సంచయిత గజపతిరాజు… వేల కోట్ల రూపాయల మాన్సస్ ట్రస్టు ఛైర్మన్‌గా, సింహాచలం ధర్మకర్తల మండలి ఛైర్మన్‌గా ఆమె నియామకాన్ని కొట్టేసిన హైకోర్టు తీర్పుపై జగన్ ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్తుందా..? తను తీసుకున్న నిర్ణయాలను, జారీ చేసిన జీవోలను డిఫెండ్ చేసుకుంటూ, ఆమెను తిరిగి నిలబెట్టే ప్రయత్నాలు చేస్తుందా..? అవకాశాలున్నాయా..? ఆ కుటుంబ వారసురాలిగా ఆమె చేస్తున్న వాదనలకు అసలు చట్టబద్ధత ఉందా..? ఇంతకీ ఆమె బీజేపీలో ఉన్నట్టేనా..? లోకల్ బీజేపీ ఏమంటోంది..? ఒక మహిళ వంశపారంపర్య ఆస్తులకు, హోదాలకు, గౌరవాలకు, పద్ధతులకు వారసురాలు ఎందుకు కాకూడదు..? తప్పేముంది..?…… ఈ ప్రశ్నలన్నీ కాసేపు పక్కన పెడదాం… జగన్‌కు షాక్, చంద్రబాబు హర్షం, అశోక గజపతిరాజు విజయం గట్రా రాజకీయ వ్యాఖ్యానాలూ విస్మరిద్దాం కాసేపు… ఆ ట్రస్టు నిబంధనల మేరకు ఆమె నియామకం కరెక్టు కాదు అని తేల్చింది హైకోర్టు… అందరూ బోలెడంత రాసేశారు కాబట్టి అదీ వదిలేద్దాం కొంతసేపు…. మనం కాస్త వేరే కోణంలోకి వెళ్దాం… ఏమిటంటే..?
ఇది పీవీజీ రాజు వ్యవస్థాపక ఛైర్మన్‌గా 1958లో సొంతంగా ఏర్పాటు చేసుకున్న ట్రస్టు… చాలా దేవాలయాలు, భూములు, విద్యాలయాలతో అది ఒక వ్యవస్థ… తమ కుటుంబంలోని మగవాళ్లు, వయస్సులో పెద్దవాళ్లు ఈ ట్రస్టుకు చైర్మన్‌గా, ట్రస్టు పరిధిలోని గుళ్లకూ అనువంశిక ధర్మకర్తల మండలి ఛైర్మన్‌గా ఉండాలని ఓ నిబంధన పెట్టారు… ఎల్డెస్ట్ మేల్ లీనియల్ డిపెండెన్సీ… అప్పట్లో మగవారసత్వాలే చలామణీ కాబట్టి ఆ నిబంధన కరెక్టే అనుకుందాం… ఆయన మరణం అనంతరం ఆనంద గజపతిరాజుకు పగ్గాలొచ్చాయ్… తరువాత ఆయన నిర్యాణం అనంతరం అశోక గజపతిరాజు చేతికి ఆ పగ్గాలు మారాయ్… ఇప్పుడు ఆయన వయస్సు 70 ఏళ్లు… తరువాత ఎవరు అనేది ప్రశ్న…! ఎందుకంటే..? ఆనందగజపతిరాజు ఒక భార్య కూతురు ఊర్మిళ, విడాకులు తీసుకున్న భార్య కూతురు సంచయిత… అశోకగజపతిరాజుకు అదితి… మగవాళ్లు లేరు… మరి అప్పుడైనా సరే, ఎవరో ఒక మహిళకు ఆ పగ్గాలు రావల్సిందేనా..? తప్పదా..? అయితే ఎవరు..? ఈ ప్రశ్న ఎందుకొచ్చిందీ అంటే..? వయస్సులో పెద్దవాళ్లు, మగవాళ్లు అర్హులు అనే రూల్ ఉంది కాబట్టి…!!
Ads
ఒక ట్రస్టు పూర్తిగా వంశపారంపర్యమే అయినా సరే, ఆ నిబంధనలన్నీ ఇక మార్చడానికి వీల్లేనివా..? ఇదీ డిబేటబుల్ ప్రశ్నే… ఇక్కడ ఆస్తులు, ఇతర యవ్వారాలనూ కాసేపు వదిలేస్తే… అంత పెద్ద వ్యవస్థ పగ్గాలు, సింహాచలం వంటి గుడికి ఛైర్మన్ గిరీ పొందడం, కుటుంబపెద్దగా పరిగణనలోకి రావడం చిన్న విషయాలేమీ కావు… ఒకవేళ రూల్ ప్రకారం అదితి, ఊర్మిళ, సంచయిత అర్హులు కానప్పుడు… మరెవరు..? ఇక్కడ చాలామందికి తెలియని కొన్ని ట్విస్టులున్నయ్… అది మనం ‘ముచ్చటించుకుందాం…’ ఎందుకంటే..? వీళ్లకన్నా పెద్దవాళ్లు, మగవారసులు వేరే ఉన్నారు కాబట్టి…! పీవీజీ రాజుకు మరో భార్య ఉండేది… ఆమె ద్వారా కలిగిన సంతానంలో ఇద్దరు మగవాళ్లు… ఒకరు అలోక గజపతిరాజు, మరొకరు మోనిష్ గజపతిరాజు…
వీరిలో మోనిష్ పెళ్లిచేసుకోలేదు… అలోక గజపతిరాజుకు ఓ కొడుకు… విహాన్ గజపతిరాజు… అలియాస్ సిద్ధార్థ… తల్లి ఉత్తరప్రదేశానికి చెందిన మహిళ… విడాకులు తీసుకుంటేనేం..? ఆ కుటుంబ వారసత్వ హక్కులు, గౌరవాలు నాకూ దక్కుతాయి అనే సంచయిత వాదనే కరెక్టు అయితే అలోక గజపతిరాజు, ఆయన కొడుకు సిద్ధార్థకు కూడా ఆ హక్కులు ఉన్నట్టే కదా… ఇలా రేప్పొద్దున అశోక గజపతిరాజు తరువాత అలోక గజపతిరాజు, కాదంటే మగవారసుడిగా తన కొడుకు ఈ పారంపర్య అంశాలన్నింటికీ వారసులే అవుతారు కదా…! అయితే ఆమె విడిపోయినప్పుడు ఏవో ఆస్తులు గట్రా రాసిచ్చి అప్పట్లో పీవీజీ రాజు సెటిల్ చేసేశాడు… ఆ కుటుంబం కూడా విజయనగరం ఆస్తులు, రాజకీయాలకు దూరంగా చెన్నైలో ఉండిపోయారు… ఈ వ్యవహారాలను ఎప్పుడూ పట్టించుకోలేదు, పట్టించుకోవడం లేదు…
ఆ కుటుంబం అశోక గజపతిరాజుతో సత్సంబంధాలనే మెయింటెయిన్ చేస్తోంది… ఏవైనా శుభకార్యాలున్నప్పుడు కూడా వస్తారు… ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే..? ఒక కుటుంబ వ్యవహారాన్ని ప్రభుత్వం ఎందుకు డిస్టర్బ్ చేస్తోంది..? మోటివ్స్ ఏమిటి..? గతంలో ఎన్టీయార్ ఈ ట్రస్టును ప్రభుత్వపరం చేయాలనుకున్నాడు… కానీ అశోక గజపతిరాజు సర్దిచెప్పాడు… కన్విన్స్ అయిన ఎన్టీయార్ తరువాత దాని జోలికి పోలేదు… అంతేకాదు, వైఎస్ గానీ, రోశయ్య గానీ అశోక గజపతిరాజుకు వ్యతిరేకంగా వెళ్లలేదు… ఆ వ్యవహారాల్లో ఇన్వాల్వ్ కాలేదు… నా తరువాత ఎవరు..? అని అశోక గజపతిరాజు ఎప్పుడైనా ఆలోచించాడా..? తన మదిలో ఏమైనా ఉందా..? ఈ కుటుంబానికి దూరంగా ఉంటున్న అలోక గజపతిరాజు గానీ, మోనిష్ గజపతిరాజు గానీ ఈ వ్యవహారాల్లోకి ఎంటరవుతారా..? కాదంటే మగవారసుడిగా సిద్ధార్థ వస్తాడా..? అసలు మహిళలు ఈ పారంపర్య హక్కులకు ఎందుకు అనర్హులు అనే సంచయిత లేవనెత్తుతున్న ప్రశ్నకు జవాబు ఉందా..? ఏమో… కాలం తేల్చాలి..!!
Share this Article