.
విశాఖపట్నం, జనవరి 25… నిష్ఠురంగా ఉన్నా నిజం ఏమిటంటే… ఏపీ కూటమి ప్రభుత్వం భూముల మీద పడింది… రాజధానికి ఇంకా వేల ఎకరాల సమీకరణ, వందల ఎకరాల భూపందేరాలు మాత్రమే కాదు…
99 పైసలకు ఎకరం చొప్పున అడ్డగోలుగా లీజు పేరిట ప్రైవేటు కంపెనీలకు ధారాదత్తం చేయడం, పైగా సమర్థించుకోవడం… ఓ అరాచకం సాగుతోంది… మరీ ముఖ్యంగా నిన్నామొన్న ఏపీ పొలిటికల్, బ్యూరోక్రటిక్ సర్కిళ్లలో పెద్ద చర్చనీయాంశం ఏమిటంటే..?
Ads
బాలకృష్ణ చిన్నల్లుడు, మంత్రి నారా లోకేష్ తోడల్లుడు, గీతం యూనివర్శిటీ అధినేత, విశాఖ ఎంపీ శ్రీభరత్‌కు వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కట్టబెట్టేందుకు లేదా అక్రమ కబ్జాను క్రమబద్ధీకరించడానికి జరుగుతున్న ప్రయత్నలు విస్తుగొలుపుతున్నాయి…

నిజానికి చాలాకాలంగా గీతం భూకబ్జాలపై ఎన్నో ఆరోపణలున్నాయి… పర్టిక్యులర్‌గా 54.79 ఎకరాల ఆక్రమణ భూమిని వైసీపీ హయాంలో ప్రభుత్వ భూమిగా ప్రకటించారు… అప్పుడే ఏదైనా కార్పొరేటు కంపెనీకి అమ్మేయడమో, పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వడమో జరిగితే అయిపోయేది… కానీ జరగలేదు…
కూటమి ప్రభుత్వం రాగానే నారా, నందమూరి కుటుంబాలు పావులు కదిపాయి చకచకా… నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించారు… ఇప్పుడు విశాఖ చివరి కౌన్సిల్ సమావేశాల్లో క్రమబద్ధీకరించడానికి వీలుగా మీటింగ్ ఎజెండాలో చేర్చేశారు…

ప్రముఖ విజిల్ బ్లోయర్, 82 ఏళ్ల వయస్సులోనూ ఇప్పటికీ ప్రొ పీపుల్ యాక్టివిస్టు… మాజీ ఐఏఎస్, కేంద్ర ఇంధన శాఖ మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ దీనిపై స్పందించాడు… ఇలా అత్యంత విలువైన భూమిని గీతంకు ఇవ్వడం అంటే అది సుప్రీంకోర్టు ఆదేశాల్ని ధిక్కరించడమే అంటున్నాడు…
తక్షణమే ఆ ప్రతిపాదనను వెనక్కు తీసుకొవాలని, అందుకు బాధ్యులైన అధికారులు, ప్రజా ప్రతినిధులపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశాడు… ఈ మేరకు ఏపీ రెవెన్యూ విభాగ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్, సీసీఎస్ఏ చీఫ్ కమిషనర్ జి.జయలక్ష్మికి శర్మ లేఖలు రాశాడు…

తన లేఖలో కొన్ని ముఖ్యాంశాలు…
- వాస్తవానికి రెవెన్యూ శాఖ 2012, సెప్టెంబర్ 14న విడుదల చేసిన జీవో 517 ప్రకారం గీతం అంశం చెల్లదు…
- 2011నాటి జగపాల్ సింగ్ కేసులో స్థానిక సంస్థల పరిధిలో ఉన్న ప్రభుత్వ భూముల్ని ప్రైవేట్ సంస్థలకు కేటాయించకూడదని సుప్రీం కోర్టు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాల్నీ ఆదేశించింది…
- రుషికొండ, ఎండాడ ప్రాంతంలో ఎకరం భూమి విలువ సుమారు రూ.22 కోట్లు ఉంటుంది… అంత విలువైన భూమిని గీతంకు కేటాయిస్తే సుప్రీం కోర్టు 2-జీ స్పెక్ట్రమ్, బొగ్గు కుంభకోణం కేసుల్లో ఇచ్చిన తీర్పుల్ని అనుసరించి అధికారులు, రాజకీయ నేతలపై పీసీ యాక్ట్-1988 కింద చర్యలు తీసుకోవాల్సిందే…
- ప్రభుత్వ భూముల్ని కారు చవకగా ప్రైవేట్ ఆస్పత్రులు, విద్యా సంస్థలకు అప్పగిస్తే ఆయా సంస్థలు పేదలకు తమ సేవల్లో 25 శాతం వరకు ఉచితంగా ఇవ్వాలంటూ సుప్రీం కోర్టు కూడా పలు సందర్భాల్లో ఆదేశించింది…
- పేదలకు కేటాయించిన డీ -పట్టా భూముల్ని కూడా ఏపీ అసైన్డ్ ల్యాండ్స్ యాక్ట్- 1977ను ఉల్లంఘించి కొన్ని కంపెనీలు కొనుగోలు చేశాయి… తక్షణమే అలాంటి వాటిపై విచారణ జరిపించి ఆయా ప్రైవేట్ సంస్థలపై చర్యలు చేపట్టి, ఆ కోనుగోళ్లను రద్దు చేయాలి…
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జమిందారీ సంస్థలేమీ కావు.., ప్రజా స్వామ్య విధానాలు, చట్టాలకు లోబడే అంతా పని చేయాలి…
Share this Article