.
ఖాకీ డ్రెస్సులో కమ్మని మమకారం… దతియా పోలీస్ రైడ్‌లో వెలుగుచూసిన ఒక ‘అమ్మ’ కథ!
దతియా (మధ్యప్రదేశ్)…: పోలీసులంటే కర్కశం, లాఠీలు, కేకలు, అరెస్టులే గుర్తొస్తాయి… కానీ, మధ్యప్రదేశ్‌లోని దతియా జిల్లాలో జరిగిన ఒక సంఘటన ‘పోలీసులకూ గుండె ఉంటుంది.. అందులోనూ మాతృత్వం ఉంటుంది’ అని చాటిచెప్పింది… అది జనవరి 25, ఆదివారం… అక్రమ మద్యం స్థావరాలపై పోలీసులు మెరుపు దాడి చేస్తున్న సమయం…. అక్కడ కనిపించిన ఒక దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్ల కళ్లను చెమ్మగిల్లేలా చేస్తోంది… సోషల్ మీడియాలో వైరల్…
Ads
ఏం జరిగింది? దతియా జిల్లాలోని ఫుల్ రా కంజర్ డేరా అనే గ్రామం అక్రమ మద్యం తయారీకి పెట్టింది పేరు… ఆ రోజు భారీగా పోలీసులు గ్రామాన్ని చుట్టుముట్టారు… పోలీసులను చూడగానే నిందితులు, వారి కుటుంబ సభ్యులు దొరికిపోతామనే భయంతో పిల్లలను కూడా వదిలేసి అడవుల్లోకి పరుగులు తీశారు…
కానీ, ఒక ఇంటి టెర్రస్ మీద కేవలం మూడు నెలల పసికందు ఒంటరిగా పడి ఉంది… చుట్టూ చలి, ఆకలితో ఆ బిడ్డ గుక్కపెట్టి ఏడుస్తోంది…. పక్కనే పదేళ్ల వయసున్న మరో చిన్నారి ఏం చేయాలో తెలియక పోలీసులను చూస్తూ వణికిపోతూ నిలబడింది…
తల్లిగా మారిన అధికారిణి ఈ దృశ్యాన్ని చూసిన ఎస్‌డీఓపీ (SDOP) ఆకాంక్ష జైన్ మనసు ద్రవించింది… ఆమె తన హోదాను, డ్యూటీని పక్కన పెట్టి వెంటనే ఆ బిడ్డను అక్కున చేర్చుకుంది…
-
తన దగ్గరున్న వెచ్చని బట్టలతో ఆ చిన్నారిని కప్పింది…
-
పాలు తాగించి ఆ బిడ్డ ఆకలి తీర్చింది…
-
ఆ పసికందు హాయిగా నిద్రపోయే వరకు తన ఒడిలోనే ఉంచుకుని లాలించింది…
దాదాపు ₹30 లక్షల విలువైన ముడి పదార్థాలను పోలీసులు ధ్వంసం చేస్తున్న వేళ, ఒకవైపు లాఠీ పట్టిన చేతులే మరోవైపు ప్రాణాన్ని కాపాడటం అందరినీ ఆశ్చర్యపరిచింది… ఈ వీడియో వైరలైంది అందుకే…
‘అమ్మ ఎక్కడికో వెళ్లిపోయింది’…. ఆ ఇంట్లో పదేళ్ల చిన్నారితో పాటు 4, 5 ఏళ్ల వయసున్న మరికొందరు పిల్లలు కూడా ఉన్నారు… “నీ తల్లి ఎక్కడమ్మా?” అని ఆకాంక్ష జైన్ అడిగితే, ఆ పదేళ్ల బాలిక “పోలీసులను చూసి అమ్మ ఎక్కడికో వెళ్ళిపోయింది…” అని అమాయకంగా సమాధానమిచ్చింది….
చివరికి ఆ పసికందును సురక్షితంగా ఆ పదేళ్ల బాలికకు అప్పగిస్తూ, ఏదైనా అవసరమైతే వెంటనే పోలీసులకు ఫోన్ చేయాలని ధైర్యం చెప్పింది…

ముగింపు…. నేరం చేయడం తప్పు… కానీ నేరస్తుల పిల్లలు అనాథలు కాకూడదు అనే సందేశాన్ని ఈ ఘటన ఇచ్చింది… డ్యూటీలో కఠినంగా ఉంటూనే, కరుణలో అమ్మలా మారిన ఆకాంక్ష జైన్‌కు ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి…
అంతా బాగుంది కానీ… ఎక్కడో చిన్న తేడా… పారిపోయిన తల్లి ఎప్పుడొస్తుందో తెలియదు, అప్పటివరకెు ఆ పసికందును ఆ పిల్లలు ఎలా చూసుకోగలరు… ఆ తల్లి వదిలేసింది సరే, ఆమె లేటుగా వస్తే, ఊరికి చేరగానో పోలీసులు పట్టుకుపోతారనే భయంతో ఆలస్యంగా అడవుల్నుంచి వస్తే… అప్పటికి ఆ పసికందుకు ఏమైనా అయితే..?
సో, ఆ పోలీసమ్మ తనతో తీసుకుపోయిన, ఏదైనా హోమ్‌లో చేర్పించి... తల్లి తిరిగి వచ్చాక, కౌన్సలింగ్ ఇచ్చి, పసి బిడ్డను అప్పగిస్తే బాగుండేదేమో...!!
Share this Article