జయసుధ వందల పాత్రలు పోషించింది… అందులో డ్రైవర్ రాముడు వంటి పాఁయ్ పాఁయ్ పాత్రలు ఉన్నయ్, మేఘసందేశం వంటి ఉదాత్త పాత్రలూ ఉన్నయ్… ఈరోజు ఆమె జన్మదినం… ఆమె కెరీర్ ఒకసారి స్థూలంగా అవలోకిస్తే చటుక్కున స్ఫురించేది మేఘసందేశం… ఆకులో ఆకునై అనే పాట సరే, కానీ సిగలో అవి విరులో పాట మరింత బాగుంటుంది… జయసుధ వంటి నటవిదుషీమణి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే… పోనీ, ఆ పాట గురించే చెప్పుకుందాం… ఆమె బర్త్‌డే సందర్భంగా…
ఓ పెద్దమనిషి… పదిమందికీ మంచీచెడూ చెప్పగలవాడు… ఆస్తిపాస్తులు, కుటుంబగౌరవమూ దండిగా ఉన్నవాడు… అందమైన భార్య… ఓ దొరసాని… అలాంటివాడు సైతం ఊరికి వచ్చిన ఓ సాని వలలో పడిపోతాడు… ఆమె మంచి నాట్యగత్తె… అతనిలోని కవికి మరో కళాకారిణి జతకలిసింది… అమలిన శృంగారం వంటి భావనేదో ఇద్దరినీ పిచ్చోళ్లను చేస్తుంది… చివరకు కథ ఎటెటో తిరుగుతుంది… ఎక్కడో ముగుస్తుంది… అంతేగా… స్థూలంగా చూస్తే మేఘసందేశం సినిమా అంతే… కానీ అద్భుతంగా రంజింపజేసింది ఎలా..? అక్కినేని, జగ్గయ్య, జయసుధ నటన… దాసరి కాస్త మనసుపెట్టి తీసిన సినిమా…
అన్నింటికీ మించి జయప్రద… సినిమాకు రంగురుచివాసనలను అద్దింది… ఇవేవీ కావు… రమేష్‌నాయుడి సంగీత సారథ్యం… మామూలు పాటలా అవి..? దేవులపల్లి కృష్ణశాస్త్రి నాలుగు పాటలు రాశాడు… బహుశా ఇదే తన చివరి చిత్రం కావచ్చు… మంగళంపల్లి, యేసుదాసు, బాలు గానం… ప్రియే చారుశీలే, రాధికా కృష్ణా జయదేవ గీతాలు… అసలు సినిమా చూడటం ఎందుకు..? ఆ గీతాల్ని యూట్యూబులో చూడాల్సిన పనీ లేదు… ఓ మంచి హెడ్‌సెట్ తగిలించుకుని, ఆడియో స్టార్ట్ చేస్తే… ఓ నిశిరాత్రో అవి వింటూ ఏవో లోకాలకు వెళ్లిరావచ్చు…
Ads
జాతీయ అవార్డులు కూడా కొనితెచ్చి, కళాత్మక ఉత్తమాభిరుచి కలిగిన ప్రతి ఒక్కరినీ రంజింపచేసిన ఈ సినిమా పాటల మీద నిజంగా మంచి విశ్లేషణలు పెద్దగా లేవు… నిజానికి సినిమా పాటల్ని సాహిత్యంగా పరిగణించరు ఎవరూ… కానీ ఒకటోరెండో మంచి భావపుష్టి కలిగిన పాటలు అప్పుడప్పుడూ తగుల్తుంటాయి… వాటిపై తెలుగు నెటిజనం మధ్య జరగాల్సినంత చర్చో, విమర్శో పెద్దగా కనిపించవు… వేరే భాషల్లో ఒక్కో పాట మీద కూడా విశ్లేషకులు జీవించేస్తుంటారు… ఈ మేఘసందేశంలోని ఒక పాట గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి వస్తే… అది ‘సిగలో, అవి విరులో’ పాట… దేవులపల్లి రాశాడు, యేసుదాసు పాడాడు… రాతవరకూ అదుర్స్, కృష్ణశాస్త్రి తప్ప ఇంకెవరూ రాయలేరు అన్నట్టుగానే రాశాడు…
మిఠాయిలు, పందిరిమంచం, అగరొత్తులు, పూలపక్క… ఓ శోభనం రాత్రిని అచ్చంగా కళ్లముందు కవితాత్మకంగా దించేశాడు… కొత్త పెళ్లికూతురి సిగలోని పూల దగ్గర్నుంచి… గదిలో, ఆ వరుడి మదిలో మత్తిల్లే కోరికలనూ సరళమైన పదాల్లో పొదిగి, ఏవో సోయగాల మాలికల్ని మన మెడలో వేస్తాడు ఆయన… అగరు పొగలు, అత్తరులు, విరులు, మత్తిలే కొత్త కోరికలు… చిరునవ్వుల అరవీడిన చిగురాకు పెదవుల్ని మరిగి, తుమ్మెద వంటి తన చూపులు మరలిరాను అంటున్నవట… పాట గుర్తుందా..? ఇదుగో చదవండి…
సిగలో అవి విరులో… అగరు పొగలో అత్తరులో..
మగువ సిగ్గు దొంతరలో.. మసలే వలపు తొలకరులో..
ఎదుట నా ఎదుట ఏవో సోయగాల మాలికలు
మదిలోనా గదిలోనా.. మదిలోనా గదిలోనా
మత్తిలిన కొత్త కోరికలు .. నిలువనీవు నా తలపులు…
మరీ మరీ ప్రియా… ప్రియా.. నిలువనీవు నా తలపులు
నీ కనుల ఆ పిలుపులు….
జరిగి ఇటు ఒరిగి పరవశాన ఇటులే కరిగి
చిరునవ్వుల అరవిడిన ..చిగురాకు పెదవుల మరిగి
మరలి రాలేవు నా చూపులు…
మరీ మరీ ప్రియా.. ప్రియా..
మరలి రాలేవు నా చూపులు
మధువుకై మెదలు తుమ్మెదలు
ఇది బహుశా ట్యూన్‌కు రాయబడిన పాటేమో… స్ట్రెయిట్ పాటలాగే అందంగా ఉంటుంది… కానీ పాటలోని భావాన్ని సరిగ్గా పట్టుకుని, యేసుదాసు నుంచి అదే భావవ్యక్తీకరణ వచ్చేలా రమేష్‌నాయుడు గానీ, దాసరి గానీ ప్రయత్నించలేదేమో అనిపిస్తుంది… యేసుదాసు గొంతులోని మాధుర్యం అపూర్వమే… కానీ ఇక్కడ ఈ తెలుగు పదాల విరుపు వేరు…
సిగలో అవి విరులో… అని పాడుతుంటే అవి సిగలో లేక విరులో అన్నట్టుగా ధ్వనిస్తుంది… నిజానికి ఆమె సిగలో ఉన్నవి విరులేనా లేక అగరు పొగలా, అత్తరులా అన్నట్టుగా పాడబడాలి… చాలా తేడా ఉంటుంది కదా… ప్చ్, బాలుకు లేదా బాలమురళికి ఈ పాట అప్పగిస్తే కాస్త బాగుండునేమో… ఇలాంటి పాటల్లో మాధుర్యం మరింత మత్తెక్కాలంటే ఆ భావం ప్రస్ఫుటంగా పాడుతున్నప్పుడు వ్యక్తీకరించబడాలి… ప్రత్యేకించి చిగారుకు పెదవుల మరిగి, మత్తిలిన కొత్త కోరికలు, గదిలోనా మదిలోనా వంటి పదాల దగ్గర… శృతితోపాటు గాయకుడి గొంతులో కోరిక, పారవశ్యం పలకాలి…
(ఇదే రమేష్‌నాయుడు స్వరపరిచిన ముద్దమందారంలోని అలివేణి ఆణిముత్యమా పాటను ఓసారి బాలు గొంతులో వినండి…) ఓసారి యూట్యూబులో ఈ మేఘసందేశం పాట చూస్తుంటే జస్ట్ 30 వేల వ్యూస్ కనిపించినయ్… అదీ మూడేళ్లలో… మన అభిరుచి ఇది… అదే జుమ్ము జుపా, లస్కు టపా అని ఓ పిచ్చిపాటో… అయి ఉంటే మిలియన్ల కొద్దీ ఉండేవేమో… వందల కచేరీలు చేసిన బాలు ఎక్కడా ఈ పాటను అటెంప్ట్ చేసినట్టు కనిపించలేదు… ఎందుకో మరి..? స్వరాభిషేకంలో కూడా ఓసారి మనో పాడాడు… ఒరిజినల్ పాటకన్నా బెటర్ ఇంప్రూవైజేషన్ ఉంది… కానీ సాహసించి ఎక్కువ స్వేచ్ఛ తీసుకోనట్టుంది… ఆ ఈటీవీ వారి వీడియోకు వ్యూస్ ఎన్నో తెలుసా..? జస్ట్, నాలుగు వేలు… మరి మన అభిరుచి రేంజ్ ఇది…!!
Share this Article