సుప్రీం చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తిరుమల పర్యటన… సహజంగానే డాలర్ శేషాద్రి విశేష అతిథి వెంట ఉండి దర్శనాలు, ఏకాంతసేవలు, తీర్థప్రసాదాలు, ఆశీర్వచనాలు గట్రా ఏ అపశృతీ లేకుండా చూసుకున్నాడు… అధికారులు కూడా ప్రొటోకాల్ మర్యాదలన్నీ పద్దతిగా, బుద్దిగా, శ్రద్ధగా పాటించారు… కానీ ఒక ఫోటో కాస్త ఆసక్తిగా అనిపించింది… మంచిగనిపించింది… గుడిలోనే ఓచోట టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి, సీజే రమణ కూర్చుని ఏవో కబుర్లలో పడ్డారు… ఆయన విశేష అతిథి, వాళ్లు ప్రొటోకాల్ ప్రకారం వ్యవహరించాల్సిన ధర్మకర్తలు… పైపైన చూస్తే పెద్ద విశేషం అనిపించదు… కానీ ఆయన పట్ల వైసీపీ, ఏపీ ప్రభుత్వ గత వైఖరి గుర్తొస్తే ఈ ఫోటో విశేషంగా కనిపించింది… ఇక ఈ ఘన స్వాగతాలు, హైదరాబాదులో కూడా కేటీయార్ వెంట మంత్రుల స్వాగతాలు, రాజభవన్‌కు వెళ్లి మరీ సీఎం, గవర్నర్ మర్యాదపూర్వక శుభాకాంక్షలు… వాహ్… సీజేకు అభినందనలు… చాలా ఏళ్ల తరువాత సుప్రీం కోర్టు చీఫ్‌గా ఓ తెలుగువాడు నియమితులు కావడం… తొలిసారి ఆ హోదాలో వచ్చినప్పుడు ఇంత ఘనస్వాగతం దక్కడం… బాగుంది…
మన తెలుగువాడు ఓ మంచి పోస్టు పొందాడు, గౌరవిద్దాం అనే సద్భావన మాట ఎలా ఉన్నా… ఏమో, రేప్పొద్దున ఆయనతో ఏమైనా అవసరం పడుతుందేమో అనే భావన కూడా కాస్త కనిపించింది… అది కూడా తప్పేమీ కాదు… కానీ ఈ రెండురోజుల పర్యటన చూశాక బలంగా అనిపించేది ఏమిటంటే..? మనకు ఏదైనా మంచి అనే ప్రాప్తం ఉంటే, ఎవడూ అడ్డుపడలేడు… చెడగొట్టలేడు… ఆపలేడు… అఫ్ కోర్స్, నష్టపోయే డెస్టినీ ఉంటే కూడా ఎవరూ ఆపలేరు… ఓ మామూలు లాయర్ స్థితి నుంచి సుప్రీంకోర్టు జడ్జి దాకా ప్రస్థానం వేరు… జడ్జి నుంచి చీఫ్ జస్టిస్ వరకు ప్రయాణం వేరు… రమణ సీజే గాకుండా చాలా ప్రయత్నాలు ఎలా జరిగాయో మళ్లీ మళ్లీ ఇక్కడ చెప్పుకోవడం అనవసరం… అందరూ చూసిందే, విన్నదే, చదివిందే… కానీ అంతిమంగా ఏం జరిగింది..? ఆ పోస్టు తనకు రాసిపెట్టి ఉంది… అన్ని అడ్డుపుల్లలూ ఎగిరిపోయాయ్… తను తలెత్తుకుని, తెలుగు సీజేగా స్వరాష్ట్రాల తొలి పర్యటనకు వచ్చాడు… నిజానికి ప్రొటోకాల్ వరుసల్లో తనది ఆరో వరుస… ఐతేనేం, భారీ స్థాయిలోనే అధికారిక మర్యాదలు, ప్రొటోకాల్ గౌరవాలు దక్కాయి… ఇదీ తప్పేమీ కాదు… ఎవరికీ అభ్యంతరాలు ఉండాల్సిన అవసరమూ లేదు…
Ads
నిజానికి టీటీడీ వంటి ధార్మిక, ఆధ్యాత్మిక సంస్థలు ఇదే అధికారిక ప్రొటోకాల్ ఖచ్చితంగా పాటించాలని ఏమీ ఉండదు… కానీ పాటిస్తారు… ఎప్పుడైనా సరే, ఫస్ట్ ప్రయారిటీ రాష్ట్రపతిదే… ఈ సర్వసత్తాక సార్వభౌమ దేశానికి టెక్నికల్‌గా తనే రాజు, తనే చక్రవర్తి… తనే ప్రథమ పౌరుడు… తరువాత ఉపరాష్ట్రపతి… మూడో వరుసలో ప్రధాన మంత్రి… కాగితాలపై ఈ ప్రొటోకాల్ ప్రయారిటీలు ఎలా రాసుకున్నా సరే, సాక్షాత్తూ ప్రధాని వస్తున్నాడంటే ఉండే హల్చల్ వేరు… ఆ రేంజ్ వేరు… ఇక నాలుగో వరుసలో ఆయా రాష్ట్రాలకు సంబంధించిన గవర్నర్లు… సో, తిరుమలకు సంబంధించి ఏపీ గవర్నర్‌కు దక్కే ప్రయారిటీ కూడా తక్కువేమీ కాదు…
గతంలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ తిరుమలలో చెలాయించిన తీరు చూశాం కదా… అయిదో వరుసలో మాజీ రాష్ట్రపతులు… అదే వరుసలో ఉపప్రధాని ఉండాలి, కానీ ఇప్పుడెవరూ ఆ పోస్టులో లేరు… ఆరో వరుసలో సుప్రీం చీఫ్ జస్టిస్, లోకసభ స్పీకర్… వీళ్లందరి తరువాతే కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, మాజీ ప్రధానులు, ప్రతిపక్ష నేతలు… సుప్రీం చీఫ్ జస్టిస్ రమణకు అభినందనలు… ఈ గౌరవాన్ని ఈ పదవీకాలంలో మరింత పెంచుకోవాలని ఆకాంక్ష..!! కేసీయార్ వెళ్లి ఆయనకు శుభాకాంక్షలు చెప్పాడు కదా.., మరి తన రాష్ట్రానికి వచ్చిన సీజేను అభినందించడానికి ఏపీ సీఎం వెళ్లలేదా..? మంత్రులు వెళ్ళలేదా..? ఒకరిద్దరు సీనియర్ మంత్రులు వెళ్లి అభినందిస్తే బాగుండేది కదా అనేవి అప్రస్తుతమైన ప్రశ్నలు… దానికి జవాబులు అందరికీ తెలుసు కాబట్టి…! ఐనా సీఎం గారు ఢిల్లీలో ఉన్నారు లెండి…!!
Share this Article