.
బియ్యం అంటే..? సగం దేశాలకు ప్రధాన ఆహారం… కానీ ఈమధ్య తినడమే మానేశారు, ప్రత్యేకించి ఇండియన్లు… ఎందుకు..? మన దేశం మధుమేహానికి రాజధాని కాబట్టి… మన ఆహారం కార్బోహైడ్రేట్ల సంపన్నం కాబట్టి…
నో, నో, గ్లైసీమిక్ ఇండెక్స్ తగ్గిస్తున్నాం, మా వెరయిటీ బియ్యం కొనండి, తినండి, మధుమేహం రివర్స్ అనే చెత్తా, మోసపూరిత ప్రకటనలు, ప్రచారాలు నమ్మకండి… వాడెవడో ఏదో బ్రాండ్ పేరుతో విపరీతంగా ప్రచారం చేసుకుంటున్నాడు…
Ads
నిజానికి మధుమేహం రివర్సల్ అనేది ఏదో బియ్యం రకం తినేస్తే సాధ్యమవుతుందేనేది పక్కా మోసం… జీఐ ఇండెక్స్ తగ్గితే సుగర్ స్లోగా రక్తంలోకి వస్తుంది, అంతే… అంతకుమించి ఏ ప్రయోజనమూ లేదు… ఓ చపాతీయో, ఓ జొన్న రొట్టో తిన్నట్టు… అంతేతప్ప అది రోగాన్ని రివర్స్ చేయడం ఏమిటి…? దరిద్రమైన కమర్షియల్ ప్రచారం…
చివరకు తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్శిటీ కూడా తక్కువ జీఐ ఉన్న వెరయిటీ డెవలప్ చేసింది, గుడ్… కానీ ఎవరో ప్రైవేటు వాళ్లు ఆ బ్రీడ్ తీసుకుని, ఇష్టమొచ్చినట్టుగా ‘సుగర్ రివర్సల్’ అనే ప్రచారంతో జనాన్ని మోసం చేస్తున్నారు… బహుపరాక్…
ఇదెందుకు చెప్పుకోవడం అంటే… నిన్న ఓ వార్త కనిపించింది… ఇది నిజానికి చాలా ఉపయోగకరం… ఇలాంటివే సక్సెస్ కావాలి… వుయ్ మస్ట్ వెల్‌కమ్ దెమ్….

కేరళలోని CSIR-NIIST (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇంటర్ డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ) శాస్త్రవేత్తలు రూపొందించిన ఈ బియ్యం సామాన్యుడికి వరం…
-
ప్రత్యేకత…: ఇది తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (Low GI) కలిగి ఉండి, షుగర్ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తుంది…
-
బియ్యం రకాలు…: ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న నల్ల బియ్యం (Karuppu Kavuni), ఎర్ర బియ్యం (Rakthashali) వంటి వాటిలోని పోషక గుణాలను విశ్లేషించి, ఆధునిక సాంకేతికతతో ఈ కొత్త డిజైనర్ రకాలను రూపొందించారు…
-
త్వరలోనే ఇవి టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ వంటి సంస్థల ద్వారా మార్కెట్లోకి రానున్నాయి… ఎంత మంచి వార్తో కదా…

ఇక్కడే మరో విషయం చెప్పుకోవాలి… చాన్నాళ్లుగా ప్రభుత్వం ఫోర్టిఫైడ్ రైస్ మన రేషన్ బియ్యంలో కలుపుతోంది… ఇదేమిటంటే..? ముందుగా బ్రోకెన్ రైస్ పిండి చేసి, అందులో అవసరమైన ఫోలిక్ యాసిడ్, బీ విటమిన్ ఎట్సెట్రా కలిపేసి… మళ్లీ బియ్యం గింజల్లాగా మార్చేయడం… నిజంగా ఉపయోగకరం ఇది…
అయితే మొత్తం అవే బియ్యం వండుకోలేం… క్వింటాల్ సాధారణ బియ్యంలో ఇవి కిలో చొప్పున కలుపుతారు… బియ్యం కడగకుండా ఉంటే మేలు… నిజానికి తెల్లబియ్యంకన్నా దంపుడు బియ్యం, బ్రౌన్ రైస్ వంద రెట్లు మేలు… ఫైబర్, ప్రొటీన్, మల్టీ విటమిన్లు పుష్కలం… మరీ బ్రౌన్ బాస్మతి రకాలైతే ఫ్లేవర్ ప్లస్ తక్కువ జీఐ, అంటే మధుమేహులకు బెటర్… అఫ్‌కోర్స్, మన బీపీటీ, మన మశూరి బ్రౌన్ బియ్యమైనా సరే…
ఇదే క్రమంలో గోల్డెన్ రైస్ డెవలప్ చేద్దామని దశాబ్దాలుగా ప్రయత్నిస్తున్నారు… కానీ మార్కెట్‌లోకి రావడం లేదు… ఆహారం కాదు, ఔషధం… కాదు, కాదు, ఆహారమే కాదు, ఔషధం అనే నినాదం ఇంకెంత బలపడితే అంత మేలు జనానికి… తూర్పు దేశాల్లో ఈ జన్యుమార్పిడి బియ్యం ఆమోద ప్రయత్నాలు సానుకూలంగా ఉన్నాయి గానీ ఇండియా యాక్సెప్ట్ చేయడం లేదు, అది వేరే కథ…

మన దగ్గర ఉన్న ‘సూపర్ ఫుడ్స్’ ఏవి? ఖరీదైన కొల్లాజెన్ పౌడర్లు, విదేశీ బియ్యం కొనక్కర్లేకుండానే మన ఇంట్లో అద్భుతాలు ఉన్నాయి…
-
నల్ల బియ్యం (Black Rice)…: ఇందులో ‘ఆంథోసైనిన్స్’ అనే యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి….
-
ఎర్ర బియ్యం (Red Rice)…: ఐరన్, జింక్ లోపాన్ని పోగొట్టే సహజ వరం…
-
గోల్డెన్ రైస్ (Golden Rice)…: విటమిన్-A లోపాన్ని తగ్గించడానికి రూపొందించిన ఈ బియ్యం ఇంకా ప్రయోగ దశల్లోనే ఉంది….
జపాన్ ‘కిన్‌మెమాయ్’.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బియ్యం! జపాన్‌కు చెందిన టొయో రైస్ కార్పొరేషన్ ఉత్పత్తి చేసే “కిన్‌మెమాయ్ ప్రీమియం” (Kinmemai Premium) బియ్యం కిలో ధర సుమారు రూ. 12,000 నుండి రూ. 15,000 వరకు ఉంటుంది…
-
ఇది కోషిహికారి (Koshihikari), పికామారు (Pikamaru) వంటి ఐదు రకాల మేలైన జపనీస్ బియ్యం రకాల మిశ్రమం…
-
వీటిలో ఉండే ‘లిపోపాలిశాకరైడ్స్’ (LPS) రోగనిరోధక శక్తిని పెంచి, చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయని వారు క్లెయిమ్ చేస్తున్నారు…

ముగింపు….. ఆరోగ్యం అనేది డబ్బాలో దొరికే పౌడర్ కాదు, అది మనం రోజూ తీసుకునే సంప్రదాయ ఆహారం, జీవనశైలిలో ఉంది…. పౌడర్ల ద్వారా 10 ఏళ్లు వెనక్కి వెళ్తామన్న భ్రమలో కాకుండా, ప్రకృతి ఇచ్చిన పోషకాలను నమ్ముదాం… అన్నింటికీ మించి బలవర్ధక, పౌష్టిక విలువల కొత్త బియ్యం రాబోతున్నయ్, అవీ ఆహ్వానిద్దాం… అడ్డమైన సోషల్ మీడియా మార్కెటింగ్ రీల్స్ కాదు..!
Share this Article
