కమెడియన్ అయినా నటుడే… తను చేసేది నటనే… కామెడీ పాత్ర బదులు మరో డిఫరెంటు పాత్ర దొరికినా దానికి న్యాయం చేయడానికే కష్టపడతాడు… కానీ చాలాసార్లు కమెడియన్‌గా చూసీ చూసీ… తనను చూడగానే కామెడీయే గుర్తొస్తూ… తను వేరే పాత్రల్లోకి పరకాయప్రవేశం చేయడానికి ప్రయత్నిస్తున్నా ప్రేక్షకులు అంత త్వరగా స్విచ్ ఓవర్ అయిపోరు… అడ్జస్ట్ కారు… ఆ తేడా కొట్టేసి, కొత్త పాత్రలు చీదేస్తాయి.,, హీరో సునీల్ ఫెయిల్యూర్‌కు కారణం అదే… సునీల్ అంటే పడీ పడీ నవ్వే కామెడీ… ఓ మామూలు హీరోలా గెంతులేస్తూ, ఫైటింగులు చేస్తూ, పంచ్ డైలాగులు వేస్తూ, భీకరమైన ప్రతీకారం, పగల్ని ప్రదర్శిస్తుంటే చూడలేకపోయాం… సునీలే కాదు, ఏ కమెడియన్కైనా ఇదే పరిస్థితి… ఇక్కడ ప్రతిభతో సంబంధం లేదు, మనం అలా ఆ వ్యక్తి పట్ల కండిషనింగ్ అయిపోవడం వల్ల వచ్చే తిప్పలు… సేమ్, అల్లరి నరేష్…
కామెడీ హీరోగా చేసీ చేసీ… నరేష్ అంటే ఇలా ఉంటాడు అని ఫిక్సయిపోయాం… అప్పుడెప్పుడో గమ్యంలో ఓ పాత్ర… అది తప్ప తను చేసినవన్నీ తన మార్క్ సినిమాలే… కానీ అది మొనాటనీ అయిపోయింది… అయితే ఆ కామెడీలోనే కొత్త ప్రయోగాల వైపు వెళ్లకుండా… మామూలు హీరో పాత్రల వైపు చూడసాగాడు, తన ఉద్దేశం మంచిదే… కామెడీ ముద్రను చెరిపేసుకుని, అవసరమైతే సెకండ్ లీడ్ పాత్రలయినా సరే అనుకున్నాడు… మహర్షిలో పాత్ర అలాంటిదే… గమ్యం, మహర్షి సినిమాల్లో తను హీరో కాదు… కాబట్టి ఫరక్ పడలేదు… కానీ నాంది సినిమాకొచ్చేసరికి తను హీరో… తనే ఓ భిన్న పాత్రలో సినిమాను మోయాలి… రకరకాల ఉద్వేగాలతో తన పాత కామెడీ ముద్రను తుడిపేయాలి… కష్టమే… అవును, బాగానే కష్టపడ్డాడు గానీ ఫలించలేదు…
Ads
థియేటర్ టాక్ బాగానే వచ్చింది, రివ్యూయర్లు భేష్ అన్నారు… కానీ నిజమేనా..? కావాలనే ఆ పాత్ర పట్ల ప్రేక్షకుల్లో మరింత జాలి, చిక్కనైన సానుభూతి గట్రా కలగాలని బరిబాతల కూర్చోబెట్టారు, కోదండం ఎక్కించారు, రక్తాలు కార్పించారు… కానీ కనెక్టయిందా..? లేదు… అనుకున్నంతగా జరగలేదు… కారణం, సేమ్… ఇలాంటి పాత్రలు చేయడానికి బోలెడు మంది ఉన్నారు, నరేషే ఎందుకు..? ఈ ఫీల్… ఇక్కడ తను కష్టపడ్డాడా లేదా అనేది కాదు ప్రధానం, ఆ కష్టాన్ని ప్రేక్షకులు రిసీవ్ చేసుకున్నారా లేదా, యాక్సెప్ట్ చేశారా లేదానేదే ముఖ్యం… వసూళ్లు నిజంగానే గల్లాపెట్టెను నింపాయో లేదో తెలియదు గానీ, ప్రేక్షకులు ఆ సినిమాను పెద్దగా ఇష్టపడలేదు అని చెప్పడానికి ఓ బేస్ ఉంది… అది టీవీ రేటింగ్… నిజంగా సినిమాను ప్రేక్షకులు ఇష్టపడి ఉంటే, దానిపై మంచి హైప్ గనుక క్రియేటై ఉంటే, మౌత్ టాక్ బాగా జరిగి ఉంటే టీవీలో మంచి రేటింగ్ వచ్చి ఉండాలి… ఎందుకంటే కరోనా కాలంలో జనం ఇళ్లు కదలడం లేదు, అయితే ఓటీటీ లేదంటే టీవీ…
కానీ ఈ సినిమాకు వచ్చిన రేటింగ్ జస్ట్, 4.7 మాత్రమే… (హైదరాబాద్ బార్క్)… తెలుగు రేటింగ్స్‌కు సంబంధించి ఇది చాలా దయనీయమైన నంబర్… నిజానికి సినిమాలో ఓ మంచి పాయింట్ మీద కథ అల్లుకోబడింది… అక్రమంగా, అన్యాయంగా నిర్బంధిస్తే దానిపైన కూడా పోరాడే 211 సెక్షన్ చుట్టూ రాసుకున్న కథ… సినిమాలో వల్గారిటీ లేదు, ప్లెయిన్‌గా ఉంది… కానీ కావాలని హీరో పాత్ర స్ట్రెంత్ పెంచడానికి నానా పాట్లూ పడ్డారు… ఇది సరిపోదు అనుకుని ఫైట్లు పెట్టారు, కత్తిపోట్లతో కూడా తప్పించుకోవడం గట్రా… ఓ ఫార్ములా హీరోకు కావల్సిన సినిమాటిక్ తిప్పలు… నవమియో, దశమియో ఆ హీరోయిన్… లుక్కు బాగుంది, కానీ ఆమెకు కథలో ఏ విలువా లేదు… ఉన్నదల్లా ఆ కథలోని కొత్త పాయింట్ ప్లస్ ఈ సినిమాను నిజంగా భుజాల మీద మోసిన వరలక్ష్మి… నటనలో ఆమె గ్రేస్ సూపర్… సినిమాను ఒంటి చేత్తో ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నించింది… కానీ అదొక్కటే సరిపోదు కదా, అవును, సరిపోలేదు… పైగా పాటలు గట్రా వీక్… అందుకే టీవీల్లో ఈ వీక్ రేటింగ్స్… అల్లరి నరేష్ ఉద్దేశపూర్వకంగా మరో దారిలోకి తన కెరీర్‌ను లాక్కెళ్లాలని అనుకోవడం కరెక్టు కాదేమో… నరేషూ, ఓసారి జాతిరత్నాలు చూడరాదూ…!!
Share this Article