మనం తిడుతూనే ఉంటాం… డగ్ర పాలసీలు, టీకా పాలసీలు చేతకాని మోడీ దగ్గర నుంచి… లాక్డౌన్లు సరిగ్గా అమలు చేయలేని కేసీయార్ దాకా… హాస్పిటళ్లను తిడుతున్నాం… మందుల దుకాణం వాళ్లను తిడుతున్నాం… చైనా వాడిని తిడుతున్నాం… ప్రపంచ ఆరోగ్య సంస్థనూ తిడుతున్నాం… అసలు మనం తిట్టనివాళ్లెవరు..? ఒకవైపు పీనుగులు లేస్తూనే ఉన్నాయి కుప్పలుతెప్పలుగా… మనం మాత్రం మారం… మారబోం… మారలేం… అసలు దరిద్రమంతా మన బుర్రల్లోనే ఉంటే… ఎవడెవడినో తిట్టిపోయడం దేనికి..? ఒరేయ్, చస్తార్రా అని చెబుతున్నా సరే, సరిగ్గా ముక్కుబట్ట కూడా కట్టలేకపోతున్నాం… ధూంధాం పెళ్లిళ్లూ జరుగుతున్నయ్, గెట్టుగెదర్లు సాగుతూనే ఉన్నయ్… అంతెందుకు..? ఫామ్‌హౌజుల్లో రేవ్ తరహా పార్టీలు కూడా సాగుతున్నయ్… ప్రభుత్వాలను ఎందుకురా తిట్టడం..? ఇదొక్కసారి చదవండి…
హైదరాబాద్‌లో సాఫ్ట్వేరుడు అట… చదువు జ్ఞానాన్ని, కొలువు అణకువ, డబ్బు ఓ పద్ధతినీ నేర్పించాలని ఏముంది..? లేదు కదా… పైగా చుట్టూ ఉన్న వాళ్లకు కూడా అవే బుర్రలు కదా… వోటి బుర్రలు… ఛలో బర్త్‌డే పార్టీ అన్నాడు… అందరినీ రమ్మన్నాడు… కడ్తాల దగ్గర ఓ ఫామ్‌హౌజ్… లొకేషన్ పెట్టాడు అందరికీ… అందరూ కార్లున్న దొరలే కదా… టైమ్‌కు దిగిపోయారు… డీజేలు, మందులు, విందులు, డాన్సులు… అన్నీ… పౌడర్లు, డోసులు గట్రా మనకు తెలియదు… దాదాపు 90 మంది వరకూ… అరె, ఎవడైనా చచ్చిపోతేనే 20 మందికి మించి అంత్యక్రియలకు అనుమతించడం లేదు… పెళ్లంటే గరిష్ఠంగా 50 మంది… వోకే, వోకే, ఆరోగ్యాన్ని రేవెట్టేసుకునే పార్టీ కదా… ఎందరైనా పర్లేదు… పార్టీ మాంచి ఊపులో ఉండగా పోలీసులు వచ్చిపడ్డారు… పార్టీ ఇస్తున్నవాడు, మరికొందరు పరార్… మిగతావాళ్లు బుక్కయిపోయారు… ఇదీ ఆ వార్త…
Ads
మూతిబట్టలు కట్టుకున్నాం కదా, టీకాలు పొడిపించుకున్నాం కదా, ఇంకేముంది అనే భ్రమల్లో, అపోహల్లో, అజ్ఙానంలోనే పడి బతుకుతున్నారు… అదీ మన యువజనం, విద్యాజనం, ధనికజనం… నిజానికి ఇలాంటివి ఒక వ్యక్తి కోణంలోనో, ఒక సమూహం కోణంలోనో చూడొద్దు… సమాజానికే థ్రెట్స్ ఇవి… ఐనా వినేవాడెవ్వడు..? కరోనా ఎన్నాళ్లుంటుందో తెలియదు, అంటే ఇక జీవితం ఆగిపోవాలా..? మనకు మనమే బందీలం అయిపోవాలా అనేది వీళ్ల ప్రశ్న… పకపకా నవ్వుతూ కరోనా కొత్త కొత్త రంగులతో, కొత్త కొత్త రూపాల్ని సంతరించుకుంటూ, మ్యుటేట్ అవుతూ, స్పైకులకు పదును పెట్టుకుంటూ మీద పడుతూనే ఉంది… హాస్పిటళ్ల ప్యాకేజీలు, ఆక్సిజన్ మాస్కులు పెట్టుకుని మరీ రారమ్మంటూ మరింత బాగా నవ్వుతూ మనల్ని ఆహ్వానిస్తూనే ఉన్నయ్… పదండిరా, పదండి, చచ్చిపోదాం…
Share this Article