.
పోలవరం, జనవరి 25 ….పోలవరం ప్రాజెక్టు మీద రాజకీయ వివాదాలు, పరస్పర ఆరోపణలు, అవినీతి విమర్శలు, జాప్యం… పెరిగిన అంచనా వ్యయాల వెనుక అసలు కక్కుర్తి వేషాలు ఎట్సెట్రా కాసేపు పక్కన పెడదాం… రాజకీయ నాయకులు దండుకోని ఏ సాగునీటి ప్రాజెక్టు ఉండదు గనుక… లేదు గనుక…
మొదట్లో ట్రాన్స్‌ట్రాయ్… అసలు చిన్న రోడ్డు పనినీ పూర్తిచేయని ఆ దిక్కుమాలిన కంపెనీకి పనులు అప్పగించింది మొదలు… తరువాత నవయుగ… జగన్ రాగానే ఏదో పేరు చెప్పి దాన్ని తరిమేయడం… మళ్లీ చంద్రబాబు చేతుల్లోకి ప్రాజెక్టు… ఎన్నో మలుపులు… ఎన్నో రాద్ధాంతాలు…
Ads
తీరా చూస్తే… జాతీయ ప్రాజెక్టు అయినా సరే, ఇతర రాష్ట్రాల అభ్యంతరాలు, కేసులు, ఆర్ అండ్ ఆర్ ఖర్చు నేపథ్యంలో దాన్ని రెండు దశలుగా మార్చి… ప్రాజెక్టు ఎత్తును తగ్గించి, దాన్ని చివరకు ఓ బరాజ్ స్థాయికి తీసుకుపోతున్నారనే విమర్శలూ ఉన్నాయి… ఈ ప్రాజెక్టు కోసమే కదా తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో కలిపారు…
పనులపై నిర్లక్ష్యం కారణంగా… కాఫర్ డ్యాములు, డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నాయి… ఇప్పుడవన్నీ మళ్లీ దాదాపుగా పునరుద్ధరించినట్టే… ఇప్పటికి ఆరుసార్లు విదేశీ నిపుణుల టీమ్, సెంట్రల్ వాటర్ కమిషన్ నిపుణుల టీమ్ వచ్చి పనుల ప్రగతిని సందర్శించింది… వాళ్లు చెప్పేదేమిటీ అంటే..?
- పోలవరం ప్రాజెక్టును మించిన సంక్లిష్ట నిర్మాణం మరొకటి లేదు… అడుగుకోరకం నేల… ఎక్కడ ఏ ఇంజినీరింగ్ టెక్నిక్ వాడాలో జాగ్రత్తగా చూసుకోవాలి… డౌట్ వచ్చిన ప్రతిచోటా సాయిల్ టెస్ట్ చేస్తున్నారు… భూకంప ప్రభావాల్ని పరీక్షిస్తున్నారు… (సీస్మిక్ ఫ్యాక్టర్)… ఆ ఫలితాన్ని బట్టి చర్యలు అవసరం…
- ఇక్కడ “శాండ్ శాచురేషన్” (ఇసుక పొరలు) ఎక్కువగా ఉండటం వల్ల ఈసీఆర్‌ఎఫ్ (ECRF) డ్యామ్ నిర్మాణం ఒక ఇంజనీరింగ్ సవాలు…. దీని నిర్మాణంపై ఆ టీమ్స్ కొన్ని ఆందోళనల్ని వ్యక్తం చేసి, కొన్ని జాగ్రత్తల్ని కూడా చెప్పాయి…
ప్రధాన ఆందోళనలు, సాంకేతిక అంశాలు
-
నిర్మాణ నాణ్యత – తొందరపడొద్దు…: 2020 ఆగస్టులో గోదావరికి వచ్చిన భారీ వరదల (21 లక్షల క్యూసెక్కులు) వల్ల డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న విషయాన్ని నిపుణులు గుర్తుచేశారు… ఈ నేపథ్యంలో, ECRF డ్యామ్ నిర్మాణంలో నాణ్యత విషయంలో రాజీ పడొద్దని, CWC తుది ఆమోదం తెలిపే వరకు పనుల్లో తొందరపాటు వద్దని సూచించారు….
-
డిజైన్- సమన్వయం…: కన్సల్టెంట్ సంస్థ ‘AFRY’ ప్రతిపాదించిన డిజైన్లకు, CWC పరిశీలనలకు మధ్య ఉన్న సాంకేతిక వ్యత్యాసాలను నిపుణులు ఎత్తిచూపారు…. వీటిని సరిచేసి, నిర్మాణ సమగ్రతను (Structural Integrity) కాపాడాలని స్పష్టం చేశారు….
-
డయాఫ్రమ్ వాల్ సమస్యలు…: డయాఫ్రమ్ వాల్‌లో కనిపిస్తున్న “బ్లీడింగ్” సమస్యలపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు…. దీనికి కఠినమైన నివారణ చర్యలు చేపట్టాలని, సీపేజ్ (నీటి లీకేజీ)ని అరికట్టడానికి అవసరమైతే వాల్ పైభాగంలో ‘క్లే క్యాప్’ (మట్టి పొర) మందాన్ని పెంచాలని సూచించారు….
-
కాంపాక్షన్ పద్ధతి…: ECRF నమూనా విభాగాల్లో మట్టిని గట్టి పరిచే విధానం (Compaction methodology) సరిగా లేదని వారు గుర్తించారు…. దీనికి సంబంధించి పూర్తి డేటాను సమర్పించాలని కాంట్రాక్టర్ సంస్థ MEIL , నీటిపారుదల శాఖలను ఆదేశించారు….

ముఖ్యమైన సూచనలు…
-
అంతర్గత కోతను అరికట్టడం…: డ్యామ్ పునాది, కోర్, ఫిల్టర్ భాగాలు భారీ వరదలను తట్టుకునేలా ఉండాలి…. నీటి ఒత్తిడి వల్ల లోపల మట్టి కొట్టుకుపోకుండా (Piping/Internal Erosion) పటిష్టమైన రక్షణ చర్యలు తీసుకోవాలి….
-
భూకంప విశ్లేషణ…: గరిష్ట భూకంప తీవ్రతను (Maximum Credible Earthquake) తట్టుకునేలా డ్యామ్ స్థిరత్వంపై కఠినమైన విశ్లేషణ చేయాలని కోరారు…
-
డ్యామ్ ఎత్తు (Freeboard)…: వరదలు లేదా గాలి అలల వల్ల నీరు డ్యామ్ పైనుంచి ప్రవహించకుండా ఉండేందుకు, డ్యామ్ పైభాగం (Crest) వద్ద కనీసం 1.5 నుండి 2.0 మీటర్ల ‘ఫ్రీబోర్డ్’ ఉండేలా ఎత్తును పెంచాలని సూచించారు….

మొత్తం మీద పోలవరం ECRF డ్యామ్ డిజైన్లు ప్రమాణాలకు అనుగుణంగానే ఉన్నాయని నిపుణులు పేర్కొన్నప్పటికీ, పైన తెలిపిన సాంకేతిక మార్పులు, విశ్లేషణలను పరిగణనలోకి తీసుకుని, ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని స్పష్టం చేశారు… దీనివల్ల ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరగకుండా చూడవచ్చని వారు తెలిపారు….
ముందు నిర్దేశించిన 45.72 మీటర్ల ఎత్తుకే స్పిల్ వే, డ్యామ్ నిర్మిస్తారు…. కాకపోతే ఆర్అండ్ఆర్ ముంపు సమస్య దృష్ట్యా 41.15 మీటర్లకే మొదటి దశను (40- 50 టీఎంసీల నిల్వ) పరిమితం చేసి, అక్కడి వరకే నీటి నిల్వ ఉంటుంది… ఆర్అండ్ఆర్ సమస్య, ఇతర రాష్ట్రాల అభ్యంతరాలు క్లియరయ్యేకొద్దీ అసలు ఒరిజినల్ ఎత్తు అమల్లోకి తీసుకొస్తారు…
41.15 మీటర్ల ఎత్తుతోనూ గ్రావిటీతో వాటర్ ఇవ్వవచ్చు... పైగా ఎలాగూ తాడిపూడి, పుష్కరం, పట్టిసీమ లిఫ్టలున్నాయి, కృష్ణాను అనుసంధానించే కుడి ప్రధాన కాలువ ఉంది... పురుషోత్తమపట్నం లిఫ్టూ ఉంటుంది... ఎటొచ్చీ... ప్రాజెక్టు పూర్తి లక్ష్యాలైన "భారీ నిల్వ" (194 టీఎంసీలు), "విద్యుత్ ఉత్పత్తి" (960 మెగావాట్లు) నెరవేరాలంటే మాత్రం భవిష్యత్తులో 45.72 మీటర్లకు పెంచాల్సిందే... ఆర్అండ్ఆర్ ఖర్చు చూస్తే ఈ ఎత్తుతో నీటి నిల్వ అనేదే పెద్ద ప్రశ్నార్థకం...
(క్రెడిట్స్ :: ఎ.శ్రీనివాసరావు (హిందుస్తాన్ టైమ్స్)
Share this Article