పావురాలు శాంతిదూతలు, శాంతిపతాకలు, శాంతిసూచికలు మాత్రమే కాదు… ప్రేయసీ ప్రియుల నడుమ సమాచార వాహకాలు… ప్రియుడు గానీ, ప్రియురాలు గానీ తమ మనస్సుల్లో భావాల్ని పావురాలతోనే పంచుకునేవాళ్లు… అప్పట్లో మరి మొబైళ్లు, వాట్సపులు లేవు కదా… తెలుగు సినిమాలే కాదు, అనేకానేక భాషల్లో పావురాల మీద అనేక పాటలొచ్చినయ్… కానీ మనకు స్వాతంత్ర్యం కూడా రాకముందు 1945లో తెలుగులో ఓ పాట వచ్చింది… అది కాస్త విశేషం… సినిమా పేరు స్వర్గసీమ… నిజానికి ఈ సినిమాకు స్వరసారథ్యం ప్లస్ హీరో చిత్తూరు నాగయ్య… కానీ ‘ఓహోహో పావురమా’ అనే ఈ పాట మీద మాత్రం బాలాంత్రపు రజనీకాంతరావు ముద్ర ఉంటుంది… తనే పాట రాశాడు, తనే ట్యూన్ చేస్తానన్నాడు, నిర్మాతలు వోకే అన్నారు… నాగయ్య కూడా స్నేహభావనతో సరేనన్నాడు… ముందుగా ఆ పాట చదవండి ఓసారి… (1962లో వచ్చిన ఓహో ఓహో పావురమా అనే మంచిమనసులు పాట కాదు ఇది… అది పూర్తిగా వేరు, షావుకారు జానకి మీద జానకి పాడిన పాట అది…)
ఓ ఒహోహో… పావురమా
వెరపేలే, పావురమా!
Ads
తరుణ యౌవనము పొంగి పొరలు
నా వలపు కౌగిలిని ఓలలాడ రావే
తనకు తానై వలచి పిలిచే
తన్వి మోహమని చుల్కన సేయకుమా
మీరు చదివింది నిజమే… అంతే, ఆ పాట ఆ రెండుమూడు వాక్యాలే… ఇందులో సాహిత్యం ఏం ఏడ్చిందీ అంటారా..? భలేవారే… చాలా ఏళ్లపాటు అది సూపర్ హిట్ క్లాసిక్ సాంగ్‌గా ఆదరణ పొందింది… అసలు విశేషం ఏమిటంటే… దీన్ని పాడింది భానుమతి… మామూలుగా తన పాటల్లో వేరే కూతల్ని ఆమె అంగీకరించదు… ఆమె పాటల్ని ఆమే పాడుకుంటుంది… కానీ ఇందులో ఎక్కువ భాగం ఆహాహా, ఓహోహో వంటి కూనిరాగాలే… మరో విశేషం ఉంది… ఇది 75 ఏళ్ల క్రితం పాట… అప్పట్లో సినిమా పాటలు, పాత్రలు అన్నీ మడికట్టుకునేవే కదా… పైగా భానుమతి మరీనూ… ఎవడు ఆమె చేయిపట్టుకోవడమో, కౌగిలించుకుని రొమాన్స్ చేయడమో అంగీకరించేది కాదు… పైగా ఇప్పుడు చాలా కామన్ అయిపోయిన చంకలు, బొడ్డు షోలు గట్రా అప్పట్లో నిషిద్ధం… భానుమతి వేషంలో అస్సలు ఊహించలేం… ఇవన్నీ గాకుండా పాత్రౌచిత్యం కూడా చూసేది ఆమె… అంటే నాయిక పాత్ర కాస్త ఉదాత్తంగా ఉండాలి…
కానీ ఈ పాటలో మటుకు ఆమె స్లీవ్ లెస్ జాకెట్ వేసుకుంటుంది… వ్యాంప్ తరహా పాత్ర… హీరోను కవ్విస్తూ, ఏమోయ్, నాఅంతట నేను పిలిస్తే చులకన అయిపోయానా, ఇక్కడ యవ్వనం పొంగిపోతోందోయ్ అంటూ కవ్విస్తూ ఉంటుంది ఈ పాటలో… భానుమతిని అలా చూడటం కాస్త విస్మయంగానే ఉంటుంది… అప్పటికి 19 ఏళ్ల పడుచు ఆమె… అప్పుడప్పుడే కొత్తగా పెళ్లయింది కూడా… ఐతేనేం, ఈ కవ్వింత పాటను అలా రక్తి కట్టించేసింది… ఇప్పుడు ఆ పాట వింటే, చూస్తే నవ్వొస్తుందేమో మనకు… కానీ అప్పట్లో అదే హిట్… సాహిత్యమూ ఏమీ లేదు, సంగీతమూ పెద్ద ఆకట్టుకునే ట్యూన్ కాదు… హీరో ఓచోట కూర్చుని రాసుకుంటూ ఉంటాడు, ఈమె పాడుతూ నాలుగు అడుగులు అటూఇటూ నడిచి, నాలుగు లుక్కులు ఇస్తుంది… అంతే… అదే మరి, పాట రెండుమూడు లైన్లే కదా, అది కూడా హీరోకు లైన్ వేసేదే కదా అనుకోకూడదు… ఆ లైన్ జనానికి నచ్చిందా లేదా అనేదే ముఖ్యం…!!
Share this Article