పార్టీలు ఫిరాయించడం మీద… ఎప్పుడూ ప్రతి రాష్ట్రంలోనూ ఏదో చర్చ నడుస్తూనే ఉంటుంది కదా… సిద్ధాంతాలు, రాద్ధాంతాలు జాన్తానై… ఫ్యూడల్, కుటుంబ పార్టీలే కాదు, చివరకు కరడుగట్టిన లెఫ్ట్, రైట్ నేతలు సైతం ‘జంపర్ల’ జాబితాల్లో కనిపిస్తున్న కాలమిది… ఆ బెంగాలీ ముకుల్ రాయ్ చూడండి, బీజేపీలోకి వెళ్లాడు, అది అధికారంలోకి రాలేదు, మమత బ్యాటింగ్ మీద భయమేసింది… అక్కోయ్, నువ్వే దిక్కు అంటూ పోయి కాళ్ల మీద పడ్డాడు… ఎందుకు పార్టీ వదిలేసినట్టు..? మళ్లీ ఎందుకొచ్చినట్టు..? ముకుల్ రాయ్ వంటి బిగ్‌షాట్‌లే క్యాంపులు మార్చేస్తున్న రోజులు, తెలుగు రాష్ట్రాల్లో ఈ జంపింగ్ జపాంగు కథలకు కొదవే లేదు… వాటికి ఆయా పార్టీల అధినేతల దిక్కుమాలిన సమర్థనలు సరేసరి… ఇప్పుడు ఈటల రాజీనామా తరువాత తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీల నుంచి టీఆర్ఎస్లో చేరిన 12 మంది ఎమ్మెల్యేల యవ్వారం మళ్లీ చర్చల్లోకి వస్తోంది… జంపింగులకు సంబంధించి తాజాగా యూపీలో ఒకాయనది క్లాసిక్ కేసు… ఈ రికార్డు ఎవరికీ లేదేమో బహుశా…
- షాహిద్ సిద్దిఖి… వయస్సు 71 సంవత్సరాలు… ఢిల్లీ నుంచి పబ్లిషయ్యే నయీ దునియా అనే ఓ ఉర్దూ వీక్లీకి చీఫ్ ఎడిటర్… 1997లో… అంటే 24 ఏళ్ల క్రితం… కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ చీఫ్‌గా పొలిటికల్ కెరీర్ స్టార్ట్ చేశాడు… తరువాత సమాజ్‌వాదీ పార్టీలో చేరాడు, 2002లో పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి కూడా అయ్యాడు… అంతేకాదు, 2002 నుంచి 2008 వరకు ఎస్పీ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడు కూడా… 2008లో తన టరమ్ పూర్తయ్యేవరకూ ఆగి, ఆగి, అది అయిపోగానే, ఎస్పీ పార్టీకి గుడ్ బై చెప్పేసి బహుజన సమాజ్ పార్టీలో చేరాడు… సో, కాంగ్రెస్ నుంచి ఎస్పీ… ఎస్పీ నుంచి బీఎస్పీ…
- ఏమైందో ఏమో గానీ… 2009లోనే… అంటే ఏడాదిలోనే బీఎస్పీ నుంచి మాయావతి తనను గెంటేసింది… ఏదో నేషనల్ ఇంగ్లిషు డెయిలీతో మాట్లాడుతూ మాయావతి మీద వ్యతిరేక వ్యాఖ్యలు చేశాడు… ఆ ఇంటర్వ్యూ కనిపించిన కొన్ని గంటల్లోనే ఆమె పార్టీ నుంచి బయటికి నెట్టేసింది…
- ఏం చేద్దామబ్బా అని ఆలోచించీ, చించీ రాష్ట్రీయ లోక్‌దళ్ పార్టీలో చేరాడు 2010లో… అదేనండీ అజిత్ సింగ్ పార్టీ… ఎందుకు చేరావయ్యా అనడిగితే, అజిత్ సింగ్ హరిత ప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తున్నాడు కదా, అది నచ్చి ఆ పార్టీలో చేరాను అన్నాడు సిద్దిఖి…
- 2012… ఇదే ఆర్ఎల్డి పార్టీ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడాన్ని వ్యతిరేకిస్తూ… ఆర్ఎల్డి నుంచి బయటికి వచ్చేశాడు… మళ్లీ ఎస్పీలో చేరాడు…
- 2012 ఎన్నికల్లో మంచి మెజారిటీ సాధించిన ఎస్పీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది… కానీ అదే సంవత్సరం సిద్దిఖిని పార్టీ నుంచి బయటికి వెళ్లగొట్టేశాడు అఖిలేష్ యాదవ్… ఎందుకో తెలుసా..? సిద్దిఖి తన ఉర్దూ వీక్లీలో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఇంటర్వ్యూను పబ్లిష్ చేశాడు… ఆరు పేజీల ఇంటర్వ్యూ అది… అది ఎస్పీ హైకమాండ్‌కు నచ్చలేదు, బయటికి నడువ్ అన్నారు…
- ఆ తరువాత ఈ రాజకీయాలు మానేసి, తన జర్నలిజం మీద, ప్రత్యేకించి సోషల్ మీడియా మీద కాన్సంట్రేట్ చేశాడు… రాజకీయ నాయకుడు రాజకీయాల నుంచి దూరం కావడం అంత వీజీ కాదు తెలుసు కదా… మళ్లీ ఆర్ఎల్డీ మీద పడింది కన్ను… ఆ పార్టీ అధ్యక్షుడు జయంత్ చౌదరిని ఎలాగోలా బుట్టలో వేసుకుని, ఆ పార్టీలో తాజాగా చేరిపోయాడు… పైన మీరు చూసిన ఫోటో అదే… ‘నేను రైతుల కోసం పోరాడటానికి ఈ పార్టీలో చేరాను’ అంటున్నాడు…
- మొత్తానికి తన 24 ఏళ్ల పొలిటికల్ కెరీర్లో ఎస్పీలో రెండుసార్లు చేరాడు, ఆర్ఎల్డీలో రెండుసార్లు చేరాడు… బీజేపీ మినహా యూపీలోని ప్రతి ప్రధాన పార్టీలోకి వెళ్లి వచ్చాడు సిద్దిఖి… మళ్లీ ఆర్ఎల్డీని వదిలేయాల్సి వస్తే ఎలా..? అప్పుడు బహుశా కాంగ్రెస్‌లో చేరొచ్చునేమో… పాతికేళ్ల క్రితం ఎక్కడ ప్రారంభమైందో తన కెరీర్… ఓ పూర్తి వలయం తిరిగీ తిరిగీ అక్కడికే తిరిగి చేరుకుంటుంది… ఏమో, అదీ జరగొచ్చునేమో…!!
Share this Article
Ads