ఎప్పుడు ఏది దొరుకుతుందా అని కాచుకుని ఉంటారు రాజకీయ నాయకులు… సోకాల్డ్ మేధావులు… మీడియా… ఒక ఇష్యూ దొరికితే చాలు, ఇక మీద పడిపోతారు… ఎవరి కోణం వాళ్లది… అసలు ఇష్యూ ఎక్కడ స్టార్టయిందో, కారణం ఏమిటో మరిచిపోయి… వికృతంగా తన్నేసుకుంటుంటారు… ఎక్కడెక్కడికో తీసుకుపోతుంటారు… ఇదీ అంతే… ఢిల్లీలో ఓ హాస్పిటల్ కమ్ మెడికల్ ఎడ్యుకేషన్ కమ్ రీసెర్చ్ సెంటర్ ఉంది… జిప్‌మర్ అంటారు… ఫుల్ ఫాం ఏమిటంటే… Govind Ballabh Pant Institute of Post Graduate Medical Education and Research (GIPMER)… ఫేమస్ ఇన్‌స్టిట్యూటే… నిన్న అకస్మాత్తుగా అక్కడి నర్సింగ్ సూపర్నెంట్ ఎవరో ఓ సర్క్యులర్ జారీ చేశారు… ‘‘ఫిర్యాదులు వస్తున్నయ్… వర్కింగ్ ప్లేసులో కేరళ నర్సులు మళయాళంలో మాట్లాడుకోవద్దు, ఇక్కడెవరికీ మళయాళం రాదు, అందుకే అసౌకర్యంగా ఉంది… ఈ ఆదేశాలు పట్టించుకోకపోతే కఠినచర్యలు ఉంటాయి… హిందీ లేదా ఇంగ్లిషులో మాట్లాడండి…’’ ఇదీ దాని సారాంశం… ఓ ఇంటర్నల్ సర్క్యులర్… చూడబోతే చిన్న విషయమే… కానీ ఆ సర్క్యులర్ రాసిన తీరే మొత్తం ఇష్యూను కంపు కంపు చేసింది…
నర్సులు తమలోతాము మళయాళంలో మాట్లాడుకోకూడదా..? పేషెంట్లతో మళయాళం మాట్లాడకూడదా..? పేషెంట్ల అటెండెంట్లతో లేదా డాక్టర్లు, ఇతర సిబ్బందితో మళయాళంలో మాట్లాడకూడదా..? అసలే అసౌకర్యం ఎవరికి..? ఎందుకు..? ఆ సర్క్యులరే పెద్ద గందరగోళం… నర్సులు తమలోతాము మళయాళంలో మాట్లాడుకుంటే ఈ ప్రపంచంలో ఎవరికీ అభ్యంతరం ఉండకూడదు… అది వాళ్లిష్టం… వాళ్ల సొంత భాష… సరిగ్గా కమ్యూనికేట్ చేసుకోవడానికి మాతృభాషను మించినదేముంది..? ఒకవేళ పేషెంట్లు మళయాళీలయితే కూడా ఆ భాష వాడొచ్చు… పేషెంట్‌కూ నర్సుకూ నడుమ అది ఇంకా బెటర్ కమ్యూనికేషన్… డాక్టర్లు, ఇతర సిబ్బందితో ఎలాగూ మళయాళం మాట్లాడలేరు, ఎందుకంటే ఎదుటివాళ్లకు ఆ భాష రాదు కాబట్టి… ఒకవేళ నర్సులు ఆ పేషంట్లతోనే ‘ఎంద చేట’ అనే భాష వాడితే అది మరీ దుర్మార్గం… సో, ఆ సర్క్యులరే ఓ చెత్తా… అనవసరం… భాషతో ఇబ్బందిపడే రోగి లేదా డాక్టర్ లేదా అటెండెంట్ లేదా ఇతర సిబ్బంది వాళ్లే నేరుగా నర్సులను అడుగుతారు కదా కాస్త హిందీలోనో, ఇంగ్లిషులోనో చెప్పండమ్మా అని…! ఈమాత్రం దానికి సర్క్యులర్ అవసరమా..? ఎప్పుడైతే అది జారీ చేశారో, ఈ హాస్పిటల్‌కు అనుబంధంగా ఉండేవి, మరికొన్ని హాస్పిటళ్లలో నర్సులు కూడా ఆందోళనకు దిగారు… మీడియాకు ఓ ఇష్యూ దొరికింది… రాజకీయ నాయకులకూ ఓ ఇష్యూ దొరికింది…
Ads
ఏది దొరికినా సరే మోడీని తిట్టడానికి ప్రయత్నించడం కదా ఇప్పుడు రాహుల్ గాంధీ ధోరణి… భారతీయ భాషల్లో మళయాళం లేదా..? ఏమిటీ ఈ వివక్ష అంటూ ట్వీటాడు… అసలే కేరళ ఎంపీ కదా… ఇక శశిధరూర్ కూడా కేరళ మనిషే కదా… తనూ ఓ ట్వీట్ వదిలాడు… కానీ నిజానికి ఆ హాస్పిటల్స్ ఢిల్లీ ప్రభుత్వం పరిధిలోకి వస్తాయి… అంటే కేజ్రీవాల్ బాధ్యత… వెంటనే బీజేపీ వాళ్లు అందుకున్నారు… ఏమయ్యా, కేరళ సీఎం పినరై విజయనూ, మీ కేరళ నర్సుల పట్ల ఈ ప్రభుత్వం ఈ వివక్ష చూపిస్తే మాట్లాడవేమిటి..? అంటూ బాణాన్ని అటువైపు తిప్పారు… ఢిల్లీ మీడియా కూడా ఆడుకోవడం స్టార్ట్ చేసింది… సమయానికి సోషల్ మీడియా జనం రంగంలోకి దిగారు… ఒక భాష మీద, ఒక జాతి మీద హస్తిన పెత్తనం ఇది, సౌత్ ఇండియా మీద నార్త్ ఇండియా వివక్ష ఇది అనేంతవరకూ వెళ్లిపోయింది చర్చ… కొన్ని గంటలు గడిచి, ఇంకా ఇష్యూ ముదరకముందే అధికారులు ఆ సర్క్యులర్ ఉపసంహరించుకుంటున్నట్టుగా మరో సర్క్యులర్ జారీ చేసి, చేతులు దులిపేసుకుని సైలెన్స్‌లోకి జారిపోయారు… ఈ మొత్తం ఎపిసోడ్‌లో మళయాళం మీద కావాలని ప్రదర్శించిన వివక్ష ఏమైనా ఉందా..? లేక ఆ సర్క్యులర్ జారీలోనే అజ్ఞానం ఉందా..?!
Share this Article