.
మరో సీరియస్ ఇష్యూలోకి వెళ్దాం… ఈమధ్య రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన ‘స్టేట్ ఫైనాన్సెస్: ఏ స్టడీ ఆఫ్ బడ్జెట్స్ 2025-26’ నివేదికలో పలు అంశాల్ని చదువుతుంటే… ఓచోట దృష్టి ఆగిపోయింది… రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా పడిపోయిన ఫర్టిలిటీ రేటు (సంతానోత్పత్తి రేటు) గురించి…
మనం ఇన్నాళ్లూ ఫర్టిలిటీ రేటు పడిపోయిన చైనా, రష్యా, జపాన్ తదితర దేశాల తీవ్ర ఆందోళనల్ని… సంతానోత్పత్తిని ప్రోత్సహించే ప్రయత్నాలను చదువుతున్నాం కదా… ఎస్, రెండు తెలుగు రాష్ట్రాల సంగతికొస్తే అవీ తూర్పు దేశాల బాటలోనే ఉన్నాయి…
Ads
ఇది లోతైన, వాస్తవికమైన పాయింట్… ఇది కేవలం సామాజిక మార్పు మాత్రమే కాదు, తెలుగు రాష్ట్రాల ‘ఎకనామిక్ ఇంజిన్- శ్రామికశక్తి- ఫర్టిలిటీ రేటు’కు సంబంధించిన అంశం… మీరొక్కసారి స్థూలంగా గమనించండి…
నిర్మాణ పనులు, మిల్లులు, ఇటుక తయారీ, మైనింగ్ మొదలుకొని అనేక లేబర్ పనుల్లో ఈరోజు బీహార్, ఒడిశా, బెంగాల్ జనం పిల్లలతోసహా వచ్చేసి చెమటోడుస్తున్నారు… నిష్ఠుర నిజం ఏమిటంటే..? వాళ్లు లేకపోతే ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల ఎకనమిక్ గ్రోత్ ఇంజన్ స్థంభించిపోతుంది… కరోనా కాలంలో సొంత ఇళ్ల బాట పట్టిన ఆ కార్మికుల వల్ల అక్షరాలా తెలుగు రాష్ట్రాలు స్థంభించిపోయాయి… (అఫ్‌కోర్స్.., కుటుంబ నియంత్రణలో మనకన్నా ముందున్న కేరళ, తమిళనాడు కూడా)…
ఆర్‌బీఐ రిపోర్ట్‌లో అత్యంత చర్చనీయాంశమైన విషయం ఇదే… చైనా, జపాన్ వంటి దేశాలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న ‘జనాభా సంక్షోభం’ (Demographic Crisis) అడుగులు ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో కూడా కనిపిస్తున్నాయి….
సగటు మనిషికి ఇది కేవలం జనాభా లెక్కల మార్పులా అనిపించవచ్చు, కానీ ఇది భవిష్యత్తులో మన ఆర్థిక వ్యవస్థను, కుటుంబ వ్యవస్థను పూర్తిగా మార్చేయబోతోంది… 2036 నాటికి తెలంగాణ రాష్ట్రంలో 60 ఏళ్లు పైబడిన వారి సంఖ్య 17.1% కి చేరుతుందని అంచనా… దీనివల్ల పెన్షన్లు, వైద్య ఖర్చుల భారం విపరీతంగా పెరుగుతుంది.
దేశవ్యాప్తంగా ఫర్టిలిటీ రేటు (TFR) ఎలా ఉంది?
జనాభా స్థిరంగా ఉండాలంటే ఒక మహిళకు సగటున 2.1 మంది పిల్లలు (Replacement Level) ఉండాలి… కానీ భారత దేశ సగటు ప్రస్తుతం 1.9 కి పడిపోయింది…. అంటే భవిష్యత్తులో మన జనాభా పెరగడం ఆగిపోయి, తగ్గడం మొదలవుతుంది… దీనికి అనేక కారణాలు… లేటు పెళ్లిళ్లు, సంతానంపై అనాసక్తి ఎట్సెట్రా…
మనవి ధనిక రాష్ట్రాలు కదా… బాగా చదివి అమెరికాకు, ఇతర రాష్ట్రాలకు జంప్… కానీ ఇన్నాళ్లూ మనం బీమార్ రాష్ట్రాలు అని వెక్కిరిస్తున్న ఒడిశా, బీహార్, బెంగాల్ జనమే మనకు అధిక సంతానోత్పత్తి, పేదరికం కారణంగా మనకు ‘వృద్ధాప్య దశలో’ ఆదుకుంటున్నారు… సొసైటీ రన్ విషయంలో…
- వివిధ రాష్ట్రాల TFR గణాంకాలు (NFHS-5 & RBI రిపోర్ట్ 2025-26)…:
తెలంగాణలో1.8ఫర్టిలిటీ రేటు... ప్రమాదకర స్థాయి...ఆంధ్రప్రదేశ్ లో 1.7 … తెలంగాణ కంటే దారుణం … కానీ బీహార్‌లో 3.0, ఉత్తర ప్రదేశ్ 2.4… దేశంలోకెల్లా అత్యల్పం సిక్కిం… 1.1 ప్రస్తుతం…
ఎందుకు ఈ ఆధారపడటం పెరుగుతోంది? తెలుగు రాష్ట్రాల్లో రెండు ప్రధాన మార్పులు జరుగుతున్నాయి…
నైపుణ్యం vs శారీరక శ్రమ…: ఇక్కడి యువత చదువుకుని వైట్ కాలర్ ఉద్యోగాల (IT, సాఫ్ట్‌వేర్, బ్యాంకింగ్) వైపు మొగ్గు చూపుతున్నారు…. దీనివల్ల వ్యవసాయం, నిర్మాణం (Construction), హ్యాండ్లూమ్స్ వంటి రంగాల్లో శారీరక శ్రమ చేసే ‘శ్రామిక శక్తి’ కొరత ఏర్పడింది….
-
జనాభా వృద్ధాప్యం…: మనం చర్చించుకున్నట్లుగా, కొత్తగా పనిలోకి వచ్చే యువత సంఖ్య తగ్గుతోంది….

‘వార్ ఆఫ్ లేబర్’ (శ్రామికుల కోసం పోటీ) ప్రస్తుతం మనకు బీహార్, ఒడిశా, బెంగాల్, జార్ఖండ్ నుంచి తక్కువ వేతనానికే కూలీలు దొరుకుతున్నారు… కానీ భవిష్యత్తులో రెండు సవాళ్లు ఎదురవుతాయి…
-
ఆ రాష్ట్రాల్లో అభివృద్ధి…: రాబోయే 10-20 ఏళ్లలో బీహార్ లేదా ఒడిశాలో పారిశ్రామికీకరణ పెరిగితే, అక్కడి కూలీలు వలస రావడం మానేస్తారు… అప్పుడు మన దగ్గర ఇళ్లు కట్టాలన్నా, పంట కోయాలన్నా మనుషులు దొరకని పరిస్థితి వస్తుంది….
-
పెరిగే ఖర్చులు…: కూలీల కొరత ఏర్పడితే, డిమాండ్ పెరిగి కూలీ రేట్లు విపరీతంగా పెరుగుతాయి… ఇది ఇళ్ల ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరగడానికి దారితీస్తుంది…
‘రివర్స్ మైగ్రేషన్’ ముప్పు… కోవిడ్ సమయంలో మనం చూశాం, ఒక్కసారిగా వలస కూలీలు వెళ్ళిపోతే ఇక్కడి పనులు ఎలా ఆగిపోయాయో… తెలుగు రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు వారిపై ఎంతగా ఆధారపడి ఉందంటే…
-
నిర్మాణ రంగం…: హైదరాబాద్ వంటి నగరాల్లో 80% పైగా కన్స్ట్రక్షన్ వర్కర్లు ఇతర రాష్ట్రాల వారే…
-
రైస్ మిల్లులు & వ్యవసాయం…: ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో హార్వెస్టింగ్ సీజన్‌లో బీహార్ కూలీలు లేనిదే పని జరగదు….
ముగింపు….: ఒకప్పుడు మనం “జనాభా ఎక్కువైపోతోంది” అని భయపడ్డాం… కానీ ఇప్పుడు “పని చేసే జనాభా తగ్గిపోతోంది” అని భయపడాల్సిన పరిస్థితి వస్తోంది…. తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు సంపాదించిన సంపదను, భవిష్యత్తులో వృద్ధుల సంరక్షణకు, మెషీన్ల కొనుగోలుకు మళ్లించాల్సి వస్తుంది….
స్టాలిన్, చంద్రబాబు వంటి నేతలు ఓ పరిమిత, సంకుచిత కోణంలోనే ఈ సమస్యను ఆలోచిస్తున్నారు… జనాభా తగ్గితే, దాని ఆధారంగా లోకసభ స్థానాలు తగ్గుతాయి, పార్లమెంటులో మన ఆధిపత్యానికి మరింత దెబ్బ అనేదే ఆ భయకారణం.., కానీ స్థూలంగా తెలుగు, తమిళ, మలయాళ సమాజానికి ఎన్ని కోణాల్లో ఇది సమస్యగా మారనుదో ఆలోచించే పరిణతి లేదు వాళ్లలో…
నాయకులు పిలుపునివ్వగానే… అర్జెంటుగా ఎవరూ పిల్లల్ని కనిపెట్టే పనిలో పడరు… ఒక్కరిని పోషించడమే కష్టమవుతున్న స్థితిలో ఎక్కువ మంది పిల్లల్ని కంటే ఈ నాయకులెవ్వరూ ఆదుకోరు… అదొక శుష్క ప్రయత్నం…
క్లుప్తంగా చెప్పాలంటే....: మనం ఇప్పుడు 'డెమోగ్రాఫిక్ డివిడెండ్' (యువత ఎక్కువగా ఉండటం) అనుభవిస్తున్నాం, కానీ ఇది మరో 10-15 ఏళ్లు మాత్రమే ఉంటుంది.... ఆ తర్వాత మనం కూడా వృద్ధుల దేశంగా మారిపోతాం.... ఇక్కడే మరొకటీ చెప్పుకోవాలి... క్షుద్ర రాజకీయాల వల్ల పొరుగు దేశాల నుంచి అక్రమంగా వలస వస్తున్న కారణంగా, డెమొగ్రఫీ ఈక్వేషన్లు మారిపోయి తలెత్తే సంక్షోభాలు అదనం... అదీ తరువాత చెప్పుకుందాం....
Share this Article