‘‘జగన్ బెయిల్ రద్దు కావడం ఖాయం, అనవసరంగా రఘురామ కృష్ణంరాజుతో గోక్కున్నాడు… రఘు ఊరుకునేరకం కాదు, ఢిల్లీలో కూర్చుని రచ్చ చేసేస్తున్నాడు… ఢిల్లీ కూడా అదును కోసం వేచిచూస్తోంది… రేప్పొద్దున జగన్ బెయిల్ రద్దు అయిపోగానే, తన భార్య భారతిని సీఎం కుర్చీ మీద కూర్చోబెట్టే ఆలోచనలో ఉన్నాడు జగన్… కానీ తమిళనాడులో అన్నాడీఎంకేను శశికళ చేతుల్లో నుంచి తప్పించి ఆమెను శంకరగిరి మాన్యాలు పట్టించినట్టుగానే జగన్‌ను కూడా కట్ చేసేస్తారు మోడీ, అమిత్ షా… షర్మిలను తెరమీదకు తీసుకొచ్చి, వైసీపీ పగ్గాల్ని ఆమె చేతుల్లో పెడతారు… ఈలోపు ట్రిపుల్ఆర్ జగన్‌తో మరింత ఆడుకుంటాడు… నేను ఊరుకుంటానా..? నామీద రాజద్రోహం కేసు పెడతావా..? ఇప్పుడు చూడు, నీమీదే నేను కేసు పెడతా… అసలే సుప్రీంకోర్టు మాంచి జోష్ మీద ఉంది… జగనూ, నీ పని అయిపోయింది’’……….. అరెరె, ఏమిటిది..? ఎవరు కలకంటున్నారు..? ఎవరి మాటలివి… ఇంకెవరివి..? మాన్యులైన, అసామాన్యులైన ఏబీఎన్ ఆర్కే గారి బహిరంగ స్వగతం… ఆయన తాజా రాతలే ఇవన్నీ…
తన మీద కేసు పెట్టి, తనను జైలుపాలు చేయడానికి జగన్ ప్రయత్నిస్తున్నందున… ఆ కోపంలో, ఆ ఆవేదనలో, ఆ ఆక్రోశంలో అర్థముంది… అర్థం చేసుకోవాల్సిందే… నాశనమైపోతావ్ జగన్, నన్ను వేధిస్తే నేనూరుకోను సుమా అని మొండిగా సవాల్ చేయడం వరకూ అర్థం చేసుకోవచ్చు… ఈ అర్థంపర్థం లేని రాజద్రోహం కేసులకు సంబంధించి జగన్, ఇతర బాధ్యులను వ్యక్తిగత బాధ్యులను చేస్తూ కేసు పెడతాను అని బెదిరించడాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు… అయితే ఆర్కేకు కొంత ఫిక్షనల్ రైటింగ్ స్కిల్స్ ఉన్నాయి కదా… ఇదే ఊపులో ఏపీ రాజకీయాల భవిష్యత్తు చిత్రాన్ని కూడా ఆవిష్కరించే ఓ వింత ప్రయత్నం చేశాడు… అందులో ప్రధానాంశం ఏమిటంటే..? షర్మిల-బీజేపీ అవగాహన… వైసీపీ నుంచే జగన్‌ను దూరం చేసే ఎత్తుగడ… శశికళలాగే జగన్‌ను శంకరగిరి మాన్యాలు పట్టించడం…
Ads
అయితే ఇక్కడ ఆర్కే తాజా సండే ఎపిసోడ్లో ట్రిపుల్ఆర్ అలియాస్ రఘురామకృష్ణంరాజును హీరోను చేశాడు… ఆంధ్రజ్యోతి జర్నలిజం మీదొట్టు… చంద్రబాబు అనే పదం వాడకుండా వెలువడిన అత్యంత అరుదైన ఎపిసోడ్ ఇది… కేసీయార్ నవ్వులపాలైన విధం, జగన్ నవ్వుల పాలవుతూ ఉన్న విధం గురించి రాసిన ఆర్కే… ఇక చూసుకొండి, ట్రిపుల్ఆర్ ఇంకా చేయబోతున్నాడో అని మునగచెట్టు ఎక్కిస్తున్నాడు… రఘు ఎంపీలందరికీ లేఖలు రాసి జగన్‌ను ఢిల్లీలో మరింత నవ్వులపాలు చేశాడు… రేప్పొద్దున సీబీఐ కోర్టులో జగన్ బెయిల్ రద్దుకు తన అనుభవాల్నే ప్రధానంగా వివరించబోతున్నాడు… జాస్తి కృష్ణకిశోర్‌ను ఎలా వేధించారో కూడా చెబుతాడు… ఇంకేముంది..? ఖేల్ ఖతం… బెయిల్ రద్దు…
ఏ జైలుకు జగన్‌ను పంపించే అవకాశం ఉందో మాత్రం ఆర్కే రాయలేదు… వచ్చే ఆదివారం కోసం దాచిపెట్టాడేమో… జగన్ రేపు ఢిల్లీ వెళ్తున్నాడు కదా… ఈ నేపథ్యంలో ఈ ఆర్కే మార్క్ కథ బాగానే చర్చనీయాంశం అవుతుంది… జర్నలిస్టు వినోద్ దువాపై రాజద్రోహం కేసును సుప్రీం కొట్టేయడం, జర్నలిస్టులకు కాస్త ఊరట, ఉపశమనం, భరోసా కల్పించే దిశలో సుప్రీం అడుగులు ఉండటం వరకూ వోకే, మంచిదే… ఏబీఎన్, టీవీ5 మీద పెట్టిన కేసుల్నీ జర్నలిస్టు లోకం ఖండించాల్సిందే… కానీ ఈ ప్రభుత్వం కూలిపోతుంది, ఈ సీఎం మళ్లీ జైలుపాలవుతాడు, ఆయన చెల్లెను ముందుపెట్టి మోడీ జగన్‌ను తన్ని తరిమేస్తాడు వంటి కథల్ని ఉద్దేశపూర్వక ప్రచారంలోకి తీసుకొచ్చే జర్నలిజం తీరుపై ఏం కేసులు పెట్టొచ్చు యువరానర్..? అఫ్ కోర్స్, ఇది రాజద్రోహమో, దేశద్రోహమో కాకపోవచ్చుగాక, కానీ ఈ అస్ట్రోజర్నలిజం ప్రభుత్వాన్ని అస్థిరపరిచే దుష్ప్రచారం కిందకు వస్తుందా..? దీనికి మన ఐపీసీలో సెక్షన్లున్నాయా..? షర్మిల బాణంలాగే మోడీ కేసీయార్ మీదకు హరీష్ బాణం ఏమైనా ఆలోచిస్తున్నాడా..? ఈ క్లారిటీ కూడా ఇవ్వాలి ఆర్కే సార్ మీరు…! సరే, ఇదంతా పోనివ్వండి… ఎందుకమ్మా, షర్మిలా… వైఎస్ఆర్టీపీ పేరిట తెలంగాణ ఆత్మాభిమానం మీద దాడికి దిగే ప్రయత్నాలు, ఎలాగూ ఏపీ పగ్గాలే చేతికొస్తున్నాయట కదా… తెలంగాణను వదిలేయరాదూ, అసలే దీని గాయాలు ఇంకా పచ్చిపచ్చిగానే ఉన్నయ్…!!
Share this Article