ఆదానీ… మోడీకి అత్యంత సన్నిహితుడుగా చెప్పబడుతూ… అంబానీలకు దీటుగా… కాదు, దాటి ఎదుగుతున్నాడు… కానీ ఒక ఝలక్… ఏమిటీ అంటే..? ఆయన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన మూడు విదేశీ సంస్థల ఖాతాల్ని నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్ఎస్‌డీఎల్) స్తంభింపజేసింది… దాంతో ఒక్కసారిగా షేర్ల ధరలు పడిపోయి ఆయనకు 55 వేల కోట్ల మేరకు నష్టం వాటిల్లింది… నో, నో, అదేమీ లేదని ఆదానీ గ్రూపు ఖండించింది… కానీ విదేశాల నుంచి వచ్చినట్టు చెబుతున్న దాదాపు 43 వేల కోట్ల సందేహాస్పద లావాదేవీలు ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశం… ఆ మూడు సంస్థలూ మారిషస్‌లోని పోర్ట్‌లూయీస్ అడ్రస్ అట… ఒకటే చిరునామా అట… వాటికి కనీసం వెబ్‌సైట్లు కూడా లేవట… అంటే ఏదో భారీ గోల్‌మాల్ ఉన్నట్టేనా..? సరే, ఇవన్నీ అందరూ రాశారు, రాస్తున్నారు, రాస్తారు… అయితే మొదట దీన్ని పసిగట్టి, బహిరంగం చేసి, అలర్ట్ చేసిన వాళ్లు ఎవరు..? అరవయ్యేళ్ల ఓ లేడీ జర్నలిస్టు… పద్మశ్రీ అవార్డు గ్రహీత… పేరు సుచేత దలాల్… అసలు ఎవరీమె..?
ధార్వాడ్‌లో బీఎస్సీ స్టాటిస్టిక్స్ చదివిన ఈమె తరువాత ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కూడా పూర్తిచేసింది… 1984లో ఫార్చూన్ ఇండియా అనే మ్యాగజైన్‌లో బిజినెస్ జర్నలిస్టుగా కెరీర్ స్టార్ట్ చేసింది… (దలాల్ అనే పేరుకు అర్థం వ్యాపార పరిభాషలో దళారీ అని…) తరువాత బిజినెస్ స్టాండర్డ్, ఎకనమిక్ టైమ్స్… తరువాత కొన్నాళ్లకు టైమ్స్ ఆఫ్ ఇండియాలో బిజినెస్ న్యూస్ వింగ్‌లో చేరింది… 1992లో హర్షద్ మెహతా స్కాం, ఎన్‌రాన్ స్కాం, ఐడీబీఐ స్కాం, 2001లో కేతన్ పరేఖ్ స్కాం అన్నీ వెలికితీసింది… తరువాత టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఫైనాన్షియల్ ఎడిటర్… కొంతకాలం ఎక్స్‌ప్రెస్ గ్రూపు పత్రికల్లోనూ కన్సల్టింగ్ ఎడిటర్‌గా చేసింది…. వావ్… ఆమె కృషి, ఆమె సోర్స్, ఆమె సర్కిల్ రిలేషన్స్ అర్థం చేసుకోవాల్సిందే… 2006లో తన భర్త స్టార్ట్ చేసిన మనీలైఫ్ బిజినెస్ పక్షపత్రికకు రాయడం స్టార్ట్ చేసింది… దానికి మేనేజింగ్ ఎడిటర్… ప్రింట్ ఎడిషన్ ఆపేసి, పర్సనల్ ఫైనాన్స్ రంగంలో వెబ్‌సైటు నడిపిస్తున్నారు… ఆమె మొన్న ఓ ట్వీట్ చేసింది… ఇలా…
Ads
ఆదానీ గ్రూపు పేరు చెప్పకుండానే… సెబీ ట్రాకింగ్ సిస్టమ్స్‌కు కూడా చిక్కకుండా షేర్ల ధరల్ని రిగ్గింగ్ చేస్తున్నారు… ఇదీ ట్వీట్… బిజినెస్ సర్కిళ్లలో ఉన్నవాళ్లకు ఇట్టే అర్థమైంది… ఆదానీ గ్రూప్ షేర్ల ధరలు భారీగా పడిపోయాయ్… ఆ గ్రూపు నుంచి ఆరు లిస్టెడ్ కంపెనీలున్నయ్… ఎన్ఎస్‌డిఎల్ మూడు విదేశీ ఖాతాల్ని స్తంభింపజేయడంపై ఎకనమిక్ టైమ్స్ ఓ స్టోరీ ఇచ్చింది… ఇదీ కలకలం… ఐతే ఆ గ్రూపు ఈ వార్తల్ని ఖండించి, ఎలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలూ లేవని క్లారిటీ ఇచ్చింది… NSDL ఫ్రీజ్ చేయడం అబద్దం అని వివరణ ఇచ్చింది… అదంతా వేరే కథ… మనం చెప్పుకునేది ఆ జర్నలిస్టు అలర్ట్ చేయడం గురించి… పసిగట్టడం గురించి… 60 ఏళ్లొచ్చినా ఇంకా అదే కమిట్‌మెంట్‌తో పనిచేస్తున్న తీరు గురించి… సబ్జెక్టు నాలెడ్జి ఉన్నవాళ్లు నిరంతరం నిఘా వేసి ఉండాల్సిన అవసరం గురించి…!!
Share this Article