగును సమర్థించడం..!!

చివరగా... అప్పట్లో జగన్ గెలుపుకీ, చంద్రబాబు ఓటమికీ కేసీయార్ మార్క్ ఫోన్ ట్యాపింగే కారణమని ఓ మిత్రుడి విశ్లేషణ... ఏపీ నాయకుల ఫోన్లన్నీ ట్యాప్ చేసి... చంద్రబాబుకు వెళ్లాల్సిన నిధులన్నీ బ్లాక్ చేసేసి... తనను కదలనివ్వకుండా చేయడంతో... పోల్ మేనేజ్‌మెంట్ కష్టమైపోయి చంద్రబాబు చేతులెత్తేశాడట... మరి ఇప్పుడూ ఫోన్ ట్యాపింగ్ చట్టబద్ధమే, నేరం కాదు, మంచిదే అందామా..?!
Share this Article