ఈటల విడిపోయాడు… వెళ్లిపోయాడు… అనే వార్తలు, విశ్లేషణలు వదిలేయండి ఇక… కొన్నిరోజులు మీడియాకు హడావుడి… అంతే… నాలుగు రోజులయ్యాక ఇక ఈటల గురించి మాట్లాడేవాళ్లు ఉండరు… అంతెందుకు..? బీజేపీలోని కేసీయార్ ముఖ్య స్నేహితులే క్రమేపీ ఈటల గురించి ఎవరూ మాట్లాడకుండా చేస్తారు… జనం నుంచి ఎప్పుడో దూరమైపోయిన రమణ చేయగలిగేది కూడా ఏమీలేదు… 119 నియోజకవర్గాల రాజకీయాల్లో హుజూరాబాద్ ఒకటి… కానీ ఇప్పుడు చర్చ అది కాదు… తదుపరి వికెట్ ఎవరు..? ఎందుకు..? కేటీయార్‌ను సీఎం కుర్చీ మీద కూర్చోబెట్టడానికి అన్నీ ప్రిపేర్ చేసి మరీ కేసీయార్ ఎందుకు వెనక్కి తగ్గాడు..? టీఆర్ఎస్‌లోని కుతకుతల్ని బీజేపీ, కాంగ్రెస్ వాడుకోలేని తీరు ఏమిటి..? షర్మిల పార్టీ హఠాత్తుగా తెర మీదకు రావడానికీ ఈ పరిణామాలకూ సంబంధం ఉందా..? అందుకే ‘మూతకళ్లోడు’ అని ట్విట్టర్‌లోనే షర్మిల కేసీయార్‌ను తిట్టిపోస్తున్నా గులాబీ శిబిరం నుంచి పల్లెత్తు ఎదురుదాడి జరగడం లేదా.?. తెలంగాణ మళ్లీ రాజకీయాల ప్రయోగశాలగా మారబోతోందా…?
ప్రతిపక్షాలు బలహీనంగా ఉండటం, ఆ పార్టీల్లో ఏ ముఖ్యుడు కేసీయార్ కోవర్టో తెలుసుకోలేని దురవస్థ నెలకొనడం… రీజన్స్ ఏమైనా కానీ అవి మాత్రమే టీఆర్ఎస్ బలం… కేసీయార్ ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరు ఏమిటో, ప్రజల్లో వాళ్ల పట్ల ఎంత వ్యతిరేకత పెరుగుతున్నదో కేసీయార్‌కు తెలియక కాదు… కానీ ఈ స్థితిలో ఏ అడుగు తేడాగా పడినా మొదటికే మోసం వస్తుందని తెలుసు… అనేక సర్వేలు చేయించుకుని ఎప్పటికప్పుడు లెక్కలు చూసుకుంటున్నాడు… ఆ లెక్కల్లో విధేయత అనే ప్రధాన సమీకరణం తప్పిన ఈటల మొదటి వికెట్‌గా నేలకూలింది… దొరతనం ఏదైనా సహిస్తుంది కానీ ధిక్కారాన్ని, అవిధేయత, చాటుమాటు మంతనాల్ని అస్సలు సహించదు… పైగా టీఆర్ఎస్ పక్కా కుటుంబ పార్టీ, కేసీయార్ సొంత పార్టీ, ప్రాంతీయ పార్టీ… ఆయన అనుకున్నదే అక్కడ రాజ్యాంగం… ఈ స్థితిలో డెక్కన్ క్రానికల్‌లో ఓ స్టోరీ కాస్త ఆసక్తికరంగా ఉంది…
Ads
అది ఏం చెబుతున్నదంటే..? తదుపరి వికెట్ జగదీష్ రెడ్డి… గత జనవిలో హంపీలోని ఒక రిసార్టులో తన కొడుకు బర్త్‌డే పార్టీ నిర్వహించాడు… దానికి నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతోపాటు పార్టీ ముఖ్యులు కొందరు హాజరయ్యారు… అక్కడ కేసీయార్ కుటుంబపాలన గురించి కూడా స్వేచ్ఛగా మంతనాలు చేసుకున్నారు… ఈటల పెట్టబోయే కొత్త పార్టీ మీద కూడా చర్చించారు… ఒక ఎమ్మెల్యే అయితే ఏకంగా టీఆర్ఎస్‌లో అంతర్గతంగా ఉన్న కుతకుతపై ఓ పాట కూడా పాడేశాడట అక్కడ… సదరు వీడియో కూడా కేసీయార్‌కు చేరింది… టీఆర్ఎస్ ముఖ్యుల ప్రతి కదలికపై నిఘా ఉంది ఈరోజు… ప్రతి కాల్ రికార్డవుతుంది… తనకు పూసగుచ్చినట్టు అన్ని వివరాలూ చేరిపోయాయి… ఆ పాటను జగదీష్‌రెడ్డి ఆపలేదు సరికదా సైలెంటుగా చూస్తూ కూర్చున్నాడు… కేసీయార్ దయవల్ల ఓ నామినేటెడ్ పోస్టు పొందిన ఓ మేధావి కేసీయార్ మీద ఔట్ రైట్ విమర్శలకు దిగాడట… నిజానికి బెంగుళూరులో ఇలాంటి మీటింగే ఒకటి పెట్టాడు ఈటల… ఆ వివరాలన్నీ బయటికి వచ్చాకే ఈటలతో రిలేషన్స్ పూర్తిగా దెబ్బతిన్నయ్… చివరకు కేసీయార్ కత్తితీశాడు… ఇప్పుడిక జగదీష్‌రెడ్డే టార్గెట్… తనను మంతివర్గం నుంచి తీసేయడమే కాదు, ఆయన స్థానంలో సీఎం తన సన్నిహితుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డిని తీసుకోబోతున్నాడు… జగదీష్‌రెడ్డి సీఎంను కలిసి ఏదో వివరణ ఇచ్చుకున్నాడు కానీ సీఎం కన్విన్స్ కాలేదు… కాంగ్రెస్, బీజేపీల్లోని తన ‘దోస్తుల’ ద్వారా ఎవరెవరు ఆ పార్టీలతో టచ్‌లో ఉన్నారో కూడా కేసీయార్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాడు… పార్టీని ప్రక్షాళన చేసుకునే పనిలో పడ్డాడు… అంటే ఇంకొన్ని వికెట్లు టపటపా తప్పదు…
జగదీష్‌రెడ్డి కుటుంబసభ్యుడు, ప్రస్తుతం నామినేటెడ్ పోస్టులో ఉన్న వ్యక్తి ఈమధ్య ఫేస్‌బుక్‌లో కేసీయార్ వ్యతిరేక పోస్టులు పెట్టినప్పుడే అందరిలోనూ సందేహాలు తలెత్తాయి… ఓహో, జగదీష్‌రెడ్డికీ కేసీయార్‌కూ నడుమ టరమ్స్ దెబ్బతిన్నాయా అని..? ఈ సంకేతాలు అవేనా అని…! ఇప్పుడు అసలు చర్చ ఏమిటంటే..? ఆ మంత్రితోపాటు కేసీయార్ కన్నెర్రకు గురికాబోయే ఆ ఎమ్మెల్యేలు ఎవరు..? మొత్తం పార్టీని అత్యంత విధేయంగా మార్చుకున్నాక గానీ కేటీయార్‌ను సీఎం పోస్టులో కూర్చోబెట్టడా..? అసలు తెలంగాణలో అధికారం మీద కన్నేసిన బీజేపీ పెద్దలకు ఈ విషయాలు తెలియవా..? లేక తమ పార్టీలోనే కేసీయార్ అభిమానులు ఏ అడుగులూ వేయకుండా అడ్డుపడుతున్నారా..? ఇవన్నీ తెరవెనుక చర్చలు, ఊహాగానాలు… కొన్నింటికి ఆధారాలు లేకపోవచ్చు… కానీ పొగ అయితే బాగానే లేస్తోంది… నిప్పు ఏ స్థాయిలో ఉందో తెలియాలి… అవునూ, నా బొందిలో ఊపిరి ఉన్నంతవరకూ మామ వెంటనే నేను అని ప్రకటించిన హరీష్‌రావు అసలు ఆపరేషన్స్ ఏమిటి..? హంపీ మీటింగులో పాల్గొన్న మేధావుల అసలు విధేయత శాతం ఎంతో కేసీయార్‌కు ఇప్పటికైనా తెలిసొచ్చిందా..? సో, ఈ టీడీపీ రమణ రావడం, ఈటల పోవడం కాదు… సమస్య, నిప్పు చాలా పెద్దగానే ఉన్నట్టుంది..!!
Share this Article