తెలంగాణలో ఓ టీఆర్ఎస్ ఎంపీని తీసుకొండి,.. ఆయన గారి నియోజకవర్గంలో శాంపిల్‌గా ఓ వెయ్యి మందిని తీసుకొండి… ఈయన ఫోటోను చూపించి, ఈయన ఎవరో తెలుసా.?. పేరు తెలుసా..? అనడిగి చూడండి… అందరూ గుర్తుపడతారా..? ఈ డౌట్ ఎప్పుడైనా వచ్చిందా మీకు..? పోనీ, ఏపీలో వైసీపీ ఎంపీని తీసుకొండి… ఇలాగే అడగండి… అరె, వీళ్లు కాదు, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ ఎంపీలైనా సరే… తమ నియోజకవర్గాల్లోనే వాళ్లను ఎందరు వోటర్లు సరిగ్గా గుర్తుపడతారు..? ఇప్పుడీ ప్రశ్న ఎందుకొచ్చిందీ అంటే, దీనికీ ఓ కథ ఉంది… బెంగాల్ ఎన్నికల ముందు సువేందు అధికారిని, ముకుల్ రాయిని, రప్పను గట్రా బీజేపీ తన క్యాంపులోకి లాగేసుకుంది కదా… ప్రతి రాష్ట్రంలోనూ అలా చేస్తూ ఉంటుంది… ముఖ్య నేతల్ని లాగేస్తే, భారీగా వోట్లు ఇటు టర్న్ అవుతాయని కాదు,.. ప్రత్యర్థి శిబిరంలో అన్రెస్ట్, డిస్టర్బెన్స్ క్రియేట్ చేయవచ్చునని ఆశ… అలాగే యూపీ రాబోయే ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని జితిన్ ప్రసాదను బీజేపీ లాగేసింది… అసలే ఎఐసీసీ పరిస్థితిగతులు ఏమీ బాగాలేవు… వీళ్లు రమ్మంటున్నారు… పోతేపోలా అనుకుని వెళ్లిపోయాడు, నడ్డాను కలిశాడు, కాషాయం కండువా కప్పేసుకున్నాడు… అయిపోయింది…
ఇంకేముందీ… ప్రతి పత్రిక, ప్రతి టీవీ, ప్రతి సైటూ ఎడాపెడా చెడామడా రాసేశాయి… కాంగ్రెస్‌కు షాక్, షాక్… యూపీలో కాంగ్రెస్ పని అయిపోయినట్టే… అంటూ బోలెడు బ్రేకింగు వార్తలు, కథనాలు, విశ్లేషణలు గట్రా…! (నిజానికి మీడియా అంటే అలా… ముకుల్ రాయ్ బీజేపీ నుంచి మళ్లీ టీఎంసీలోకి పోగానే… బీజేపీకి బీటలు అని రాస్తోంది…) ఇదంతా గమనిస్తున్న ది వైర్ అనే మోడీ వ్యతిరేక సైటుకు చిర్రెత్తుకొచ్చింది… అబ్బో, జితిన్ ప్రసాదకు యూపీలో అంత సీనుందా..? అనుకుని, బోలెడు ఆలోచించీ, చించీ… ప్రశ్నం అనబడే ఓ సర్వే సంస్థను పిలిచారు… ఇవి రెండూ కలిసి ఉద్దేశపూర్వక ఉమ్మడి సర్వేలు, కథనాల్ని కాస్త జాగ్రత్తగా వండుతుంటాయి… ఏం చేశారంటే..? ఇదే జితిన్ ప్రసాద తను పోటీచేసే నియోజకవర్గాల్లో ఎందరికి తెలుసో సర్వే చేద్దాం, ఆ వివరాల్నే పబ్లిష్ చేద్దాం, దీంతో ఆయన అసలు సత్తా ఇదీ అని బట్టలిప్పేసినట్టు అవుతుందని ప్లాన్… అలాగే ఆయన బీజేపీలోకి పోవడాన్ని ఎందరు ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారో కూడా చెప్పాలని ఆలోచన…
Ads
జితిన్ యూపీలో రెండుసార్లు ఎంపీగా గెలిచాడు… 2004లో షాజహాన్‌పూర్ నుంచి… 2009లో ధౌరారా నుంచి… తరువాత 2014లో, 2019లో అక్కడి నుంచే ఓడిపోయాడు… 2017లో అసెంబ్లీకి కూడా పోటీచేశాడు… సో, ఈ ప్రశ్నం సంస్థ షాజహాన్‌పూర్, ధౌరారా ఎంపీ నియోజకవర్గాల్లోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ కలిపి 1500 మంది వోటర్లను తీసుకుంది… వృత్తి, వయస్సు, లింగం, ప్రాంతం, చదువు గట్రా అంతా శాస్త్రీయమైన మిక్స్… మొదటి ప్రశ్న ఏంటంటే..? మీకు జితిన్ ప్రసాద తెలుసా..? తెలుసు అంటే, తను బీజేపీలోకి వెళ్లడం సరైన పనేనా అనేది రెండో ప్రశ్న… ఆ ఫలితాలు చూసి వాళ్లే కిందపడిపోయారట… ఆ ఫలితాల రఫ్ వివరాలకు ఇదీ లింక్…
ది వైర్, ప్రశ్నం చెప్పే వివరాల ప్రకారం… 72 శాతం మంది అసలు జితిన్ ప్రసాదను ఓ రాజకీయ నాయకుడిగా గుర్తించలేదట… కొందరు సినిమా నటుడని, మరికొందరు ఎవరో వ్యాపారి అనీ చెప్పారట… ఆయన్ని గుర్తించిన మిగిలినవారిలో సగం మంది (52 శాతం) ఆయన బీజేపీలోకి పోవడం సరైన పని కాదూ అన్నారట… అబ్బే, ఇది పక్కా ప్లాంటెడ్ సర్వే, ప్లాంటెడ్ స్టోరీ అంటారా..? ఏమో… నిజంగా మన ఎంపీల గురించి మన ప్రజలకు తెలుసా..? పేర్లు, మొహాలు గుర్తుపట్టగలరా..? అసలు గెలిచాక నియోజకవర్గాల మొహం చూసినవాళ్లు ఎందరు..? తమ మొహాలు మళ్లీ ప్రజలకు చూపించినవాళ్లు ఎందరు..? ఈ కరోనా పీడదినాల్లో మన జనానికి అందుబాటులో ఉండి, చేతనైనంత సేవ చేద్దామనే సోయి ఉన్నవాళ్లెందరు..? నగరాల్లో, ఏసీ రూముల్లో కూర్చుని కథనాల్ని, కథల్ని అల్లే మీడియాకు, పనికిమాలిన టీవీ డిబేట్లతో తన్నుకునే ప్యానలిస్టులకు అసలు క్షేత్ర స్థాయిలో ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుస్తోందా..? ఈ ప్రశ్నలు ఎప్పుడూ ఉండేవే, నిఖార్సయిన మీడియా ప్రతినిధులు, రాజకీయ ప్రతినిధులు ఇలాంటివి పట్టించుకోరు అంటారా..? అవున్లెండి, అదే నిజమనిపిస్తోంది…!!
Share this Article